2020*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2020 వ సంవత్సరంలో - 2020* వ నాటి శ్రమదాన వైవిధ్యం.

          సంఖ్యాపరంగా కొంత చిత్రంగాఉన్న ఈ నాటి వేకువ జామున కూడ 4.00 కే శ్రమదాన సందడి మొదలై రెండు గంటల పాటు పాగోలు బాటలోని మహాబోధి దక్షిణపు సాంచి స్థూపాకార మహాద్వారం సమీపంలో 48 మంది స్వచ్చ కార్యకర్తల గ్రామ సామాజిక బాధ్యతలు నెరవేరాయి! పాతకాలం సినిమా కవి (పింగళి నాగేంద్రరావు) పాట వ్రాసినట్లు –

          “ఐనా – మనిషి మారలేదూ – ఆతని మమత మారలేదు.....”

అన్నట్లుగా ఈ 2020* వ నాటి సుదీర్ఘ స్వచ్చ సంకల్ప కధ మారలేదు. ఈ గ్రామపు చివరి కాలుష్యపు వ్యధ తీరలేదు...నిన్నటి కన్న మరికొందరు కార్యకర్తలు అదనంగా వచ్చి, ఈ మండు వేసవి ఉక్కపోత నెదిరించి, చెమటలు చిందించి, పాగోలు బాట శుభ్రతను, ఆకృతిని మరికొంత మార్చారు. ఇష్టపడి సాధిస్తున్న ఆత్మ సంతృప్తిదాయక  కృషిలో వీరి చెమట చుక్కల కంపులే రేపటి స్వచ్చ సుందర ఉభయ గ్రామాల ఇంపుసొంపులు! వీళ్ళ నిస్వార్ధ గ్రామహిత చర్యలే రేపటి శ్రమైక జీవన సమాజపునాదులు!!

          మహాబోధి ఉభయ ద్వారాల నడుమ పెరిగిన చిట్టడివి మీద గత నాల్గు రోజుల సమరంతో ఇవాళ్ళ ఏడెనిమిది మంది – “ఔను వాళ్ళు – అడవిని జయించారు.” మరొక అడవి మీద కూడ దండెత్తారు.

          10 మంది పాగోలు కార్యకర్తలు గ్రామం దిశగా బాట రెండు పార్శ్వాలను కశ్మల రహితం కావిస్తూ – నిన్నటి కృషిని కొనసాగించారు. మొక్కలకు కంప కట్టే – చెట్ల బోదెలకు గూడ రక్షణ కల్పించే – మొక్కల కుదుళ్ళను సరిచేసే నలుగురు తమ బాధ్యతను మరువలేదు.

          ఇక మరొక దారిలో పూల వనాలను శుభ్రం చేసే – గొంతులెండుతున్న వందలాది మొక్కలకు నీరందించే ట్రస్టు ఉద్యోగుల కృషీ యధాతధమే!

          బండ్రేవు కోడు మురుగు వాగు వంతెన గోడల సింగారం ఈ రోజు పూర్తి కావచ్చు అనుకొన్నారు గాని, ఇంకా ఒకటి రెండు చిత్రాలు, తుది మెరుగులు రేపటికి శేషించాయి! వీళ్ళ గ్రామ సుందరీకరణ ఆనందాన్ని, వర్ణమయ చిత్ర లేఖన సౌందర్య లోకాన్ని నా మాటల్లో కాక – శాస్త్రి గారి ఛాయా చిత్రాల్లో కనిపెట్టండి!

          దాలిపర్రు గ్రామస్తుడు – ప్రస్తుత రామానగర నివాసుడు నాగేశ్వరరావు గారి త్రిగుణాత్మక చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన వైభవ పరిపూర్తి!

          రేపటి నవోదయ – గ్రామాభ్యుదయ శ్రమదాన బాధ్యతల కోసం మరొకమారు ఈ పాగోలు బాటలోని మహాబోధి చెంతనే మరింత మందిమి కలుసుకొందాం!

         ఈ తాత్త్విక చింతనతో...

స్వచ్చోద్యమ చల్లపల్లి చరితార్ధం బెందుకనిన...         

తమ సమాజ ఋణం తీర్చు తాత్త్విక చింతన తోడుగ

స్వచ్చ హరిత వేడుకలను స్వాగతించి గ్రామంలో

పర్యావరణ రక్షణ పెను బాధ్యతలను మోయడం!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శనివారం 23/05/2020,

చల్లపల్లి.