2026* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2026* వ నాడు దిగ్విజయంగా ముగిసిన పొరుగు పంచాయతీ బాట శ్రమదానం!

 

నేటి ప్రత్యేకమైన వేకువ 3.59-6.10 వేళల నడుమ- 38 మంది శ్రమదాతలు పాల్గొన్న చల్లపల్లి- పాగోలు మార్గపు స్వచ్చ-సుందరీకరణం చాలా వరకు ముగిసింది. మిగిలిన కొద్దిపాటి పనులికపై పాగోలు పిల్లల వంతు! కేవలం కిలో మీటరు కన్నా తక్కువ దారిలోని కాలుష్యం మీద – అవకతవకల మీద 19 రోజుల పాటు- ఇందరి సమరం ప్రత్యక్షంగా చూడని- ఎక్కడెక్కడో ఉన్న ఉభయ గ్రామాల వారికి నమ్మశక్యం కాక పోవచ్చు. నా వివరణలు అతిశయోక్తులుగానే అనిపించవచ్చు కూడ! (కొన్నాళ్ల క్రితం ఈ కార్యకర్తల్లో ఒకాయన- పూర్వాశ్రమంలో అస్మదీయ శిష్యుడు-“ ఈ ఉదయ శ్రమదానం మీద మీ వ్రాతలు చాలా బాగున్నాయి గురువు గారు! అక్కడక్కడ వర్ణనలు కాస్త ఎక్కువౌతున్నాయేమోనండి” అని అభినందనో- విమర్శో చేశాడు!)

 

ఏం చేస్తాం- అలాంటి చిన్న లోపమెదైనా ఉంటే- అది “ ఎండనక, వాననక, మంచులో తడుస్తూ- తమ కోసం కాక గ్రామం మొత్తం శుభ్ర పడి, అందంగా, ఆహ్లాదంగా ఉండి గ్రామస్తులంతా సుఖ పడాలని లక్షల గంటల నుండి శ్రమిస్తున్న ఇందరు కార్యకర్తలదనుకోండి! తమ లక్ష్యం సాధించేందుకు లక్షల- కోట్ల డబ్బు ను తమ సమయాన్ని, సర్వ శక్తుల్ని కూడదీసుకొని ఖర్చు చేస్తున్న ఈ ఉద్యమ నాయకత్వానిదనీ, విరాళాలిస్తున్న దాతలదనీ కూడ గుర్తించండి!

 

ఇక్కడ గమనార్హం ఏమంటే- నిజం లాంటి అబద్ధాలు గాని, అర్థ సత్యాలు గాని, అభూతకల్పనలు గాని, పర నిందలు- ఆత్మ స్తుతులు గాని ఈ వ్రాతల్లో లేవు!

 

ఈ నాటి కార్యకర్తల 2 గంటల శ్రమను, 19 నాళ్ల ఈ బాట మెరుగుదల పరిపూర్తి సమయంలో వారి సంతృప్తిని, ఉద్వేగాలను అర్థం చేసుకొన్నప్పుడు ఇలాగే వ్రాయాలి మరి!

 

- సుందరీకరణ బృందం కల్వర్టు అందచందాలను నిన్న నే తీర్చిదిద్దారు గాని, పాగోలు దిశగా ఎడం వైపు గోడ మీద రంగులు వేసి, ఎట్టకేలకు ఈ రోజే దాన్ని పూర్తి చేశారు. (వీరిలో ఒకాయన మళ్లీ రోడ్డు వార ఖాళీగా మిగిలిన ట్రాన్స్ ఫార్మరు దిమ్మె వంక చూస్తున్నాడు!)

 

- డ్రైను ఉత్తర గట్టును శుభ్ర పరిచిన వాళ్లు, ఆ గట్టు మీద, వ్యర్ధాలను ఊడ్చిన వాళ్లు, తాడి చెట్ల మట్టల్ని నరికి, చెట్ల కొమ్మలు ట్రిమ్ చేసిన కార్యకర్తలు, మొత్తానికి నేటితో పాగోలు దారిలో పూర్తైన తమ కృషి ఫలితాన్ని గమనించుకొని, చర్చించుకొని, కాఫీ- తేనీటి ఆస్వాదనలు చేసి, 6.20 సమయానికి తమ గ్రామ మెరుగుదల కృషి సంకల్ప నినాదాలను ముమ్మారు కోట పద్మావతి గారు ప్రకటించగా పునరుద్ఘాటించి, నేటి గ్రామ బాధ్యతలు ముగించుకొన్నారు!

 

ఈ సమయంలో తానేమీ మాట్లాడక పోయినా, రామ బ్రహ్మం గారి ముఖంలోని సంతృప్తినీ, మాట్లాడిన శివాజీ మాస్టరు గారి చెమటలు దిగగారుతున్న దృశ్యాన్ని నేను మరువలేను. 30 మందికి పైగా కార్యకర్తల - సుమారు 3 వారాల శ్రమ సుందర ధన్యతను, ఎంత కష్టమైనా- అది తమ సొంతానికి కాకున్నా- ఇష్టపడి సాధిస్తున్న వీరి దృఢ సంకల్పాన్ని – దాని పరమార్ధాన్ని గుర్తుంచుకొంటాను!

 

రేపటి మన గ్రామ కర్తవ్య నిర్వహణ వీర బ్రహ్మేంద్రుని ఆలయ, అవనిగడ్డ దారిలోని బండ్రేవుకోడు మురుగు కాల్వ సమీపమని నేటి నిశ్చితం!

 

     హరిత సుందర చల్లపల్లి

స్వచ్చోద్యమ చల్లపల్లి సంరభం ఎట్టి దనిన...

సామాజిక ఋణ విముక్తి తాత్వికతే పునాదిగా-

ముప్పై వేలకు పైగా మొక్కలిలా నాటి- సాకి

హరి విల్లును తెచ్చి ఊరి నందగించు ప్రయత్నం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శుక్రవారం 29/05/2020,

చల్లపల్లి.