పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!
ఆలస్యంగా వెలువడిన తొలి బృందం ఛాయాచిత్రం - 3956*
“ఆ కార్యశూరుల ఫొటో ఎక్కడ – అలస్యమెందుకు” – వంటి వివరాలలోకి వెళదాం రండి!
సమయం - మంగళవారం (15.9.26) వేకువ 4.20 కి బదులు 4:25 కు స్థలం భగత్ సింగు గారి డెంటలాస్పత్రి ముందు; కాలుష్య శత్రువులైన ఆ స్వచ్ఛ కార్యకర్తలు 13 మంది!
5 నిముషాల ఆలస్యకారణం - వాళ్లు నిన్న నిర్ణయించుకొన్న పనిస్థలం గ్రామ ముఖ్య 3 రోడ్ల కూడలికి బదులు – ముందుగా అక్కడికే వెళ్లి, నిన్నటి పండుగకు ప్రోగుబడవలసిన బళ్ల కొద్దీ వ్యర్ధాలు మచ్చుకైనా కనపడక - వెనుదిరిగి 1 కిలోమీటరు దూరం వచ్చుట!
ఇక అక్కడి నుండి 6:05 దాక - నీళ్లలో, బురదలో 2-3 చోట్ల వారు కాలుష్యాల మీద సాగించిన కదనములో :
1) ముందుగా ప్రధాన వీధి కాలుష్య కదనరంగానికి దూరంగా – మునసబు వీధిలోని కర్మల భవనం వెనుక తట్టున 7-8 మంది అదేదో పెళ్లింటి వద్ద శుభ్రపరచినట్లు - సమయాన్ని పట్టించుకోకుండా (6.05 కు నేనే వెళ్లి వాళ్లను ఒప్పించి తీసుకురావలసి వచ్చింది!) చేసిన కృషీ,
2) ఇద్దరు వృద్ధ బలిష్ట కార్యకర్తలతో సహా ఆరేడుగురు వైజయంతి ప్రాకారము ప్రక్కన నీళ్ళలో నిలిచి, బండెడు గడ్డిని పీకి, లాగిన దృశ్యమూ (ఇందులో ఒక రుధిర దానాగ్రేసరుడి నడుము దాక బురద మందంగా పేరుకొన్నదైతే మరీనూ!)
3) ఆ వందేళ్ల ప్రహరీ ద్వారం పైకెక్కి పిచ్చిచెట్లును తొలగిస్తున్న మెండు కార్యకర్తా,
4) బురదలో కాళ్లు దిగిపోతున్నా వీధి ఉద్యానంలో 6 గురు పని చేసుకుపోతున్న గొప్ప సన్నివేశమూ,
5) ట్విల్స్ దుకాణం ఎదుట పట్టి పట్టి శుభ్ర - సుందరీకరిస్తున్న నలుగురూ,
ఆ పనుల ఏకాగ్రతను మళ్లీ మళ్ళీ చూస్తూ తన్మయుడౌతున్న DRK మహాశయుడూ,
ఇక ఆ 100 నిముషాల పనులు ముగించి, కాఫీ సేవించి, దంత వైద్యశాల ఎదుట కూర్చొనీ, నించొనీ గంధం లక్ష్మణ చేస్తున్న ప్రతిజ్ఞలను పునరుద్ఘాటిస్తున్న 31 మంది ఉత్సాహాన్ని...... నేను చూశాను - విన్నాను.
NRI సూర్యవర్ధన్ తరపున నేను 10,000/- చెక్కును డాక్టరు గారికి ఇచ్చిన వైనమూ, ఆయనేమో అగష్టు నెల ఆయ – వ్యయ పట్టికను వివరించి,
రేపటి పని చోటు కూడ భగత్ సింగ్ వైద్యశాల ప్రాంతమే అని నిర్ణయించి, నేటి కార్యక్రమము ముగిసెను!
పరమ పుణ్యకార్యంబని
పరిశీలకులంటారిది పరమ పుణ్యకార్యంబని
సగం మంది గ్రామస్తులు సర్వోత్కష్టంబిది అని
చరిత్ర కారు లేమందురొ సాముహిక శ్రమను గూర్చి
మరిచి పోవ తగినదనా? సమాజపు మేల్ మలుపనా?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
15.09.2026