3957* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!

బుధవారం(16-9-26) వేకువ సపర్యలు కూడ బందరు వీధికే!@3957*

               సపర్యలు 24+1 (+1 మనిషి ట్రస్టు ఉద్యోగి- చివరికి వచ్చాడు) = 25 మందివి; ఆసపర్యలు డజను మంది 4:22 కే ప్రారంభించారు; 6:00 కు ముగించవలసి ఉండగా ఒకానొక ముదురు (=సీనియర్) కార్యకర్త-లక్ష్మణుడు గట్టిగా ఈల వేస్తేగాని - ఇద్దరు ప్రసాదులు- S.P & J.Pలు  మెహెర్ వడ్లమిల్లు వీధి నుండి 6.06 కు గాని పని ముగించి, భగత్ సింగ్ ఆస్పత్రి వద్దకు తిరిగి వచ్చారు!(- ఈ ఉభయులూ కాఫీలక్కడ సేవించరు)!

               ఈలోగా మిగిలిన వారు కమ్మని కాఫీ రుచులనుభవిస్తూ-నేటి, రేపటి వీధి సేవల స్వచ్ఛ ఊసులాడుకొంటూ అదోరకమైన సత్సంగం నిర్వహించారు!

               ఈ ఊరి వాళ్లు కొంతమంది బందరు రోడ్డులో వస్తూ- వెళుతూ స్వఛ్ఛ, శుభ్ర స్పృహతోనో, అర్ధ సృహతోనో “ఈ వీధి చాలా చక్కగా ఉందే” అనుకొంటారు. అంతకుమించి-“వారం రోజుల్లో ఈ ½  కిలోమీటరు విశాలమైన రోడ్డులో ఏంమార్పులు వచ్చాయి, ఎందుకొచ్చాయి” అనిలోతుగా పరిశీలించరు!

               ఈ వేకువ గంటకు పైగా సమయంలో నేనా పని చేశాను:  పద్మావతి ఆస్పతి బాటసరే- అదెట్లగూ వంక పెట్టలేని వీధే-గస్తీ గది మొదలు రిలయన్స్ రిటైల్స్ దాక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు గోతాంనింపుకొంటూ-

               “ఈ వీధి ఎందుకిలా పరిశుభ్రత, పచ్చదనాలతో కళకళలాడుతున్నది? 3వ నాడు కూడ- బృందావన, పసుపులేటి, లక్ష్మణ, నరసింహది7గురు కర్మలభవనం ఆవరణనెందుకంతగా తీర్చిదిద్దారు? కోడూరు, అంబటి, అడపా, భోగాది, జూనియర్ కస్తూరి  వంటి మహనీయ కార్యకర్తలు వైజయంతం ప్రహరీ బారునా ఎంత కష్టపడితే ఈ వీధి దర్శనీయంగా మారింది? మహిళామణులతో సహా ల్యాబ్ ఉద్యోగి రవి రోడ్డు దక్షిణపు డ్రైను నుండి గుట్టలు గుట్టల వ్యర్ధాల్నెలా బైటకు లాగారు?

               -ఇందులో కొందరు 10 నిముషాలకొక మారైన నడుమెత్తి విశ్రాంతి తీసుకొనరా? ల్యాబ్ ఉద్యోగిని సుమతి ఉత్సాహంగా మూడేసి నినాదాలు ప్రకటించనేల? రోజుటి వలెనే కార్యకర్తలంత పట్టుదలగా వాటికంత గట్టిగా స్పందించనేల?

               రేపటి వేకువ బాధ్యతలకై మనం కలవవలసింది “రిలయన్స్ దుకాణం వద్ద” అని చివరికి కొందరు ధృవీకరించనేల?” అని ఆలోచిస్తూనే ఉన్నాను!         

               చాటింపులు కోరుకొనవు

సత్కార్యము లెప్పుడైన చాటింపులు కోరుకొనవు

చల్లపల్లి శ్రమదానము జాతి గర్వకారణ మని

పుష్కర కాలమును మించి అపూర్వముగా జరిగెనని నా

దేశ చరిత తప్పకుండ దీని ని గుర్తించ గలదు!   

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   16.09.2026