పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు వాడడానికి సిగ్గు పడదాం!
@3964* బుధవారం (23-9-26) 24+2 మంది శ్రమ ఎలాంటిదంటే – -
వాతావరణ శాఖ వారి హెచ్చరిక ప్రకారం ఇది 3 రోజుల తుఫానులో మొదటి అంకం! చినికి చినికి గాలివానగానైతే మారలేదుగాని దానికి ముందస్తు సూచనలైతే స్పష్టమే! భారీ వర్షం లేదు గాని, సామాన్య గ్రామస్తులు మాత్రం ఏ ఒక్కరిద్దరో తప్ప జనసంచారమే లేదు!
మరి, ఇలా శనిలా వదలకుండా సన్నగా - చిరాకుగా పడుతున్న చినుకులలో కూడ - తమ సొంతానికి కాక - ఊరుమ్మడి ప్రయోజనం కోసం 4:21 నుండి 6:03 దాక (ముగ్గురైతే 7 గంటల దాకా) మెహెర్ మిల్లు వీధిలో శ్రమను ధారాదత్తం చేసిన పాతిక మందిని ఏమనాలి?
శరీరాలు కాస్తంత అలసినా, వడ్లమర ఆవరణలోకి తడుస్తూనే తిరిగి వచ్చిన ముఖాల్లో సంతృప్తిని ఎలా కొలవాలి?
కామినేని భవన విభాగ సముదాయం ఎదుట - నిన్నా మొన్నా మురుగులో అరవచాకిరీ చేసింది చాలక – సిమెంటు రోడ్డు భద్రతకు బరంతు వేసి, చదును చేసిన కోడూరు - అంబటి ద్వయాన్నీ, వడ్లమర ద్వారం వద్ద ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రిస్కీ బాధ్యతలు చేపట్టిన కస్తూరి సోదరుల్నీ, సాధనాల - తూములూరి- భారత సంచార నిగమ మాజీ ఉద్యోగినీ, వాళ్ళు కోరుకోకున్నా కాస్తంత అభినందించాలా - వద్దా?
చెత్త బండి సర్దుడులో నిపుణుడే గాని – అంజయ్య గారెందుకో ఆ బండిలోనే జారిపడెనట గానీ - అతడాదెబ్బను లెక్కచేయని వైనాన్ని గుర్తుపెట్టుకోవద్దా?
అసలివన్నీ కాక - గట్టి ప్రసాదులిద్దరూ, మల్లంపాటి కార్యకర్తా మిగిలిన వాళ్లంతా పనులు విరమించినా, 2 మార్లు విజిల్ ఊదినా, కాఫీల వేళ దాటి, సతీష్ మైకులో నినాదాలు వినిపించినా,
DRK గారి దైనందిన సమీక్ష ముగిసినా,
తమ మిల్లు ఆవరణలోకి వచ్చినందుకు వలదని వారిస్తున్నా వినక కాకరపర్తి సురేశ్ గారు మళ్ళీ బిస్కట్లూ, కేకులూ పంచిన తరువాతైనా, కార్యకర్తలందరూ ఇళ్లకు తిరిగి వెళ్లినా -
వాసిరెడ్డి పంతులు గారి మినీ గార్డెన్ పునస్సౌందర్య సాధనకు అంకితులైపోతే - ఆ పట్టుదలను “మితిమీరిన వ్యసనము” అంటే బహుశా అందులో ఒకాయనకు కోపం వచ్చినా రావచ్చు!
తుఫానో గిఫానో - రేపటి వేకువ కూడ మళ్ళీ ఈ భారతలక్ష్మి వడ్లమిల్లు వీధిలోనే తమ గ్రామ బాధ్యతలు పూర్తి చేయాలని కార్యకర్తల నిర్ణయం!
స్వచ్ఛ కార్యకర్తలు పేక్షించరు
అదిచిల్లల వాగో- బండ్రేవుకోడు మురుగు కాల్వొ
శివరామపురం రోడ్డో - R.T.C. బస్ స్టాండో
ఊరికి సంబంధించిన ఉద్యానమొ - రోడ్డు గుంటొ
స్వచ్ఛ కార్యకర్తలు పేక్షించరు తమ బాధ్యతలను!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
23.09.2026