1869 * వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1869* వ నాటి శ్రమదాన విశేషాలు.

 

 ఈ మార్గశిర మాస ఉషోదయ శీత వాయువులను, మంచును లెక్క చేయని 33 మంది స్వచ్చ కార్యకర్తలు విజయవాడ మార్గంలోని బాలాజీ ఆపార్ట్ మెంట్లు దగ్గర ఆగి, 4.00-6.28 నిముషాల నడుమ గ్రామం కోసం తమ శ్రమదాన చర్యలకు పదును పెట్టారు.

 

అపార్ట్ మెంట్ భవన దక్షిణ పార్శ్వంలోను, ఉత్తరంగా చిల్లల వాగు దిశ గాను దారి ప్రక్క ఖాళీ చోటులను, మురుగు కాల్వలను-అక్కడి పిచ్చి మొక్కలను, అన్ని రకాల వ్యర్ధాలను గొర్రులతో లాగి, కత్తులతో నరికి, రోడ్డు మీదకు గుట్టలుగా లాగి, ట్రస్టుకు చెందిన ట్రాక్టరు లోని కెక్కించి, సమీపంలో నే ఉన్న చెత్త కేంద్రానికి తరలించారు. ఎక్కడా రాజీ పడని వీరి స్వచ్చ-సుందరీకరణ కృషితో 6.30 సమయం తర్వాత ఆ 200 గజాల సువిశాల-శుభ్ర సుందర విజయవాడ మార్గాన్ని గమనించండి!

 

ముగ్గురు నిబద్ధ కార్యకర్తలదొక ప్రత్యేక చర్య. పూల మొక్కల, వాటి పాదుల మారామత్తును చేపట్టి, అక్కడి గడ్డి, పిచ్చి మొక్కల్ని తొలగించి, వంగిన మొక్కల్ని నిటారుగా నిలిపి, ఊతమీయడం వీరికభిమాన పాత్రం! ఆక్రమంలో వీళ్లు ఈ వేకువలో ముసలివిగా కనిపిస్తున్న- తామే నాలుగేళ్లు నాడు నాటి పెంచిన- ఇప్పుడు ఒరిగిపోయిన బోగన్ విలియా చెట్లను కొన్నిటిని నిలబెట్టి, ట్రిమ్ చేసి, ఊత కొయ్యలతో, త్రాడుతో కలిపి కట్టి దర్శనీయంగా మార్చారు.

 

ఇక గ్రామ సుందరీకరణ దళం దృష్టి ఈ రోజు మాసిపోయిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన గోడలపైన బడింది! రెండు ప్రక్కల గోడలను శుభ్ర పరచి కడిగి, తుడిచి, ప్రైమర్ పూసి, ఆరిన పిదప జీబ్రా రంగులతో అలంకరించారు. ఇదే కాదు-అంద విహీనంగా రహదారుల ప్రక్క ఏ గోడ కనిపించినా నచ్చక వీళ్లు చేసే పని అదే!

 

రహదారి ప్రక్క పంట పొలంలోను, ఖాళీ ప్రభుత్వ స్థలంలో కూడ నాల్గు రోజులు తర్వాత మళ్లీ కార్యకర్తలు శుభ్ర పరచవలసిన అవసర మేర్పడింది. ఆ పనిలో కొందరు లీనమైతే ముగ్గురు మహిళలు అదే పనిగా చీపుళ్ల తో విజయవాడ దారిని ఊడుస్తూ తన్మయులైపోయారు. పాత కాలంలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు “ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకూ- పూవులిమ్మని రెమ్మ రెమ్మకు... “ అంటూ నాజూకు నగిషీ కవిత్వం రాసినట్లుగా ఎవరూ నేర్పకుండానే – తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఈ కార్యకర్తలు తమ గ్రామం కోసం సహజ సిద్ధమైన శ్రమ దానంతో దారులూడుస్తూ-వేలాది మొక్కలను సంవత్సరాల తరబడి నారు పోసి , నీరు పోసి సంరక్షిస్తూ సుదీర్ఘ స్వచ్చోద్యమ ప్రయాణం కొనసాగిస్తున్నారు.

 

కృష్ణ దేవరాయల కఠోరమైన ఉషోదయ వ్యాయామాన్ని చూస్తూ అల్లసాని పెద్దన మను చరిత్ర కావ్యంలో ఉభయ దిశల్లో కనిపించిన సూర్య-చంద్రులు ఆ చక్రవర్తి చేతుల్లో ఉన్న వ్యాయామ గోళాలుగా వర్ణించాడు! తొలి ఉషోదయ రేకలు విరుస్తున్న నేటి ఉదయం 6.00 సమయంలో మన డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు గారు విజయవాడ దారిలో కనిపించిన- ఒక వంక గ్రామ స్వచ్చ కంకణ ధారులైన మన కార్యకర్తల తో, మరోవంక ఎడ్ల బండి చలనంతో సహజ సుందరమైన దృశ్యం యొక్క ఛాయా చిత్రాన్ని గమనించండి- భావుకులు తమ ఊహల్ని ప్రకటించండి!

 

నేటి తేనీటి – స్వల్పాహారాల పిదప సమీక్షా సమావేశంలో అయ్యప్ప దీక్షుతుడైన మన మిత్రుడు కోడూరు వేంకటేశ్వర రావు రేపు మధ్యాహ్నం 12.30 కు “ చద్ది కట్టు” వేడుక సందర్భంగా కార్యకర్తలందరినీ భోజన- భాజనాలకు, ఆహ్వానించి, తన నెల చందాను 520/-ను మనకోసం మనం ట్రస్టుకు విరాళంగా యిచ్చి , గ్రామ స్వచ్చ- శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించి, నేటి కర్తవ్యాన్ని ముగించారు.  హీరో హోండా షో రూమ్ శ్రీను గారు 3000/- విలువ చేసే 10 వెలుగు దివ్వెలను కార్యకర్తలకు బహూకరించారు ఉభయులూ అభినందనీయులు!

 

రేపటి మన శ్రమదానం కూడ బాలాజీ అపార్ట్ మెంట్ల దగ్గరే ప్రారంభిద్దాం!  

 

         చిన్న అదృశ్య రేఖ

నిజ నిర్ధారణ మొక్కటి-భట్రాజు పొగడ్త ఒకటి

ఒకోసారి రెంటి నడుమ ఒక చిన్న అదృశ్య రేఖ

స్వచ్చ చల్లపల్లి సైన్య చర్యలు కీర్తించునపుడు

సదా జాగరూకతతో చలిస్తుంది కలంఎపుడు!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 24/12/2019

చల్లపల్లి.