1870* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1870* క్రిస్టమస్ నాటి కృతార్ధత!

 

          ఇంచుమించు నిన్నటి చోటే – అంటే విజయవాడ దారిలోనే బాలాజీ భవన విభాగాలకు ఉత్తర దక్షిణ దిశలలో 4.06 - 6.30 నిముషాల మధ్య నెరవేరిన గ్రామ బాధ్యతలలో పాల్గొన్న వారు 33 మంది. ఉత్తర దిశగా వేబ్రిడ్జి నుండి ఆగిన చోటు దాక ఊడ్చి – గుట్టలు చేసిన వివిధ వ్యర్ధాలు ట్రస్టు సంబంధిత ట్రక్కుకు సరిపోయినవి.

 

          రహదారి కిరుప్రక్కల, రెండు డ్రైన్లలోని ఎండు తుక్కును, కరెంటు ఉద్యోగులు నరికిన కొమ్మల్ని, పిచ్చి మొక్కల్ని, గడ్డిని కొందరు కత్తులతోను, కొందరు గొర్రులు, చీపుళ్లతోను నరికి లాగి, పొగులు పెట్టితే –

 

          నలుగురు కార్యకర్తలు బోగన్ విలియా తదితర పూల మొక్కల పాదులను చక్కదిద్ది – పక్కలకు సాగుతున్న కొమ్మలను నిటారుగా నిలిపి,పైన గట్టి కొమ్మలకు త్రాళ్లతో బిగించి కట్టారు. ఏనాటిదో గాని – ఒక పాత ట్రీ – గార్డు తనంతట తానే కుప్పకూలితే – ఆ వ్యర్ధాలను కూడ ఏరి – ఊడ్చి – తొలగించారు.

 

          ముగ్గురు మహిళలు తదేక దీక్షతో మళ్ళీ ½ కిలోమీటరు పర్యంతం సొంత ఇంటిని ఊడ్చినంతగా శుభ్రం చేశారు.

 

          మాజీ Z.P.T.C కృష్ణ కుమారి గారు సకుటుంబంగా వచ్చి, తమవంతు గ్రామ బాధ్యతలు నెరవేర్చి, క్రిస్టమస్ కేకుతో బాటు అల్పాహారం పంపిణీ చేశారు. ట్రస్టు ఉద్యోగి ఆనందరావు బిస్కట్లు పంచాడు.

 

          అడపా గురవయ్య క్రీస్తు సందేశ సంస్కరణతో – డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు గారి నేటి కృషి, సమీక్షతో – కృష్ణ కుమారి గారు చెప్పిన విశాఖ యాత్ర విశిష్టలతో నేటి సమావేశం ఉల్లాసభరితంగా సాగింది.

 

          6 వ నెంబరు పంట కాలువ వంతెన గోడలకు సుందరీకరణ బాధ్యులు ఈ రోజు రెండవ విడత రంగులు పూశారు. ఇపుడా వంతెన ఆకర్షణీయంగా ఉన్నది.

 

          పైడిపాముల నీలేష్ కృష్ణ ముమ్మారు నినదించిన స్వచ్చ సుందర సంకల్పంతో 6.55 కు నేటి మన గ్రామ బాధ్యత ముగిసింది.

 

          రేపటి మన శేష కృషిని కాటా వంతెన దగ్గర నుండి ప్రారంభిద్దాం!  

 

              గొప్ప ఆనవాయితి

ఈ సమాజమున చూడని ఈ కొంచెం నిజాయితి

వ్యక్తులందు లుప్తమైన పరుల కొరకు శ్రమ నిరతి

తన సమయం తనకె గాక గ్రామనికె అర్పించుట

స్వచ్చ చల్లపల్లి సైన్య సభ్యుల ఆనవాయితి!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 25/12/2019

చల్లపల్లి.