1871* వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!  

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1871* వ నాటి శ్రమదాన వేడుక!

 

           నేటి వేకువ 4.06-6.25 నిముషాల మధ్య విజయవాడ మార్గంలోనే జరిగిన గ్రామ స్వచ్చ శ్రమదానంలో పాల్గొన్న ఆదర్శ కృషీ వలులు 34 మంది.

 

నేటి శ్రమదానం మూడు విధాలుగా జరిగినట్లు చెప్పుకోవచ్చు.

 

- సుందరీకరణ దళం – 5గురు 6 వ నంబరు పంట కాలువ వంతెనను, నారాయణరావు నగర్ బాట ప్రక్కన సారా బాట్లింగ్ కంపెనీ ఉత్తరపు ప్రహరీ గోడను, సుందరీకరణ తమ లక్ష్యాలుగా ఎంచుకొన్నారు. ఇందులో ఒకరు వంతెన గోడలకు గత రెండు నాళ్లు పూసిన రంగులకు పరిపూర్ణత కోసం  ప్రయత్నిస్తుండగా, నలుగురు ఆకర్షణీయమైన వివిధ వర్ణాలతో స్వచ్చోద్యమ స్ఫోరక చిత్రాలను ప్రహరీ గోడపై తీర్చిదిద్దుతున్నారు.

 

- సుమారు 20 మంది కాటా వంతెనకు దక్షిణ భాగంలో డ్రైను లను ప్రక్కన లోపలి గట్టును సమీప ఖాళీ స్థలాన్ని స్వచ్చ-శుభ్ర-సుందరం చేస్తుంటే ముగ్గురు మహిళలు తదేక దీక్షతో విజయవాడ రహదారిని పదేపదే ఊడ్చి తమ మనస్సులకు, వచ్చే పోయే ప్రయాణీకుల కు ఆహ్లాదానికై శ్రమిస్తున్నారు.

 

- మిగిలిన వారు కాటా వంతెనకు ఉత్తర దిశలోని విజయవాడ దారిలోని అదుపు తప్పిన చెట్ల కొమ్మలను సరిదిద్ది కొన్ని బోగన్ విలియా ముసలి మొక్కలను నిటారుగా నిలిపి అవసరమైనంత కత్తిరించి పడుచు  చెట్లుగా

మారుస్తున్నారు.

 

- పావు లక్షకు పైగా చెట్లను, పూల మొక్కలను ట్రస్టు కార్మికులు నీళ్ల టాంకర్లతో జీవధారలందిస్తూ శ్రమించారు. (...... ఇదేదో ప్రాచీన కవులు చేసే రాజుల యుద్ధ, రాణుల సౌందర్య వర్ణనలనుకునేరు! నేటి నిస్వార్థ శ్రమ దాతలు తమ ఊరి కోసం చిమ్మ చీకటిలో, చలిలో యథార్ధంగా చేసిన కృషి వివరాలే సుమా!)

 

కాఫీ, టీ సేవానంతర సమీక్షా సమావేశంలో నా గ్రామ స్వచ్చ – శుభ్ర- సౌందర్య సంకల్ప నినాదాలను కొంత భిన్నంగా ముమ్మారు నేనే ప్రకటించగా 6.55 నిముషాలకు నేటి స్వచ్చతా యుద్ధం ముగిసింది.

 

ఈ గ్రామస్తుడు కాని 72 ఏళ్ల ప్రాతూరి శంకర శాస్త్రి గారి మీద ఆయన మన కార్యకర్తలలో రగిలిస్తున్న స్ఫూర్తి మీద నేను వ్రాసిన కొన్ని పద్యాలను శాస్త్రి గారితో బాటు కార్యకర్తలందరికీ విసిగించకుండానే వినిపించాను.   

 

రేపటి మన శ్రమదాన ఉత్సవం చిల్లల వాగు సమీపంలో కొనసాగిద్దాం.

 

          డిగ్రీలూ- అర్హతలూ

“దినదినమొక గంటన్నర” ఇదేమంత అసాధ్యమా?

మన ఊరికి మన సేవలు మహోత్కృష్ట త్యాగమా?

డిగ్రీ తదితర అర్హత దీనికేల మిత్రమా!

స్వచ్చోద్యమ చల్లపల్లి జగతికి ఆదర్శమా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 26/12/2019

చల్లపల్లి.