1849* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1849* వ నాటి ప్రయత్నాలు.

 

ఈ వేకువ కోట ప్రక్క శివాలయం నుండి విజయవాడ మార్గంలో పెట్రోలు బంకు దాక జరిగిన స్వచ్చ శ్రమదానం 28 మంది ద్వారా 4.03-6.10 మధ్య విజయవంతమైంది.

 

అంతకు ముందు ఈ రోడ్డు కొంత వరకు శుభ్రంగానే ఉన్నది గాని, దాని ఉభయ పార్శ్వాలు, డ్రైను చూచి తట్టుకోలేనట్లున్నవి. కాఫీ-టీ కప్పులు, చిత్తు కాగితాలు, అంటుకుపోయిన మట్టి పెచ్చులు, దుమ్ము, ఇసుక...”ఇవేవీ మా స్వచ్చ కృషికి కావు అనర్హం” అనుకొంటూ మూడు బృందాలుగా గంటన్నర కు పైగా వీరు శ్రమించిన పిదప ఈ ½ కిలో మీటరు మేర విజయవాడ దారి చూడ ముచ్చటగా కనిపిస్తున్నది.

 

రోడ్డుకు ఎడమ వైపున సుందరీకరణ బృందం తమ పద్ధతిలో మార్జిన్లను క్షుణ్ణంగా శుభ్రపరస్తుంటే- డ్రైను లోపలి పిచ్చి మొక్కల్ని ఇద్దరు తొలగిస్తుంటే- కుడివైపున్న ముళ్ల-పిచ్చి- మొక్కల్ని నలుగురు కత్తి వీరులు(ఇందులో ఒకాయన సవ్యసాచి-రెండు చేతుల్లో రెండు కత్తులన్నమాట!) అగ్రహారం లోని దారుల మొదట శుభ్ర పరుస్తుంటే- బికనీర్ హోటల్ దగ్గరి డ్రైను, మొక్కలు, పూల మొక్కల కొమ్మలు  కొందరు చక్కదిద్దుతున్నారు.

 

మండల రెవిన్యూ, మండల పరిషత్ కార్యాలయాల ముందు, వాటి ఎదుటి హోటళ్ల దగ్గర, ఆ తరువాత NTR పార్కు ప్రాంతంలో దారిని శుభ్రం చేయడం మరికొందరి పని.

 

“రెస్క్యూ టీమ్” బందరు రోడ్డు మీద కనిపించిన మట్టిని, రాళ్ల వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపుకొని, అవసరమైన మరొక చోట సర్ది వచ్చారు.

 

తేనీటి సేవానంతర సమీక్షా సమావేశంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కస్తూరి వర ప్రసాద్ ప్రతి రోజూ స్వచ్చ శ్రమ దానానికి రాలేక పోతున్నందుకు విచారించి, కారణం కూడ చెప్పి, గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రకటించారు.

 

నవంబర్ మాసానికి గాను “మనకోసం మనం” ట్రస్టు యొక్క ఆదాయ-వ్యయాలను డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు వివరించారు.(సుమారుగా 7,90,000/- ఖర్చు; 7 లక్షల సమీకరణం!) అతిగా టెలివిజన్ కార్యక్రమాలు చూసే వ్యసనం, దాని అనర్ధాల గురించి ఆయన ప్రస్తావించగా కొంత చర్చ జరిగి, 6.40 నిముషాలకు నేటి మన గ్రామ బాధ్యత ముగిసింది.

 

రేపటి మన శ్రమదాన ప్రయత్నం బైపాస్ మార్గం (బికనీర్ హోటల్ వద్ద) ప్రారంభించాలని నిర్ణయించారు.

 

        ఈ స్వచ్చోద్యమ కవితలందు...

పునరుక్తుల దోషాలో-సమన్వయ రాహిత్యాలో

ఉదాత్తమహా స్వచ్చోద్యమ-ఉదాహరణ పొరపాట్లో

స్వచ్చోద్యమ చల్లపల్లి వర్ణనలో దొరల వచ్చు

అవగాహన సమస్యలూ అడ్డు పడే ఉండవచ్చు!

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 4/12/2019,

చల్లపల్లి.