2108* వ రోజు ....

స్వచ్చోద్యమ చల్లపల్లిలో - 2108* వ నాటి ముందడుగులు.

 

20.01.2021 - బుధవారం నాటి వేకువ 4:11 సమయానికే మొదలైన గ్రామ స్వచ్చోద్యమ కారుల ఉద్యోగ (ప్రయత్నం) సందడి ఏకధాటిగా - రెండు గంటలకు పైగా - 6.21 వరకూ కొనసాగింది. 31 మంది శ్రమదాతల కృషి కృతకృత్యమైన ప్రాంతం బందరు జాతీయ మార్గంలోని - రామానగరం సరిహద్దు దగ్గరి - 6 వ నంబరు పంట కాలువ పడమటి గట్టు మీద - ఆస్పత్రులకూ, అమలు లో లేని బియ్యం మరకూ నడిమిచోటు.

 

అసలు తొలుత నిర్ణయించుకొన్నదేమో - నేటి మెరుగుదల కృషి - కాలువ వంతెన దగ్గరతో బాటు, రహదారి స్వచ్ఛ - శుభ్ర ప్రయత్నం కూడ. కానీ, అవసరాన్ని బట్టి కార్యకర్తలందరూ కాల్వ గట్టు పైన మరింత ఉత్తర ముఖంగా కదిలారు. మూడు నాల్గు వారాల క్రిందట కార్యకర్తలు రెండు దఫాలుగా శుభ్రపరచిన చోటే ఇది! పంచాయితీ అధికారుల సమక్షంలో అడ్డాలను తొలగించి, మెరక పల్లాలను సరిజేసి, మొక్కలు నాటి సంరక్షిస్తున్న ప్రదేశమే! ఐతేనేం - అక్కడి టీ దుకాణాల వల్ల, తినుబండారాల కొట్ల వల్ల, కొబ్బరి బొండాల బేహారుల నిర్వాకం వల్ల, వచ్చే పోయే బాధ్యతారహితుల వల్ల మళ్ళీ ఇప్పుడు పూనుకోవలసి వచ్చింది! ఇక్కడ ఇనుప మెష్ అమర్చి, గేటు పెట్టి, కాల్వ గట్టు మరికొంత పొడవునా ఆహ్లాదకర ఉద్యానం సృష్టికి ఇది సన్నాహమట!

 

ఊరి స్వచ్ఛ - శుభ్రతలు విషయంలో గ్రామస్తుల్ని, ప్రయాణికుల్ని, బాధ్యత పాటించని కొందరు దుకాణ దారుల్ని  పంచాయతీ తదితర విభాగాలు మరింత ఒత్తిడిచేయక తప్పదనిపిస్తున్నది. స్వచ్చంద శ్రమదాతలు కేవలం తమ సుదీర్ఘ గ్రామ ప్రయోజన చర్యలతోనూ, సహనంతోను, సౌజన్యంతోనూ తప్ప - అధికారంతోను, దర్పంతోను, సదరు బాధ్యతా రహితుల మీద ఒత్తిడినో - భయన్నో కలిగించలేరు. కొద్ది దూరంలోనే స్వచ్ఛ కార్యకర్తల చెమటలు చిందే శ్రమదానం, ఆ సమీపంలోనే టీ దుకాణం ఎదుట డజను మందిలో ఒకరిద్దరు ఎంగిలి టీ కప్పును బాట మీద విసరడం!

         

గురజాడ కవి “దేశమంటే మనుషులోయ్... అని చెప్పిన దానికర్ధం - దేశమంటే బాధ్యత గల మనుషులోయ్” అని కూడ!

 

రెండు గంటల శ్రమార్పణ తరువాత - కాఫీల సమయంలో ల్యాబ్ రవి గారు సుస్ధిరంగా చల్లపల్లి స్వచ్ఛ - సుందర - సంకల్ప నినాదాలను విన్పించాక డాక్టరు. డి. ఆర్. కె గారు గతంలో మండల రెవెన్యూ అధికారి గారికి సమర్పించిన గ్రామ స్వస్తతా మెరుగుదలకై పాటించవలసిన మెలకువల విజ్ఞాపన పత్రాన్ని మరికొన్ని అంశాలను చేర్చి మరల మండల అభివృద్ధి అధికారి గారికి సమర్పించే ముందు - దానిని చదివి స్వచ్ఛకార్యకర్తల ఆమోదం పొందారు.

 

కార్యకర్తలకు పల్నాటి అన్నపూర్ణ గారి మిఠాయిల పంపకం నేడు కూడ జరిగింది. రేపటి మన ఆత్మ సంతృప్తికర చర్యల కోసం స్టేట్ బ్యాంకు ఎదుటనే 4.30 కే కలుసుకొందాం!

 

             పాటుబడే మహనీయులు.

ఒకరో - పదిమందొకాదు! వందలాది శ్రమదాతలు!

ఒక్కటొ - పదినాళ్ళొకాదు - రెండు వేల పని దినాలు!

తమకు కాదు - ఊరి కొరకు పాటుబడిన మహనీయులు

అందరికీ వందననాలు - అభినందన చందనాలు!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

20.01.2021.