2115* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2115* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలో శ్రమదాన విశిష్టతలు.  

ఈ శుక్రవారం (29-01-2021) నాటి వేకువ 4.24 సమయానికే – ఎక్కువ మంది గ్రామస్తుల్ని భయపెడుతున్న - మునగదీస్తున్న చలి - మంచులోనే - వాట్సాప్ ఛాయా చిత్రం ప్రకారంగా – పద ముగ్గురు, మరికొద్ది నిముషాలలోనే తమ తమ వాహనాలతో మరొక 19 మంది, వెరసి 32 మంది చల్లపల్లి గ్రామహితకారులు తమ దైనందిన శ్రమదానం ప్రారంభించి, రెండు గంటల పాటు ఒళ్ళు దాచుకోక శ్రమించి, ఊరి పారిశుధ్య లక్ష్య సాధనకై తపించి, 6.45 తరువాత సంతృప్తిగా వెనుదిరిగారు. వీళ్ళు ఆగినదీ, వాహనాలు నిలుపుకొన్నదీ – విజయవాడ బాటలోని చిన్న కార్ల కడుగుడు చోటే గాని, ప్రధానంగా వీళ్ళ దాడికి గురైంది 6 వ నంబరు పంట కాల్వ దగ్గరి నానాజాతికి కశ్మలాలే!

 

నిన్నటి లాగే ఇవాళటి కార్యకర్తల శ్రమదాన సందడంతా ఎక్కువగా రెండు ట్రాక్టర్లలో మట్టి నింపుకొని శ్మశానంలోని ఎత్తుపల్లాల సవరింపే! ఒకో ట్రక్కు దగ్గర పదేసి మంది చొప్పున అలుపు, సొలుపులతో గునపాలతో త్రవ్వే వాళ్ళు, పారలతో డిప్పల కెత్తేవాళ్ళు, (అందులో ఒక మహిళ) ఆ బరువు పాటి పెద్ద డిప్పను నేను – నేనని మోసుకుపోయి ట్రక్కులో నింపేవాళ్లు, మట్టి గడ్డల్లో ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ ను చాకచక్యంగా విడగొట్టే ఒకామె, ఈ నిస్వార్ధ శ్రమ వైభవాన్ని కెమేరా కంట్లో దాచి పెడుతున్న ఒక శాస్త్రి గారు, అవసరమైన ప్రతి కర్మ వీరుడికీ చప్పున మంచి నీళ్లందిస్తున్న ఒక బక్క ట్రస్టు కార్మికుడు.... – ఇలా ఆ అద్భుత శ్రమదాన క్షణాల్ని, సన్నివేశాల్ని తీరికగా వర్ణించాలంటే – అది చాంతాడంత స్వచ్చోద్యమ మహాభారతమై పోగలదు!

 

మరొక ప్రక్క 3  రోజులుగా – కర్ణాటక నుండి వచ్చి ఈ కోలాహలాన్ని కళ్ళార చూసి, ఆనందిస్తున్న 83 ఏళ్ల ఔత్సాహికుడు - లేచి నిలబడే శక్తి చాలకున్నా, కార్యకర్తలకు లైటు చూపి సహకరిస్తున్నాడు! ప్రముఖ వైద్యుడేమో వివిధ వాహన వేగాల సందర్భంలో అందర్నీ హెచ్చరిస్తూ సూక్ష్మంగా – తీక్షణంగా గమనిస్తున్నాడు! కాస్త దూరంగా ముగ్గురు “లెస్సో – హైలెస్సో” అని లయబద్ధంగా అరుస్తూ రోడ్డు పడమర దిశలో వికృతంగా – వెక్కిరిస్తూ పడి ఉన్న నిరర్ధక సిమెంటు దిమ్మెల్ని త్రాళ్ళు కట్టి లాగి, కాలువ గట్టు పల్లంలోకి లాగుతున్నారు.

 

ఇక్కడికి కాస్త దూరంలో ఐదుగురు తమ పనిలో నిమగ్నమయ్యారు – బరువైన గడ కత్తితో ఎత్తైన చెట్ల ఎండు కొమ్మల్ని లాగుతూ, బోగన్ విలియా చెట్ల తుక్కును లాగి, ఎండు పుల్లల్ని తొలగించి, పూల మొక్కల కుదుళ్ళను సవరిస్తూ – రహదారి అందాలకు మెరుగులు దిద్దుతూ!

 

స్వచ్ఛ చల్లపల్లి చిరకాల కార్యకర్తలైన పల్నాటి భాస్కర్ – అన్నపూర్ణల కొడుకు, కోడలు అయిన రాంచరణ్ -  లావణ్య లు నిన్న సాయంత్రం మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీ గారికి ఆదరాభిమానపూర్వకంగా 1000/- సమర్పించినందుకు స్వచ్ఛ కార్యకర్తలందరి ఆశీస్సులు, ధన్యవాదాలు.

 

ఆంధ్ర రాష్ట్ర మానవ హాక్కుల సంఘం నేతలూ, కృష్ణాజిల్లా కార్యకర్తలు నిన్న మన ఆదర్శ - స్వచ్ఛ - శుభ్ర – సుందర చల్లపల్లిని ఆమూలాగ్రంగా పరిశీలించి, పరవశించి, మెచ్చి వెళ్లారు.  

 

నేటి పని సమీక్షా సమావేశంలో – కాఫీల తరువాత – 6.40 కి గ్రామ మెరుగుదల కోసం నేనే ముమ్మారు ప్రకటించిన స్వచ్ఛ – స్వస్త – సమగ్ర – సుందర  సంకల్ప నినాదాలను అందరూ సహర్షంగా స్వాగతించి, ఇంటి దారి పట్టారు.

 

రేపటి వేకువ - 4.30 సమయంలో కూడ మన గ్రామ సామాజిక బాధ్యతల కోసం చేరుకోవలసిన చోటు – విజయవాడ దారిలోని కార్ల షెడ్డు వద్ద!

 

           శ్రమైక జీవన సౌందర్యాలను ...

శ్రమైక జీవన సౌందర్యాలను – చాటి చెప్పుటకు ఉందిగా

స్వచ్ఛ సంస్కృతుల నిలువుటద్దమై – చల్లపల్లి మిగిలిందిగా శ్రమైక జీవన

          సుమ సుందర ఉద్యాన పరిమళం – శుభ సందేశము పంపగా

          పర్యాటకులకు చల్లపల్లి ఒక – స్వర్గధామమైపోయెగా శ్రమైక జీవన

స్వచ్ఛ సైనికుల – ట్రస్టు కార్మికుల – చెమట బిందువుల సాక్షిగా

శ్మశానాలు, రహదారులు, వీధులు – స్వచ్ఛ సుందరము లాయెగా శ్రమైక జీవన

          ప్రతి గ్రామంలో చల్లపల్లి వలె -  స్వచ్ఛ – స్వస్తతలు నిండగా

          సమస్త దేశం ఆరోగ్యం – ఆనంద తాండవము చేయదా?

                   శ్రమైక జీవన సౌందర్యాలను – చాటి చెప్పుటకు ఉందిగా

                   స్వచ్ఛ సంస్కృతుల నిలువుటద్ధమై – చల్లపల్లి ప్రభవించెగా శ్రమైక జీవన   

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.

29.01.2021.