2116* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

చల్లపల్లి లో 2116 * వ నాటి స్వస్త- సుందర శ్రమదాన బాధ్యతలు.

 

ఇది వారాంతపు శనివారం(30.01.2021) కావడం తో కాబోలు బెజవాడ బాటలో-6 వ నంబరు కాలువ చెంత నెలకొన్న స్వచ్చోద్యమ శ్రమదాన వేడుకలోకి వచ్చి చేరిన వారి సంఖ్య.(13-20-26-33-42 గా) పెరిగింది.

 

 గ్రామ వివిధ విభాగాల నుండి-మెకానిక్ లు, మహిళలు, పెద్దలు, రైతుల చేరికతో నేటి గ్రామ స్వచ్చ-సుందరీకరణ కృషి కొక పరిపూర్ణత, కొత్త ఊపు వచ్చినట్లైంది! కాస్త వెనకా ముందు గా విచ్చేసిన దట్టమైన మంచులో, పనిలో కాక - ఖాళీగా ఉన్న వాళ్లను భయపెడుతున్న చలిలో, చాలీచాలని వెన్నెలలో, తలదీపాల వెలుగులో 4.22 నుండి 6.25 దాకా ఎడతెగక సాగిన సముచిత శ్రమదాన కోలాహలంతో ప్రయోజనకరమైన, ఆదర్శవంతమైన ఫలితమే వచ్చింది!

 

మట్టి వాసన, మట్టి విలువ తెలిసిన 20 మంది కార్యకర్తలు నిన్నటి తరువాయి బిగిసిన బురద మట్టిని పలుగులతో ఛేదిస్తూ, అందలి ప్లాస్టిక్ తుక్కును వేరు చేస్తూ, పారలతో డిప్పల కెత్తుతూ, ట్రాక్టరు ట్రక్కుల్లో నింపి, శ్మశానంలోని దహన వాటిక దగ్గరి పల్లాలను పూడ్చుతూ 2 గంటల కాలాన్ని సునాయసంగానూ, సార్థకంగాను వెచ్చించారు.

 

ఐదారుగురు స్వచ్చ-శుభ్ర- ప్రియులు మాత్రం, పంట కాలువ సమీపంలోని దారి పడమర ప్రక్క డ్రైనులో దిగి, పుల్లలు-ఎండుటాకులు-తిని, తాగి పారేసిన టిఫిన్ పొట్లాలు, మద్యం సీసాలు, ప్లాస్టిక్ సంచుల వంటివి ఏరుతూ, ఊడ్చుతూ, పిచ్చి-ముళ్ల కంపను నరుకుతూ- తమ ఉద్యోగం(= ప్రయత్నం) లో తామున్నారు.

 

అన్ని రకాల వాహనాల రొదలను, వేగాన్ని కాచుకొంటూ నలుగురు మహిళలు బాటను అంచులదాక ఊడ్చి శుభ్ర పరుస్తూనే ఉన్నారు!

 

అక్కడికి దూరంగా ఆరేడుగురు కార్యకర్తలు బోగన్ విలియా మొక్కల సేవలో- సుందరీకరణలో లీనమయ్యారు. వీళ్లు కాక కర్ణాటక ప్రవాసుడైన ఒక వయో వృద్ధ మూర్తి అతి కష్టమ్మీద లేచి, జాగ్రత్తగా-నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ 10 నిముషాల పాటు చీపురుతో రోడ్డు ను ఊడ్వడం కూడా చూశాను!  చివరలో వచ్చిన కార్యకర్తలకు మాత్రం చాలినంత పని దొరక లేదు.

 

ఈ రోజు 5 AM- కన్న ముందే- శాలువాలు కప్పుకొని, టీ కొట్ల దగ్గర తేనేరు సేవించి, ఖాళీ కప్పుల్ని దారి ప్రక్క పడేసే వారిని, గుడుల దగ్గరకు ముక్తి కోసం భక్తితో వెళుతున్నవారినీ, తమ తమ ఆరోగ్యాల కోసం ప్రయత్నిస్తున్న కొందరు పాదచారుల్ని గమనించాను. కాని వీళ్లలో కొందరైనా- తీరిక దొరికిన రోజైనా- అక్కడికి కూత వేటు దూరంలో 2116 * నాళ్లుగా జరుగుతున్న శ్రమదానంలోనికి రాకపోవడం- అది వారి అవగాహనలోపమో- స్వచ్చ సైనికుల ప్రయత్నంలోపమో తెలియడం లేదు!

 

6.40 కి కాఫీ పాన సమయం తదుపరి సమీక్షా తుది సందడి లో ముమ్మార్లు తన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను మారుమ్రోగించిన యువ కార్యకర్త ఉస్మాన్ షరీఫ్ (మెకానిక్). మోటారు వాహన విక్రయ ప్రలోభాలను హెచ్చరించినదేమో- హీరో మోటారు సైకిల్స్ విక్రేత దాసరి శ్రీనివాసరావు.

 

నిన్న- అవనిగడ్డ -గాంధీ క్షేత్రంలో  సాహిత్య- సంగీత శిఖరోన్నతులైన వేటూరి- బాల సుబ్రహ్మణ్యం గార్ల స్మరణను, జ్ఞాపక గ్రంధావిష్కరణను బుద్ధ ప్రసాదు గారు నిర్వహించారు.

 

 రానున్న ఎన్నికల పోటీ దారులను ఓటరు మహాశయులడగదగిన అంశాలను, గ్రంథావిష్కరణ విషయాలను  ప్రస్తావించిన వారు “ మనకోసం మనం” మేనేజింగ్ ట్రస్టీ డాక్టరు దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు!

 

మన రేపటి పారిశుద్ధ్య బాధ్యతల చోటు 6 వ నంబరు పంటకాలువ దగ్గరే. రేపటి వేకువ 4.30 కి మన పునర్దర్శనం.      

 

          ఇంకెవ్వరు- ఇంకెవ్వరు?

ఎవరు కలిసి నడిచినారు ఇన్ని మురుగు పనులలో?

పాలు పంచుకొనినదెవరు పారిశుద్ధ్య చర్యలలో?

అలుపెరుగని రెండు వేల దినాల శ్రామికులెవ్వరు?

చల్లపల్లి స్వచ్చ-శుభ్ర సైన్యం గాకింకెవ్వరు!

           

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.

30.01.2021.