2117* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2117* వ నాటి స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లి.

 

ఈ ఆదివారం(31.01.2021) నాటి మంచు ముసిరిన తొలి వేకువలో – 4.22 కే మొదలైన స్వచ్చోద్యమ కారుల బాధ్యతామయ పారిశుధ్య సంరంభం 6.20 కి గాని - ఇద్దరు పెద్ద వాళ్ళ పదేపదే అభ్యర్ధనతో గాని ముగియలేదు. నేటి వీధి శుభ్రతా కర్తలు 38 మంది. కార్యరంగమేమో విజయవాడ మార్గంలో, 6 వ నంబరు పంట కాలువ గాంధీ స్మృతి వనాల నడిమి చోటు. స్వభావ రీత్యా ఈ పని ముప్పేటలుగా జరిగిపోయింది అది కూడ చల్లపల్లి స్వచ్చోద్యమ ముఖ్యుని సారధ్యరహితం గాను, కార్యకర్తల స్వయం సారధ్యంలోను!

 

ఈ నాటి స్వచ్ఛ ఉద్యమ సందడిలో తొలిభాగం పంట కాలువ దక్షిణాన గ్రామ సచివాలయ పడమటి వైపునే కనిపించింది. అక్కడి నానా దుర్భర కల్మషాలు నిండిన డ్రైను మట్టిని రెండు ట్రక్కులలో ఒకే మారు పదేసి మంది కార్యకర్తలు పోటీ పడి, చలోక్తులు చమత్కారాల నడుమ నింపుకొని, రుద్ర భూమిలోని దహనవాటికల దగ్గరకు తరలించారు. ఇద్దరు మహిళా కార్యకర్తలకు బిగిసిన ఆ గడ్డల నుండి ప్లాస్టిక్ సంచులు, సీసాలు, పిచ్చి గుడ్డ ముక్కల్ని విడదీయడంతోనే సరిపోయింది. గంటన్నర కాలానికి పైగా ఆ 30 – 40 గజాల జాగాను  చూస్తుంటే చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ కర్మాగారం అనిపించింది! అదీ గాక శతాబ్దం క్రిందటే దేశ పారిశుధ్య సామాజిక రాజకీయ రంగాల్లో సమూల పరివర్తనలకు పూనుకొన్న గాంధీ మహనీయుని (విగ్రహ) సమక్షంలో ఈ తొలి సంధ్యలో ఈ పునర్నవీకృత చల్లపల్లి పారిశుధ్య కృషి మరింత సమంజసంగా తోచింది!

 

నేటి స్వచ్ఛతా సంరంభంలో రెండో భాగం పంట కాలువకు ఉత్తరాభి ముఖంగా డ్రైనులోని, దారి కిరుప్రక్కలా నెలకొన్నది. పడమటి డ్రైనులోని కల్మషాల మీద ఐదారుగురి, బెజవాడ బాట మీద దుమ్ము ధూళి మీద మహిళల చీపుళ్ళ పోరాటం జరిగింది. షరామామూలే కాలువ లోని, గట్టు మీది ప్లాస్టిక్ తుక్కుని, ఖాళీ సారా సీసాలని, ఎండు గడ్డితో సహా పిచ్చి ముళ్ళ మొక్కల్ని ఖండించి, దంతెలతోలాగి, ట్రాక్టర్ లో కెత్తి, డంపింగుకు చేర్చారు. కనీసం మరి రెండు నెలల దాక ఈ ప్రదేశాన్ని స్వచ్ఛ శుభ్ర సుందరంగా దీవించారు!

 

ఇక మూడోదళం అక్కడికి ఉత్తరంగా దూరంగా  రకరకాల పూల మొక్కల కుదుళ్లలోపాలను సరిదిద్దుతూ, అవసరమైన చోట్ల కత్తిరిస్తూ, మెరుగుపరుస్తూ తమకు సంతృప్తి  కలిగే దాక ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

21 వ శతాబ్దంలో చల్లపల్లి స్వచ్చోద్యమం ఎందుకు విశిష్టమైందనీ, 2117* రోజులకు పైగా నిరాటంకంగా ప్రవర్ధమానమౌతున్నదనీ కొందరిలాగే నేనూ ప్రశ్నించుకొంటే తట్టిన సమాధానమిది :

 

- ఇందులో గ్రామ చింతన తప్ప స్వార్ధ చింతనలేని కార్యకర్తలున్నారు.

 

- తమ సంపాదనలో కొంత భాగం గ్రామ సుందరీకరణకై వెచ్చించేవారున్నారు.

 

- ఫించను రావడమే ఆలస్యం స్వచ్చోద్యమానికి ఎడాపెడా ఖర్చు పెట్టే వ్యక్తులున్నారు.

 

- తన నగల్ని తాకట్టు పెట్టీ అమ్మేసీ వీధి సుందరీకరణలను సాధించే ఒకానొక మహిళ ఉన్నారు.

 

- ఈ ఉద్యమ లక్ష్యం నచ్చి. ఉద్యమ సారధులను నమ్మి, లక్షలాదిగా ధనవితరణపరులున్నారు.

 

          ఐతే ఇప్పటికీ ఈ శ్రమదానాన్ని ఉపేక్షిస్తూ నేటికీ పాల్గొనని కొందరు గ్రామస్తులెందుకున్నారు?

 

          6.40 సమయంలో కాఫీ ముచ్చట్ల పిదప జరిగిన నేటి పారిశుధ్య కృషి సమీక్షా కాలంలో గాంధీ విగ్రహ పాదపీఠం దగ్గర కూర్చుని ముమ్మారు ఈ గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించిన వారు నందేటి శ్రీనివాసుడు.

 

బుధవారం (03.02.2021) నాటి వేకువ 4.30 కు మనం కలుసుకోవలసిన చోటు ఈ జాతిపిత విగ్రహ ప్రాంతమే!

 

       ఇంకెవ్వరు- మరెవ్వరు?

నిస్వార్ధత నిబద్ధతల నిలువుటద్దమెవ్వరు?

మధ్యందిన స్వచ్చోద్యమ మార్తాండులు ఎవ్వరెవరు

స్వచ్చోద్యమ చల్లపల్లి సాహస జీవనులెవ్వరు?

స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలుగాకింకెవ్వరు!

     

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

31.01.2021.