2118* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి - 2118* వ నాటి కొన్ని విశేషాలు.

 

ఈ బుధవారం(03.02.2021) నాటి వేకువ కూడ 4.24 సమయంలో విజయవాడ దారిలో భారతీయ ఆత్మ ఐన గాంధీ గారి విగ్రహం సాక్షిగా కనీసం 16 మంది చల్లపల్లి సుందరోద్యమకారుల్ని వాట్సాప్ చిత్రంలో గమనించవచ్చు. మరికొద్ది నిముషాలలోనే వీరి సంఖ్య రెట్టింపై, 6.25 దాక ఈ నిష్కామ కర్మ వీరులు బెజవాడ మార్గంలో పంటకాలువ ఉభయ దిశల్లో అపరిశుభ్రత మీద, వికృతం మీద సాగించిన పోరాటం, తాము నివసించే ఊరి మెరుగుదల కోసం గ్రామస్తుల స్వస్తత కోసం పడే ఆరాటం స్వయంగా శ్రమదానం చేయకున్నా, ప్రతి వార్డు నుండి కొద్ది మందైనా వచ్చి చూసి అభినందించదగినవి! 5.30 తరువాత ఈ స్వచ్చోద్యమ శ్రమదాతల దగ్గరికి ఐదారుగురు అభ్యాగతులు సైతం (స్వకార్యం మీద) వచ్చి చేరడం ఒక విశేషం!

 

ప్చ్! 2000 రోజులకు పైగా ఈ అమాయకులు చేస్తున్నది ఒకటేగా రోడ్లు ఊడ్చడం, మురుగు తుడవడం, ప్లాస్టిక్ చిత్తులేరడం, రోడ్లు గుంటలు పూడ్చడం, చెట్లు నాటి పెంచడం, 6.30 వేళకి జై స్వచ్ఛ సుందర చల్లపల్లి”! అని బిగ్గరగా అరవడం ... ఆ! దీన్ని గూడ తెగ వర్ణించి, వ్రాసుకోవాలా.... అనుకొనే పుణ్యాత్ములింకా ఈ ఊళ్ళో ఉంటే ఉందురు గాక! గాంధీ మహాశయుని ఆత్మ ఏమిటో దాన్ని పునరావిష్కరిస్తున్న ఈ స్వచ్చోద్యమ సైనికుల స్ఫూర్తి ఎట్టిదో గుర్తిస్తున్న, అనుసరిస్తున్న సోదర గ్రామస్తులు కూడ చాలా మంది ఉన్నారు!

 

పంట కాలువ ఉత్తర దిక్కుగా ఎండి, గడ్డ గట్టి, సౌందర్య ప్రియుల కంట్లో నలుసుగా - రెండు నెలలుగా వెక్కిరిస్తున్న బురద మట్టి సంగతిని కొందరు చూసుకొన్నారు త్రవ్వి, డిప్పలతో మోసి, ట్రాక్టర్ లో నింపి, డంపింగ్ కేంద్రం దగ్గరకి చేర్చారు. మిగిలిన వాళ్ళు రెండు ముఠాలుగా విడిపోయి, రెండు డ్రైన్ల లో, గట్ల మీది పనికిమాలిన చెత్తా చెదారాలను పిచ్చి, ముళ్ళ మొక్కల్ని, ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ సారా సీసాలని, టిఫిన్ పొట్లాల తుక్కునీ ఏరి, తొలగించి, నరికి, ఊడ్చి, సుందరీకరించారు. ఇదంతా వేకువ చీకటిలోనే చలి, మంచులోనే వివిధ వాహనాల రద్దీ నడుమనే! ఆ రెండు గంటల కాలంలో కార్యకర్తల పనిలో నూరు శాతం మనః కేంద్రీకరణనూ, త్రికరణ శుద్ధినీ, సంకోచరాహిత్యాన్నీ చూచి తీరాల్సిందే!

 

6.25 నుండి కాస్త తీరికగా జరిగిన సమీక్షా కాలంలో ఝాన్సీ అనే సంగీతోపాధ్యాయిని రానున్న ఎన్నికలో తన పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధిత్వాన్ని పరిచయం చేసుకున్నారు. స్వచ్ఛ కార్యకర్తల పక్షాన డాక్టర్ డి. ఆర్. కె. ప్రసాదు గారు గ్రామహితము, పురోభివృద్ధి దృష్ట్యా సదరు అభ్యర్ధికి తమ కోర్కెల చిట్టాను చదివి వినిపించారు. ఈ విన్నప పత్రం సామాన్యం కానే కాదు. చిత్తశుద్ధితో పాటిస్తే చల్లపల్లి గ్రామ భవితవ్యాన్నే కాదు - శ్రద్ధగా అనుసరించాలే గాని, రాష్ట్ర – దేశ స్థితి గతుల్ని మార్చగలిగినది! సర్వకాల సర్వ దేశాలకూ వర్తించేది!

 

నేటి సమీక్షా సమయంలో ఈ గ్రామానికి అంకితుడైపోయిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయుడు శాస్త్రి గారు తాము నెలవారీగా స్వచ్చోద్యమానికందించే (ఇతర ఖర్చులు కాక) 5000/- విరాళాన్ని మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి అందించారు. గత ఏడెనిమిది నాళ్ళుగా ప్రాతః శ్రమదానానికి వస్తున్న వేమూరి అర్జునరావు గారు రేపు మరల కర్ణాటకకు బయలుదేరుతున్న కరువు తీర ముమ్మార్లు గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినదించి, ఒకింత ఉద్వేగం చెందారు!

 

రేపు వేకువ కూడ స్వచ్ఛ సైనికుల కర్మ భూమి విజయవాడ రహదారిలోని కర్మచంద్ మౌనవిగ్రహ ప్రాంతమే.

 

         ఊరి నిండుగ చిద్విలాసం. 

ఏళ్ల తరబడి రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్ఛ స్వప్నం

ఎందుకింతటి మహోత్సాహం ఎలా ఇందరి బృహత్ యత్నం?

విశాల బహుజన హితం కోరుచు స్వచ్ఛ సైన్యపు నిత్య సమరం!

గెలుపుతో చైతన్య ఝరితో గ్రామ మంతట చిద్విలాసం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

03.02.2021.