2119* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2119* వ నాటి చల్లపల్లి స్వచ్ఛ శుభ్ర – సుందరీకరణోద్యమం.

 

గురువారం (04.02.2021) నాటి వేకువన గ్రామ సామాజిక సౌకర్య ప్రయత్న ముహూర్తం 4.26 కే కుదిరింది. ఈ 26 మంది వీధి కాలుష్య నిరోధకుల శుభ సంకల్పంతో తీర్చి దిద్దబడిన ప్రదేశం బెజవాడ బాటలోని ఇంచుమించు నిన్నటిదే. కాకపోతే దానికి మరికాస్త పొడిగింపు! వీరిలో ఎక్కువ మంది ఛాయా చిత్ర నెపంతో దేశ అంతర్ – బాహిర పరిశుభ్రతా చార్యు (గాంధీ మహాత్ము)ని ఆశీస్సులు పొందడాన్ని వాట్సాప్ లో గమనించండి – ఎండ, వాన, చలి , మంచు, కరోన వంటి వాటికి వెరవని, గ్రామ సర్వతోముఖ స్వస్తతకే కంకణం కట్టుకొన్న స్వచ్ఛ సైనికుల మహత్తర  కార్యచరణను చూచి, నమ్మి, సోదర గ్రామస్థ్హులు అనుసరించగలరని నా విన్నపం!

 

యధావిధిగా పది మంది స్వచ్ఛ కర్మిష్టులు స్మృతి వనం దగ్గరి రహదారి తూర్పున ఉన్న ఎండిన బురద మట్టిని పెళ్లగించి, ప్లాస్టిక్ తుక్కును విడగొట్టి, సీసా పెంకుల్ని, గుడ్డముక్కల్ని, చెరకు పిప్పిని, ఇంకా అందరూ అసహ్యించుకొనే నానాజాతుల కశ్మలాన్ని విభజించి, మట్టిని ట్రాక్టర్ లో నింపుకొని, రుద్రభూమి లోని దహనవాటికల నిర్మాణ ప్రదేశంలోని గుంటలను పూడ్చి వచ్చారు. మరి ఈ శ్రమలో గృహిణులకూ భాగస్వామ్యముందని మరువవద్దు.

 

ఇక, సుందరీకర్తలది అదొక కొత్త ప్రయత్నం. పంట కాలువ ఉత్తర దిక్కున డ్రైను నుండి పంచాయితి వారు వెలికి తీసి రెండు నెలలుగా రోడ్డు వార పడి ఉన్న ఎండు బురద మట్టిని, రాతి ముక్కల్ని సద్వినియోగపరుస్తూ – వానలకు కోసుకుపోయిన కాల్వ గట్టు బాటలో సమంగా సర్ది, చిన్న పాటి రోడ్డును నిర్మించి, రైతుల సమీప ప్రజల రాకపోకలను సుఖమయం చేశారు!

 

స్వచ్చోద్యమ కారుల మూడవ గుంపు సైతం పంట కాలువలోను, కుడి ఎడమల బాటలోను శ్రమిస్తూనే ఉంది. వీరు మోకాళ్ళు నొప్పి పెడితేనో, గట్టు మీద కాలు జారుతుందనుకొంటేనో – మరేం ఫరావాలేదు – మట్టిలోనే చతికిలబడి జరుగుకొంటూ, అనువుకనిపెడుతూ ఎండు గడ్డిని, పిచ్చి ముళ్ళ కంపల్నీ తెగనరికి, దంతెలకందిస్తారు! హుషారు కోసం కొన్ని జోకులు పేలడం, కాకలు రేగడం, కేకలు పెట్టడం షరామామూలే! అదంతా కార్యకర్తల – అందులోనూ కొందరు పెన్షనర్ల దైనందిన సంతృప్తిలో మింజుమలె! (అంతర్భాగం)

 

తమ ఊరి  స్వచ్ఛ – సుందరీకరణ కృషికి సోదర గ్రామస్తులు ఖేదిస్తున్నారో, మోదిస్తున్నారో – ఎందరు సముఖులో, ఎందరు సుముఖులో, ఎందరు విముఖులో .... పట్టించుకోక ఈ సత్కర్మ వీరులు తమ స్వయం నిర్దిష్ట బాధ్యతలో ఇన్ని వేల దినాలు ముందుకు సాగడమే ఒక వింత!

 

ఈ నాటి కాఫీ – తదనంతర సమీక్షా – సరదా సమావేశంలో – అదీ ఒక మౌనతపోధారుని పాద పీఠం దగ్గర జరిగిన ముగింపు ముచ్చటలో :

 

 - చల్లపల్లి స్వచ్చోద్యమ చిరకాల కార్యకర్త పైడిపాముల కృష్ణకుమారి పాల్గొని, గ్రామ పరిపూర్ణ  స్వచ్ఛ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు వినిపించారు.

 

- విశ్రాంత ఉద్యోగి కోడూరు వేంకటేశ్వరరావు గారు క్రమం తప్పని తమ నెలవారీ చందాను మనకోసం మనం మేనేజింగ్ ట్రస్టీకి 520/- సమర్పించారు.

 

- చల్లపల్లి గ్రామ పోస్టల్ కార్యాలయ ఉద్యోగి, స్వచ్చోద్యమ చల్లపల్లిలో చిరకాల సుస్తిర ఆదర్శ కార్యకర్త మెండు శ్రీనివాస్ ఆరేళ్ల నాటి తన శ్రీమతి మెండు నాగచంద్ర ప్రామాదిక మృతి చిహ్నంగా ఈరోజు స్వచోద్యమ ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయల సమర్పించినందుకు  మన అందరి కృతజ్ఞతలు.  

 

- కృష్ణకుమారి గారు తమ రానున్న పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించి, తనకు కార్యకర్తల అభిమత (ఓటు) ప్రదానాన్ని అభ్యర్ధించినపుడు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారు ఆమె ముందు మోహమాటరహితంగా – గ్రామ స్వస్తతా భవితవ్యం దృష్ట్యా కార్యకర్తల కోర్కెల – నిబంధనావళిని తెలియజేశారు!

 

ఈ బెజవాడ దారి మరింత శుభ్ర – సుందరీకరణం పూర్తయ్యేదాక – బహుశా మరో మూడు – నాలుగు రోజులు మన వీధి పారిశుధ్య బాధ్యత ఇక్కడే ఉండవచ్చు.

 

రేపు వేకువ 4.30 సమయానికి మరల మనం మహాత్ముని మౌన విగ్రహం దగ్గరే కలుసుకొందాం!

 

         ఎంతెంతో సులభసూత్రము.

స్వచ్ఛత లోపిస్తేనే సర్వరోగముల కూడిక

శుభ్రత పాటిస్తేనే సుఖశాంతులు, సుస్వస్తత

అది సామాజిక భద్రత – అదెగద నీ – నా బాధ్యత!

ఇది ఎంతో సులభ సూత్ర మిదె మన భవితకు భద్రత!   

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

04.02.2021.