2120* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2120* రోజుల నధిగమించిన చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం.

 

చల్లపల్లి గ్రామ సుదీర్ఘ స్వచ్ఛ – సుందర ప్రయత్నంలో ఈ శుక్రవారం (05.02.2021) నాటి వేకువన 4.26 కే మొదలైన కార్యకర్తల సముచిత బాధ్యతలు సుమారు రెండు గంటల పాటుగా - 26 మందితో లెక్కేస్తే – మొత్తం 50 పని గంటల పర్యంతం బహుముఖ సౌకర్యవంతంగా సాగినవి.

 

నిన్న – మొన్నటి వలెనే నేడు కూడ విజయవాడ మార్గంలోనే – గ్రామ సచివాలయ, ప్రభుత్వోన్నత పాఠశాల ప్రాంతంలోనే – బాట ప్రక్క మట్టి దిబ్బలను త్రవ్వితీస్తూ, రోడ్ల గుంటలు పూడ్చుతూ, ఇంకా గ్రామస్తులకెవరికీ పట్టని వీధి శుభ్రతను నిర్వహిస్తూ, ద్విచక్ర – బహుళ చక్ర భారీ వాహనాల ప్రయాణానికి , పాదచారులకు, చెరకు బళ్ళకు మరికొంత సౌకర్యం కల్పిస్తూ స్వచ్చోద్యమకారులు2 గంటల సమయమూ గడిచింది!

 

            అక్కడొక పొడవాటి – ఎండి, గడ్డ కట్టిన బురద – తుక్కు దిబ్బ ప్రక్కనే ఒక పెద్ద ట్రాక్టరు ట్రక్కు మట్టిని త్రవ్వి, అందలి కశ్మలాలను వింగడించి, డిప్పలకెత్తి, ట్రక్కును నింపి, శ్మశానానికి తరలించే పట్టుదలతో ఏడెనిమిది మంది. అందులో ఒక్కరు పాతికకు పైగా డిప్పల మట్టితో దారి పడమర అంచు గుంటలను పూడ్చి, సర్దడం.

 

            ఇక్కడికి కాస్త దూరంగా దారి ప్రక్కన పడిపోయిన మైలురాళ్ళను త్రవ్వి, లేపి, నిటారుగా నిలిపి, సుందరీకరించే పనిలో మునిగిన ఊరి అందగింపుల గుంపు. సదరు పడిపోయిన రాళ్ళను, ఒరిగిన నామ ఫలకాలను అలాగే వదిలేస్తే వాళ్ళకు నిద్ర పట్టదు మరి!

 

పంట కాలువ సమీపంలోని పడమటి డ్రైనులో హుషారెక్కించే ఐదారుగురి హెచ్చరికల - అరుపుల స్వచ్ఛ - శుభ్ర సుందరీకరణ కృషి! - ఈ సందడి లేకుంటే - ఈ వేకువ కాల శ్రమదానంలో పాల్గొనకుంటే రోజంతా ఏమీ తోచని, మనసంతా వెలితి పడే కార్యకర్తలు వీళ్ళు!

 

నలుగురు మహిళా కార్యకర్తలేమో చీపుళ్లతో - ఆ విజయవాడ రహదారేదో తమ సొంత నట్టిల్లనుకొని శ్రద్ధగా ఊడ్చే పనిలో తమ సంతృప్తిని వెదుక్కొంటున్నారు. కావడానికి అందరమూ ఈ చల్లపల్లి పౌరులమే! కాని ఈ పాతిక వేల మంది గౌరవ పౌరుల్లో

 

- ఎవరు ధన్యులు - ఎవరు మాన్యులు?

ఎవరు బాధ్యులు – ఎవరు శ్రేష్టులు?

ఈ మహోద్యమ మెవరికోసం?

ఈ ఉపేక్షల కేది అర్ధం?

 

            పర్యావరణ భద్రత, తద్వారా మానవాళి మనుగడ కోసం, తన బాల్యం మాధుర్యాన్ని కోల్పోతూ – ఏడెనిమిదేళ్లుగా శక్తిమంతులైన ఎందరో దేశాధిపతులను కూడ కదలిస్తున్న  - మౌన నిరసన పూనిన  - స్వీడన్ కు చెందిన 16 ఏళ్ల గ్రేటాధన్ బర్గ్ కు తాటాకులు కట్ట యత్నించిన తెలివైన ప్రపంచం ఇది! చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమి వింత?

 

6.40 కి నేటి స్వచ్ఛ కార్యక్రమ సమీక్షకు ముందు కస్తూరి శ్రీనివాసుడు ముమ్మారు భారంగా పలికిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో అందరూ ఏకీభవించారు.

 

రేపటి వేకువ 4.30 సమయంలో బెజవాడ దారి పరిశుభ్ర – సుందరీకరణ  కోసం మనం చేరుకోవలసిన చోటు గాంధీ మహాత్ముని స్మృతి వనమే!

 

         అఖిల ప్రపంచానికి ఒక

సంయమనము, సాహసమూ, స్వచ్చంద శ్రమదానము,

ప్రాప్తజ్ఞత, పరేంగిత ప్రజ్ఞ లెన్నొ ఇచ్చటే!

అందుకే సుదీర్ఘ సమయ స్వచ్చోద్యమ చల్లపల్లి

ఆదర్శంగా నిలిచిన దఖిల ప్రపంచానికే!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

05.02.2021