2121* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2121* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ వివరాలు.

 

శనివారం - (06.02.2021) నాటి వేకువ 4.26 నుండి 6.25 దాక ప్రవర్ధిల్లిన తమ గ్రామ వీధి పరిశుభ్ర – సౌందర్యసాధనలో శ్రమించిన బాధ్యులు 26 మంది కాగా వీరి ఉద్యమాన్ని చవి చూసిన చోటు బెజవాడ మార్గంలో ఇంచుమించు నిన్నటిదే! – 6 వ నంబరు పంట కాలువ నుండి ప్రభుత్వోన్నత పాఠశాల వరకూ. చోటు నిన్నటిదేగాని స్వచ్ఛ కార్యకర్తల కృషి మాత్రం ఎప్పటికప్పుడు నవనవోన్మేషమే! అవసరానుగుణంగా సృజన శీలమే! ఎందుకంటే – ఏడేళ్లుగా ఊరి ఆవశ్యకతను గుర్తించి, బాగా ఆలోచించి, ఏనాటికానాడు స్వయం నిర్ణయంతో ముందుకు సాగే – ప్రభుత్వాలో, ఇతరులో చెపితే కాక, గ్రామ స్వస్తతను కేవలం హక్కుగా కాక బాధ్యతగా తలంచే జాగృతులైన స్వచ్ఛ సైనికుల విధి నిర్వహణమిది!

 

కనుక ఈ స్వచ్చంద శ్రమదాతలు వేకువ 4.30 కు ముందే మూడు ముఠాలుగా మారి, తమ తమ ప్రియ బాధ్యతలకు పూనుకొన్నారు :

 

- పంట కాలువ ప్రక్కన JCB విరగగొట్టిన మరొక మైలురాతిని – దాని కాంక్రీటు చట్టుతో సహా పెళ్లగించి, నిటారుగా – అందంగా మలిచి నిలపడానికి నలుగురు సుందరీకర్తలకు గంట సమయం పట్టింది – అదీ చెమటలు కార్చుతూ, అంత చలిలో సైతం మంచి నీళ్ళు త్రాగుతూ! ఐతేనేం – ఆ నలుగురి వదనాల్లో విజయదరహాసం, చూస్తున్న ఇంకొకరిలో ఆశ్చర్యం, ఆనందం!

 

- మరి నలుగురి మురుగు ముఠా సిమెంటు గోడౌను దాపున – అపార్ట్మెంట్ల మురుగు నిండిన పడమటి డ్రైనులో ఎప్పుడో ఎందుకో పడి మునిగిన ఎండు చెట్టు బరువైన కొమ్మల్ని బైటకు రప్పించడంలో కృతకృత్యమయింది! వీళ్ళ ప్రయత్నం నడుమ నడుమ కాస్త అరుపులూ, కేకలూ సహజ సిద్ధంగా వస్తాయి!

 

- 10 మంది పని ఎప్పటిలాగే స్మృతి వనం దగ్గర రోడ్డు వార పంచాయితీ వారు గతంలో యంత్రంతో త్రవ్వించగా పడి, ఎండి ఉన్న – ఏ మాత్రం అందంగా లేని బురద – తుక్కు మిశ్రమాన్ని డిప్పలతో – పారలతో – పలుగులతో ఎత్తి, ట్రాక్టరు లో నింపి, శ్మశాన దహనవాటిక చోటులో సద్వినియోగ పరచడమే! దానికన్న ముందు ప్లాస్టిక్ సంచుల్ని, గుడ్డ ముక్కల్ని, సీసా పెంకుల్ని విడగొట్టడం అందులో ఒకరి పని!

 

- నలుగురేమో కత్తులు, దంతెలు పట్టుకొని పింగళి వేంకయ్య విగ్రహ సమీపంలో మురుగు కాల్వ వ్యర్ధాలను, పిచ్చి – ముళ్ళ మొక్కల్ని, సారా సీసాల్ని తొలగించి, ఊడ్చి, ట్రాక్టర్ లో కెత్తి, జాతీయ జెండా రూపకర్తను గౌరవించారు.

 

- రోడ్డును, మార్జిన్లను చీపుళ్లతో ఊడ్చి వారు తమ విధిని నెరవేర్చినది మిగిలిన మహిళా కార్యకర్తలు.

 

6.40 సమయానికి ఈరోజు గ్రామ స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్య సంకల్పాన్ని నినాదాలుగా ముమ్మారు పలికినది పద్మావతీ ఆసుపత్రి నర్సు శ్రీమతి జ్యోతి.

 

వడ్లమూడి రత్నకుమారి – కోటేశ్వర దంపతుల్నుండి 5000/- విరాళాన్ని ట్రస్టు పక్షాన సెల్వమ్ గారు స్వీకరించడాన్ని నిన్నటి వాట్సాప్ చిత్రంలో గమనించండి – వారికి ధన్యవాదాలు!

 

రేపటి మన ఊరి స్వచ్చోద్దీపన విధుల కోసం కలుసుకోదగిన ప్రదేశం విజయవాడ దారిలోని జాతిపిత స్మృతివనమే!

         ఈ స్వచ్చోద్యమకారులు

హక్కుకన్న తొలుత గ్రామ బాధ్యతలనె గుర్తించిరి

“నేను – నాది” కాదనుకొని “మనం – మనది” అనితలచిరి

సమిష్టి శ్రేయమునందే వైయక్తిక సుఖమంటిరి

స్వచ్చోద్యమ చల్లపల్లి సాధనకై పయనించిరి!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

06.02.2021