2122* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

స్వచ్చ – శుభ్ర- సుందర చల్లపల్లి రూప కల్పన లో - 2122* వ నాడు.

 

చాలా రోజుల వలెనే ఈ ఆదివారం(07.02.2021) వ నాటి శ్రమ దాతల ఉషోదయ కార్యక్రమం వేకువ 4.26 కే మొదలై, 6.25 దాక కొనసాగింది. ఈ దినం వీళ్లు కలుసుకొన్నదీ, రకరకాల వీధి పారిశుద్ధ్యాలు సాధించినదీ విజయవాడ బాట లోని గాంధీ స్మృతి వనం దగ్గర, 6 వ నంబరు పంట కాలువ- విజయా హైస్కూల్ నడిమి ప్రాంతం. గత 5-6 రోజులుగాను, ఈ నాటి (32 మంది) ఆదర్శ శ్రమదానంతోనూ ఈ రహదారి భాగం చూడ ముచ్చటగా కనిపిస్తున్నది.

 

నేటి స్వచ్చోద్యమ కారుల కృషి నాలుగు విధాలుగా :

 

- పంట కాలువ ఉత్తర గట్టుపైన మూడు దినాలుగా రూపొందుతున్న మట్టి రోడ్డు పని ప్రస్తుతానికి పూర్తి ఐపోయి, నలుగురు కార్యకర్తల ప్రయత్నంతో దిగువ నారాయణ రావు నగర నివాసులకూ, రైతులకూ మంచి ప్రయాణ వసతి కలిగింది.

 

- బెజవాడ దారి అందానికీ, సౌకర్యానికీ భంగం కలిగిస్తున్న తూర్పు వైపు ఎండిన డ్రైను బురదను ట్రక్కు లో నింపి, శ్మశాన వాటిక సౌకర్య కల్పనా కృషిలో 10 మంది కార్యకర్తలు కృతకృత్యులయ్యారు -  వీరిలో ఒక మహిళా కార్యకర్త సైతం!

 

- పై చోటుకు పడమట ప్రక్క మురుగు కాలువ ఇటీవలే- ఆ దగ్గరలోని విభాగ భవన(అపార్ట్మెంట్స్)  సముదాయం నుండి కాబోలు- వచ్చి నిండుతున్న వ్యర్థ జలంతో సజీవ నదిగా మారి, లోతుగానూ, వ్యర్థాలు నిండి కంపుగొడుతూనూ ఉన్నది. ఈ రోజు అందులో మొలలోతులో దిగిన ఒక మురుగు మహా వీరుడు గట్టు మీద పెరిగిన పిచ్చి- ముళ్ల మొక్కల్ని తొలగిస్తూ, స్వహస్తాలతో డ్రైనులో నిండి పోయిన ఎంగిలాకులు, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సారా సీసాలూ, టిఫిన్ పొట్లాల అవశేషాలూ- గంట పాటు వంచిన నడుములెత్తక ఏరి- లాగి శుభ్రం  చేస్తున్న దృశ్యాన్ని వాట్సాప్ చిత్రాలలో పరిశీలించండి! అదే గట్టు మీద కూర్చొని,  ఒక చేత  దంతె, మరొక చేత కత్తితో ఆ చోటు స్వచ్చతకై పాటుబడుతున్న ఒక స్థూలకాయ విశ్రాంత ఉద్యోగినీ, చీపురుతో శుభ్రతా సాధన చేస్తున్న మహిళామ తల్లినీ గూడ గమనించండి!

 

- అక్కడికి ఉత్తరంగా – రహదారి కిరుప్రక్కలా కత్తులతో పనికిరాని మొక్కలు చెట్ల కొమ్మలు తొలగిస్తున్న నలుగురినీ, నిలవ బురద గుంటల్ని, అందలి వ్యర్థాలనీ, పరిష్కరిస్తున్న ముగ్గురినీ ఈ చల్లపల్లి గ్రామస్తులమైన మనం ఎంతగా అభినందించి, అనుసరించాలో గదా!

 

6.40 సమయంలో ధ్యాన మండలి ప్రముఖుడు రాయపాటి రాధా కృష్ణ గారు సావధానంగా ప్రవచించిన గ్రామ స్వచ్చ-పరిశుభ్ర –సౌందర్య సంకల్ప నినాదాలను కార్యకర్తలందరూ ముమ్మారు బలపరచగా, డాక్టర్ డి. ఆర్.కె. ప్రసాదు గారు జనవరి నెలకు బాగా పెరిగిన స్వచ్చోద్యమ జమా ఖర్చుల్ని, (కార్యకర్తలకు దొరికిన 6 రూపాయల చిల్లరతో సహా) లోటు బడ్జెట్టు వివరాలను తెలియజేశారు.

 

మన వృద్ధ చిరకాల స్వచ్చ కార్యకర్త డాక్టర్ మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి నెలవారీ 2000/- విరాళానికి ధన్యవాదాలు!

 

10 వ తేదీ – బుధవారం వేకువ 4.30 సమయంలో మన పునర్దర్శనం- ఈ గాంధీ మహనీయుని విగ్రహపాద పీఠం దగ్గరే!

 

             స్వచ్చ సైనికుడు అంటే-

ఆత్మ తృప్తి- మనో దీప్తి- అవే అతని బ్రతుకు లీల

అభిస్తుతుల- భుజ కీర్తుల- అడవి గోల అతనికేల?

స్వచ్చోద్యమ వీరులతో సహ ప్రయాణ మంటేనే

క్రొత్త శక్తి నాలో సమకూడునేల ఇలాచాల!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

07.02.2021