2123* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2123* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణలు.

 

ఈ బుధవారం (10.02.2021) నాటి వేకువ 4.22 కే మోహన్ దాస్ గాంధీ విగ్రహం ఎదుట కలుసుకొన్న 30 మంది గ్రామ స్వచ్ఛ – సుందర స్వాప్నికులు 6.20 వరకు ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేశారు. బెజవాడ మార్గంలోనే – ఇటు విజయాకాన్వెంట్ సంస్థ నుండి అటు నారాయణరావు నగర్ దిశగా – కాలువ ఉత్తర గట్టు వరకు 50 – 60 పని గంటల శ్రమదానంతో నాలుగు రకాల మెరుగుదల పని నెరవేరింది.

 

- మొదట గమనింపదగినది ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో ఎప్పుడో పంచాయితీ వారు త్రవ్వించి, ఎండి గట్టిపడిన నానారకాల కశ్మలాల మురుగు మట్టి. దానిలోని ప్లాస్టిక్ సంచుల్ని, సీసా పెంకుల్ని, కొబ్బరి చిప్పల ముక్కల్ని, పాతగుడ్డ ముక్కల్ని విడగొట్టి, సదరు మట్టి అవసరమైన శ్మశాన దహనవాటికల దగ్గర గుంటలలో నింపి వచ్చిన పని – ఒక్క పనితో రెండు ప్రయోజనాలు : ఇక్కడ బెజవాడ దారి స్వచ్ఛ – శుభ్ర – విశాలంగా మారడం, అక్కడ అందమైన శ్మశానం మరింత సౌకర్యంగా మెరుగుపడడం. ఎనిమిది మంది ఈ పనిలో మునిగిపోయారు.

 

- ఇంత పెద్ద రహదారిని, పంట కాలువ గట్టును మహిళా కార్యకర్తలు చీపుళ్లతో తుడిచి శుభ్రపరచడం.

 

- 6 వ నంబరు పంట కాలువ గట్టు ఈ వేకువ 18 మందికి పని కల్పించింది. ఉత్తర గట్టు మీద ఎందుకో పడిన గుంటల్ని పూడ్చి, సేకరించిన మట్టితో గట్టు మీద దారిని సమం చేసి, ఆ బాట సుందర మనోహరంగా ఉండాలని, అక్కడ పిచ్చి- ముళ్ళ మొక్కల్ని నరికి, ఖాళీ సారాసీసాలను, ప్లాస్టిక్ తుక్కును ఏరి, నారాయణరావు నగర్ బాటలో కనీసం కొంత వరకైనా సౌకర్యం కల్పించారు.

 

            కాస్త ఆలస్యంగా వచ్చిన రిటైరైన మూడు ముసలి ఘటాలు కూడ చిన్నదో – సన్నదో – ఏదోక పని చేస్తూనూ, నిస్వార్ధంగా గ్రామం మేలుకు జరుగుతున్న ప్రయత్నం చూసి ఆనందిస్తూనూ కనిపించారు – ఇందులో ఒకరు  82 ఏళ్ళ విశ్రాంత పశు వైద్యుడు, మరొకరు చల్లపల్లి స్వచ్చోద్యమ ఛాయా చిత్ర నిలయవిద్వాంసుడు – మూడో మానవుడు క్రమం తప్పని నిమ్మపళ్ల – సొరకాయల – బొప్పాయి పళ్ల వితరణ శీలి!

 

            చల్లపల్లి పౌర సామాజికులకు ఎన్నెన్నో వ్యాపకాలుండవచ్చు – సినిమా, దూర దర్శన ధారావాహికలు, గుడిగోపుర సందర్శనలు, ఆధ్యాత్మిక చింతనలు వగైరా! ఐతే మనలో ఏ కాస్త భావుకత ఉన్నా, సంస్కరణ ఉద్యమ ప్రోత్సాహక ధ్యాస ఉన్నా, లేదా మన ఆరోగ్య – ఆనందాల పట్ల కనీస శ్రద్ద ఉన్నా మన గ్రామంలోనే సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఈ ఉషోదయ స్వచ్చోద్యమాన్ని వీలైన ప్రతి మారు వచ్చి చూసి, పాల్గొని, ఆనందానుభూతి పొందవచ్చు.

 

            ఈ ఉదయం 6.40 కి నేటి స్వచ్చంద శ్రమదాన సమీక్షా సమావేశంలో మూడు మార్లు తొణకక – తనది కాని చల్లపల్లి గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించినది విశ్రాంత జీవిత భీమా ఉన్నతోద్యోగి శ్రీ జాస్తి జ్ఞానప్రసాదు గారు.

 

            రేపటి ఆశావహ గ్రామ సుందరీకరణ ప్రయత్నం కోసం 4.30 కే మనం కలుసుకోవలసిన చోటు - గాంధీ గారి విగ్రహ (విజయవాడ దారి) సమీపమే!

 

         స్వచ్చోద్యమ పరిపూర్ణత

అందరికీ వర్తిస్తే స్వచ్ఛ సంస్కృతీ నియమం

అందరు భావిస్తుంటే ఇరుగు పొరుగు సంక్షేమం

ప్రతి యొక్కరి స్వస్తత తమ బాధ్యతగా గుర్తిస్తే

స్వచ్చోద్యమ లక్ష్యం పరిపూర్ణత చెందినట్లె!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

10.02.2021

కార్యకర్తల శ్రమతో శుభ్రంగా, సుందరంగా తయారైన 6 వ నంబరు కాలువ ఉత్తర గట్టు.