2134* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం గాక వాడం!

 

స్వచ్ఛ - సౌందర్య చల్లపల్లిలో 2134* వ నాటి ప్రయత్నం.

 

ఈ 25.02.2021 - గురువారం వేకువ 4.21 సమయంలో మొదలై, 2 గంటల తరువాత – 6.20 కి ముగిసిన చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారుల (తమ సామాజిక బాధ్యతగా వాళ్ళు ప్రకటించుకొనే) గ్రామ వీధి పారిశుధ్య కృషిని నా సొంత కవిత్వంతో గాక – “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” అనే సామాజిక మాధ్యమ ఛాయాచిత్రాల ప్రకారం వివరిస్తాను. బాధ్యులేమో 28 మంది. నిబద్ధతతో -  శ్రద్దగా వారు పాటుబడిన పనిగంటలేమో - 50.

 

మూడున్నర శతాబ్దాల క్రితం కాబోలు – వేమన్న అనే హేతువాద ప్రజాకవి అప్పటి ఆలోచనాపరులను అడిగిన ప్రశ్న ఇది:

 

“గంగి గోవు పాలు గరిటడైనను చాలు

కడివిడైన నేల ఖరము పాలు?...”

 

అప్పుడు కవి ఉద్దేశించినది (దొంగ) భక్తుల్ని; నమ్మిన ఆదర్శం కోసం మనో నిబ్బరంతో 2134* నాళ్ళుగా ద్విగ్విజయ యాత్ర చేస్తున్న ఈ కర్మ వీరుల్ని గురించేమో నేను ప్రస్తావిస్తున్నాను! [సోదర గ్రామస్తుల్లో ఎవరికైనా – “ఇదేం గోల రా బాబూ, వేకువ నాలుగున్నర కాకముందే – ఈ మైకు, పాటలు ఏంటి, చీపుళ్లతో, పారలతో – ఏడెనిమిదేళ్ళ నుండి ఊళ్ళో ఏదో ఒక మూలన రోడ్ల మీద – మురుగు గుంటల్లో వీళ్ళ సందడేంటి – ఆసలింతకీ వీళ్ళ బాధేంటో – ఇంటి దగ్గర నిద్ర పట్టని కష్టమేమో...?” అని ఇప్పటికీ అనిపిస్తున్నదేమో గాని – నాకైతే ఈ వాట్సాప్ మాధ్యమం లో కనిపిస్తున్న – గ్రామానికంకితులైన - ఈ కార్యకర్తల రకరకాల పనిభంగిమలు ఎంత చూస్తున్నా – విసుగు కాదు గదా – వీళ్ళ పట్ల గౌరవ – భక్తి – ప్రపత్తులే ఇనుమడిస్తుంటాయి!]

 

ఇక, నేటి కార్యకర్తల పని సమయంలోని వాట్సాప్ ఛాయా చిత్రాల సంగతికొస్తే – అన్నీ కాదు గాని –

 

1) గ్రామ పంచాయితీ ఆరోగ్య పర్యవేక్షుని ఆధ్వర్యంలో నిన్నటి పారిశుధ్య కార్మికుల కృషి

 

2) పలుగుతో పనిచేసే ఒక ధనిక రైతు పట్టుదల!

 

3) మూడు నాలుగు కిలోమీటర్లు చీకటి - చలిలో నాలుగుంబావుకే వచ్చి, కూర్చొని సుజల విక్రయ కేంద్రాన్ని శుభ్రపరుస్తున్న మరొక కృషీవలుడు!

 

4) చాకచక్యంగానూ, లాఘవంగాను వాహనరొదల – కదలికల నడుమ బాటను ఊడుస్తున్న నర్సులు!

 

5) చిక్కని మురుగు ప్రక్కన నిలిచి, గడ్డిని, పిచ్చి, ముళ్ళ మొక్కల్ని నరికి విజయవాడ దారి అందాలకు మెరుగులు దిద్దుతున్న ఇద్దరు విరమిత పదవీ నిర్వాహకులు!

 

6) దారి ప్రక్క చిన్న ఎగుడు దిగుడుల్ని కూడ వదలక సరిజేస్తూ – అటు రోడ్డు భద్రతకూ, ఇటు శుచి – శుభ్ర – సౌందర్య – ఆహ్లాదాలకూ హామీ ఇస్తున్న పది మంది శ్రమ శీలులు!

 

7) రెవెన్యూ కార్యాలయాల లోపల, బైట అన్ని కశ్మలాల అంతు చూస్తున్న మరో ముగ్గురు –

 

8) తానొక విస్తృత అనుభవజ్ఞురాలైన డాక్టరై ఉండీ, సంపాదనాపరురాలై ఉండీ (సదరు సంపాదనలో సింహభాగం ఇటు ఆసుపత్రి నిర్వహణ కోసమో, లేక మనకోసం మనం ట్రస్టు కోసమో, అటు స్వచ్ఛ చల్లపల్లిని సుందర చల్లపల్లిగా మార్చడం కోసమో....) ఎంతోకొంత వీలుచేసుకుని ఈ వేకువ చలిలో మట్టి తట్టలు మోస్తున్న ఒక వైదురాలినీ,

 

అత్యంత సమర్ధుడైన ఈ పెద్ద డాక్టరు చీపురుతో వీధిని శుభ్ర పరుస్తున్న వైనాన్ని ఇంకొక ఛాయా చిత్రంలో!

 

        ఇలా మనం విని – గ్రహించాలేగాని ఆ వర్కింగ్ స్టిల్స్ (పని భంగిమలు) ఎన్నో గ్రామ స్వచ్ఛ ప్రయత్నాలను వివరిస్తాయి!

 

6.40 సమయంలో ఇంధన నిలయంలో – చల్లపల్లి స్వచ్ఛ సైన్యం తరపున ముమ్మారు గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య  సంకల్ప నినాదాలను ప్రకటించినదీ, కొంచెం బ్రతిమాలించుకొని హుషారైన పాత పాట పాడినదీ – పద్మావతి ఆసుపత్రి నర్సు మట్టా మహాలక్ష్మి!

 

రేపటి వేకువ 4.30 కు ముందే గ్రామ బాధ్యతల కోసం మనం కలుసుకోవలసినదేమో NTR పార్కు వద్ద!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 3

గతంలోన ఈ బాటే కడుంగడు అసహ్యకరం

మానవ మాత్రులు ముక్కులు మూసుకునే దుర్గంధం

కళేబరాల – మాంసఖండ – పూతి గంధహేయం

ఐతే – పురుష ప్రయత్నం ముందది పూర్తిగా పరాజితం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

25.02.2021.