2136* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

ఆహ్లాద ఆనంద ఆరోగ్య సుందర చల్లపల్లి ప్రయత్నంలో 2136* వ నాడు. 

 

27.02.2021(శనివారం) వేకువ - 4.26 సమయానికే - ఊరి వివిధ వార్డుల్నుండి వచ్చిన 12+1+1 (కార్యకర్తలు + ఛాయాగ్రాహక వైద్యుడు + రోజూ క్రమం తప్పక హాజరయే కాలభైరవ మిత్రుడు) = 14 మందిని వాట్సాప్ చిత్రంలో ముందుగా వీక్షించండి! తారకరాముని పార్కులోని మూడు ముఖ్య జాగాలలోనూ 30 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు ఎంత ఒద్దికగా, క్రమపద్ధతిగా, తదేక దీక్షగా, విసుగు విరామ రహితంగా రెండు గంటలపాటు ఆయాచోటులలో శ్రమిస్తున్నారో మీరు సులభంగానే గ్రహిస్తారు. స్వచ్చోద్యమ ఆస్థాన ఛాయాచిత్ర గ్రాహకుడు - మన శాస్త్రీజీ తీసి, పంపే ఛాయా చిత్రాలా మజాకానా? (ఆయన పలుగులు పారలతో పనిచేయక పోవచ్చు గాని తన మనసుకు, మెదడుకు మాత్రం 24 గంటలూ ఇదే ధ్యాస, ఇదే శ్వాస!)

 

నేనిలా ఏళ్ల తరబడీ చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ దైనందిన విశేషాలు విసుగు లేకుండా (కాస్త వర్ణనాత్మకంగా కూడ) వ్రాయడమంటే మరి అదినా ఆనందం, అదృష్టమూ! ఇలా ఈ ఉషోదయ మహత్తర గ్రామ బాధ్యతా నిర్వహణను చదివి, వాట్సాప్ లో చూసి, ఉప్పొంగిపోయే ఓ రకమైన వెర్రి జనులు అమెరికా, స్వీడన్, బ్రిటన్ వంటి విదేశాల్లోనూ, బెజవాడ వంటి రాష్ట్రం నడిబొడ్డులోనూ ఉన్నారు. (ఇందులో ఒకాయన M.V. సుబ్బారావు ప్రతి రోజూ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా ఈ ప్రత్యేక ఉద్యమాన్ని మనో నేత్రంతోనే చూసి, ఆనందం తట్టుకోలేక నిన్నటి వలె అప్పుడప్పుడు మన వాట్సాప్ గుంపులో సదరు ఆనందాన్ని పంచుడానికి కారణం మాత్రం క్రమం తప్పని కార్యకర్తల సుదీర్ఘ నిష్కల్మష శ్రమ తప్ప మరేదీ కాదు!

 

ప్రతిరోజూనూ, పై పేరాలలోనూ నేను పేర్కొంటున్నట్లు ప్రతి దినమూ, ప్రతి నిముషమూ స్వచ్ఛ కార్యకర్తల ఆశ్చర్యకర శ్రమదానం లాగే నేటి విశేషాలు సైతం ఇలా:

 

- పార్కు ఉత్తర భాగంలో అక్రమంగా పెరిగిపోయిన పచ్చిక దుబ్బుల్నీ చతికిలబడి కొందరూ, తిరగేసిన డిప్పల మీద కూర్చొని కొందరూ కోసి, కుప్పలు చేశారు. కోయని గడ్డి మధ్య కోసిన భాగం ఎలా శుభ్రంగా, పాయలుగా ఉన్నదీ (ఇక్కడికి రాజాలని వారు) చిత్రాలలో చూడాలి!

 

- గడ్డి మేటల్నీ, ఎండు మొక్కల ప్రొగుల్నీ నలుగురు ట్రాక్టర్ లోకి రవాణా చేయడాన్ని, ఆ ట్రాక్టరును అటూ ఇటూ నడుపుతున్న చల్లపల్లి స్వచ్ఛ వైద్యుణ్ణి కూడ అభినందించాలి!

 

- అన్నిటికన్నమించి సజ్జా వారి వీధి నుండి వచ్చి, రకరకాల స్వచ్చంద కృషి చేసిన ఒక గృహిణి ఖాళీ దొరక్క ఎవ్వరూ ఎక్కకపొతే అమాంతం చెత్త ట్రాక్టర్ ట్రక్కులోనికెక్కి క్రింద నుండి అందిస్తున్న అన్ని కశ్మలాలను క్రమ పద్ధతిలో సర్ది, త్రొక్కి పేర్చుతున్న దృశ్యం నాకు మరింతగా ఆశ్చర్యానందదాయకం!

 

6.40 కి కాఫీ కబుర్ల తరువాత విలేకరుల సాక్షిగా జరిగిన కృషి సమీక్షా సమావేశంలో ముమ్మారు గ్రామ స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను వినిపించినది కాంపౌడర్ వక్కలగడ్డ వేంకటేశ్వరరావు. బాగా నలతగా ఉండి, మనలో ముగ్గురు పెద్దల నుద్దేశించి మన కార్యకర్త నాంచారయ్య వ్రాసిన లేఖను చదివి, దాసరి రామకృష్ణ ప్రసాదు గారు, నా ద్వారా అతడు పంపిన 2500/- చెక్కు విరాళాన్ని స్వీకరించారు. నాంచారయ్య పట్ల శివన్నారాయణ, పద్మావతి, డి.ఆర్.కె. గార్ల ఆత్మీయతను తెలుసుకొని స్వచ్ఛ కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు.

 

రేపటి మన సుందరీకరణ బాధ్యతలు కూడ N.T.R. పార్కులోనే నిర్వహించవలసి ఉన్నది.

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – 5

ఇంతలోనె ఎంత మార్పు! అశుద్ధాల అభద్రతల

స్ధానంలో పూదోటలు! హరిత వర్ణ రంజితాలు!

యాతాయాత ప్రముఖుల హాయి గొలుపు సెల్ఫీలు!

స్వచ్చోద్యమ ఫలితం ఇది వ్యధతీర్చెను, కథ మార్చెను!  

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

27.02.2021.

చల్లపల్లి స్వచ్చోద్యమ కార్యకర్త, S.R.Y.S.P. కార్యాలయ ఉద్యోగి శ్రీ కైలా నాంచారయ్య దైనందిన ఉద్యమ ఖర్చుల నిమిత్తం నేడు మేనేజింగ్ ట్రస్టీ గారికి బాధ్యతగా సమర్పించిన 2,500/- రూపాయల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు.