2137* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

2137* వ నాటి గ్రామ స్వచ్ఛ - సుందర చర్యలు.  

 

ఆదివారం(28.02.2021) కారణంగానేమో గాని – 43 మంది బెజవాడ దారిలోని పార్కు శుభ్ర సుందరీకరణకు నడుం కట్టారు అది గూడ  - 4.15 సమయానికే! ఈ 21 వ శతాబ్దం తృతీయ దశకంలో కూడ మన రాష్ట్రంలో, మన చల్లపల్లి గ్రామంలో ఇంతటి అతిశీతల వేళలో తమ సొంతం కోసం కాక, ఊరిప్రయోజనం కోసం పోటీలు పడి వచ్చి, చెమటలు చిందించడాన్ని ఇది చల్లపల్లి కనుక ఏమైనా నమ్మి తీరాల్సిందే! బయటి వాళ్ళకు నమ్మశక్యం కాకపొతే శాస్త్రి మహాశయుని జై చల్లపల్లి స్వచ్ఛ సైన్యంవాట్సాప్ చిత్రాలు చూసైనా నమ్మక తప్పదు.

 

నేటి పని విరమణ సమయంలో కార్యకర్తలలో ఐకమత్యం చాలక – 2 గంటల 10 నిముషాల మేరకు జరిగిన శ్రమదానంలో వీళ్ళేం సాధించారయ్యా అంటే:

 

- పార్కు ఉత్తర దిశలో అదుపు చాలక పెరిగిపోయిన గడ్డిని 22 మంది నేల మట్టానికి కోసి, పూర్తి చేయడం! ఇక్కడే కార్యకర్తల్లో విభేదాలు – 6.15 దాటినా ఈ కాస్త పని ముగించనిదే వెళ్ళ వద్దనే సగమంది మాట నెగ్గడంతో కాస్త శ్రమ ఎక్కువైనా కాళ్లు, నడుములు, గూళ్ళు నొప్పి వచ్చినా అక్కడ పనంతా ముగిసి, అంచనా ప్రకారం ఆ భాగము మొత్తం చూడ ముచ్చటగా ఉన్నందుకు శ్రమించిన 20 మందికీ ఎనలేని సంతృప్తి!

 

- పార్కు దక్షిణ భాగం ప్రహరీ ప్రక్కన పది పన్నెండు మంది కూడ వంచిన నడుములెత్తకుండ కొందరు కత్తులతో, కొందరు పారలతో, ఇంకా దంతెల వారు కూడ పాటుబడి 10 – 12 గజాల తూర్పు వైపు మినహా ఇంచుమించు లక్ష్యాన్ని చేరుకున్నారు! (ఇవేమీ కోట్లు సంపాదించుకొనే, పదవుల్నందుకొనే లక్ష్యాలు కానే కావు!)

 

- బాట్మింటన్ బంతాట ఒక వంక జరుగుతూనే ఉంది దాని ప్రక్కన ఐదారుగురు కొంత వయసు మీరిన కార్యకర్తలు పనికిరాని మొక్కల్ని, గడ్డిని నరికి, అవసరమైన చోట పారతో చెక్కి, కాలినడక మలుపు దాక క్రింద చతికిలబడి కూర్చొని జరుగుతూ కూడ శుభ్రం చేస్తున్నారు! (రాముడుపాలెం నడక దారుడొకాయన వీళ్ళతో మాట్లాడుతూ బహుశా తనకు తెలియకుండానే పనిముట్టునందుకొని, కొంత సేపు పని చేశాడు!)

 

- ఇందరు శుభ్రపరచగా తేలిన తుక్కులూ, గడ్డి, వ్యర్ధాలన్నిటిని పార్కంతటా ట్రాక్టర్ ను  తిప్పుతున్న లోడింగ్ వీరులు నలుగురైదుగురు కూడ చివరి సమయంలో తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు!

 

            స్వచ్ఛ కార్యకర్తలకూ, తదభిమానులకూ, దేశ విదేశాల స్వచ్చోద్యమ శ్రేయోభిలాషులకు ఇదొక మహదానంద సంధాయకమే అనుకోండి! కొందరు ఆలోచనాపరుల దృష్టిలో నేటి స్వార్ధ ప్రపంచంలో ఇక్కడి సుదీర్ఘకాల శ్రమదాన వైభవం ఒకానొక అద్భుత ప్రయోగమే అనుకోండి! (తద్భిన్నంగా కొద్ది మంది రొడ్డ కొట్టుడు ఆలోచనల వారికి ఇదొక తెలివి మాలిన, పిచ్చి చాదస్తం కూడ కావచ్చు!) సామెత చమత్కరించినట్లుగా - “ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం!”  ఈ స్వచ్చోద్యమ కారుల పిచ్చి మాత్రం వాళ్ళకే గాక గ్రామం మొత్తానికీ ఆనందప్రదమూఆరోగ్యదాయకమూ, ఆదర్శప్రాయమూ!

 

అసలీ రోజు కురిసింది మంచు కాదు, ఏకంగా మంచు వర్షమే! ఈ ఆదివారం స్వచ్చోద్యమ సారధ్యం లేకుండానే ఉభయ వైద్యుల పరోక్షంలోనే కార్యకర్తల స్వయం సారధ్యంలోనే ఇందరి ఉత్సాహ ఉద్వేగ శ్రమదానం విశేషమే అనుకోవాలి!

 

శివబాబు గారి సొరకాయల పంపకం, కాఫీ ఆస్వాదనం తరువాత నేటి కృషి సమీక్షా సమయంలో తరగని ఉత్సాహంతో హీరో షోరూం వ్యాపారి దాసరి శ్రీనివాసరావు ముమ్మారు పలికిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సుందర సంకల్ప నినాదాలను కార్యకర్తలంతా అందుకొనేప్పుడు చూస్తే సమయం 6.45 దాటింది!

 

ఒక పెద్ద కార్యకర్త సుందర చల్లపల్లియొక్క కర్త కర్మ క్రియ గారికి సీల్డు కవరులో అందించిన ధన విరాళం నా దగ్గరే ఉన్నది.

 

3.3.2021 బుధవారం వేకువ 4.30 కాక ముందే – NTR పార్కులో శేషించిన కొన్ని తుదిమెరుగులు కోసం మరల ఇక్కడే కలుసుకొందాం!  

  

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర 5

 

అన్ని చోట్ల స్వచ్ఛ ప్రియుల కాచరణీయంబే ఇది!

ప్రతి ఊళ్లో ప్రతి బాటకు పరమోదాహరణం ఇది!

ఈ బాటన నడచు వారి అదృష్టం ఏమనాలి?

స్వచ్చోద్యమ ఫలితం ఇది సదా మరువ కుండాలి!

        

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

28.02.2021.