2142* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో 2142 * వ నాటి దినచర్య.

 

ఈ నాటి(07.03.2021) స్వచ్చ సైన్య వీధి శుభ్రతలు కూడ నిన్నటి తరువాయిగానే! శనివారం కావచ్చు- ఆదివారం కావచ్చు! కార్యకర్తల స్వచ్చోద్యమ నిబద్ధతలో గాని, గ్రామ మెరుగుదల కృషిలోగాని మార్పులేదు. కాకుంటే సమీప గతం కన్న నేడు గ్రామ స్వస్తత కంకితులైన ధన్యుల సంఖ్య మాత్రం పెరిగి- కరోనా వలన, ఇటీవలి ఎన్నికల వలన రా జాలని పాత కార్యకర్తలు కూడ నవోత్సాహంతో వచ్చి చేరి-44 మంది అటు శివాలయం నుండి ఇటు 3 ప్రధాన దారుల కూడలి దాక చెలరేగి జరిపిన శ్రమదానంతో ½ కిలో మీటరు మేర సకల కశ్మల దరిద్రాలు తొలగి పోయి, స్వచ్చ-శుభ్ర-సౌందర్యాలు వెల్లివిరిశాయి! పనిలో పనిగా కొందరు పాత, కొత్త కార్యకర్తల స్వచ్చోద్యమ ఎడబాటు బెంగతీరి, స్వగ్రామ బాధ్యతల బకాయి కూడ తీరి ఉంటుంది! ఈ క్రొత్త వారిలో మంగళగిరి నుండి వచ్చిన షణ్ముఖ సాయి కుమార్  అనే ఇంజనీరింగ్ విద్యార్థి అతి క్రొత్త వ్యక్తి-(మన శంకర శాస్త్రి గారి మనుమడు.)

 

          శాస్త్రీయ వాసనలున్న స్వచ్చ కార్యకర్తలకు ముహూర్తాల బెడదలేదు గాని, చిరకాలంగా వాళ్లదొకే ముహూర్తం-(బ్రహ్మ ముహూర్తం! నేటి వేకువ కూడ హిమ వర్షంలోనే-4.22-6.25 నడుమ-ఉత్సాహ ఉద్వేగాలతో జరిగిన బాధ్యతాయుత వీధి పరిశుభ్రతలు మాత్రం నావంటి వాళ్ల దృష్టిలో ఒక అరుదైన సామాజిక అద్భుతమే! నిన్న తాము తీర్చిదిద్దిన బెజవాడ బాట మీద ఈ తెలవారు సమయానికే- 24 గంటలు గడవకుండానే రకరకాల కశ్మలాలు పడి ఉన్నాసరే –కోపంతో బండ బూతులు తిట్టని - మందహాసంతో మరొకమారు శుభ్ర పరచిన స్వచ్చ కార్యకర్తల సహన గుణం కూడ అద్భుతమే!( వేలాది దినాల నుండి ఈ సహన గుణ స్థిత ప్రజ్ఞే సకల గ్రామాంతర-దేశాంతర గుర్తింపు కొక కారణమై ఉంటుంది!)

 

స్వచ్చోద్యమకారుల ఈ నాటి ఆదర్శ శ్రమ త్యాగాన్ని నేను పని గట్టుకొని వర్ణించేకన్న మన జై స్వచ్చ చల్లపల్లి సైన్యం అనే సామాజిక మాధ్యమంలో ఎవరైనా సచిత్రంగా చూడవచ్చు. దేశభక్తి, దేశ ద్రోహం మాటల కిటీవల అర్ధాలు తిరగబడుతున్నాయి గాని- ఈ గృహిణుల, వృద్ధుల, వివిధ వృత్తి నిపుణుల- వెరసి ఈ సగటు మనుషుల దేశభక్తి స్థాయి ఎలాంటిదో గ్రహించనూవచ్చు. గమనించి, గుర్తుంచుకొండి- వీళ్లీ ఆదివారం వేకువ 40-50 రకరకాల దుకాణాల ముందరి ప్లాస్టిక్ సంచులు, కాగితం ముక్కలు, తిను బండారాల అవశేషాలు ఎన్ని-ఎంత పెద్ద గుట్టలుగా ఊడ్చి, ఏరి, ట్రాక్టర్ల కెత్తి , చెత్త కేంద్రానికి  తరలించారో! మంచు దుప్పటి తెరల్లో-చిన్న, పెద్ద వందలాది వాహనాల రాకపోకల రొదల నడుమ, ఎంతగా గూళ్ళు నొప్పి పెడుతున్నా ఆపక దుమ్ము-ఇసుకల మిశ్రమాన్ని పోగులుగా ఊడ్చి ఆనందించారో! మరి వీరిలో ధనికులు, పని మనుషులున్న వారు సైతం లేకపోలేదు. వీళ్లందరిదీ ఒకే తృప్తి- అదే లక్షల లబ్ది! అదేమంటే-6.30 తరువాత శుభ్ర-సుందరమైన నేటి అర కిలోమీటరు సువిశాల రహదారిని చూసుకొని, దానిమీద పయనించే వందలాది మనుషుల సౌకర్యాన్ని గుర్తుచేసుకొని పొందే విలువైన-ఆవశ్యమైన ఒకే ఒక ఎనలేని సంతృప్తి! ఒకానొక మంచి స్వార్థం! ఈ ఆత్మ సంతృప్తే వీళ్లని వేలాది దినాలుగా ముందుకు నడిపిస్తున్నది!

          NTR పార్కు సకల సౌకర్యాలకు ముఖ్య కార్యకర్తగా అందరూ పేర్కొంటున్న- చల్లపల్లికి  క్రొత్తగా మరొక మారు ఉప సర్పంచిగా ఎన్నికైన ముమ్మనేని నాని-(మన డాక్టర్ దంపతులు వారిస్తున్నా వినక.) ఈ ఉదయం కార్యకర్తలకు బలమైన గట్టి ఉపాహారం సమకూర్చి, ఈ నిస్వార్థ పరుల నడుమనే తమ వివాహ 25 వసంతాల ముచ్చట తీర్చుకోవడం నేటి మరొక విశేషం!

 

డాక్టరు దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు ఫిబ్రవరి నెల జమా ఖర్చుల్ని ప్రకటించి, - నేటి కార్యకర్తల కృషికి పొంగిపోవడమూ- గ్రామ సర్పంచి పైడిపాముల కృష్ణ కుమారి గారు ముమ్మారు సొంత ఊరి స్వచ్చ- పరిశుభ్ర-సౌందర్య సంకల్పాన్ని నినదించడమూ 6.45 కు ముగిసినవి.

 

రేపటి మన ఆత్మ తృప్తి దాయక గ్రామ మెరుగుదల కృషి కోసం ATM కేంద్రం వద్దనే  వేకువ సుమారు 4.20 కే కలుసుకొందాం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 10

ఇది స్వస్తత మేలి బాట- సౌందర్యపు రాచబాట

ఎన్ని ఊళ్ల దార్లకైన ఇది నమూన కాగలదట!

ఎంత ధన వ్యయం జరిగి-ఎన్ని తపస్సులు చేస్తే-

ఏ మహత్తరాదర్శం ఇలా రూపు దాల్చిందట?

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

07.03.2021