2143* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ – సుందర చల్లపల్లి కోసం 2143* వ నాటి శ్రమదాన పండుగ.

 

ఈ 08.03.2143* వ నాటి చంద్రవారం వేకువ – 4.19 వేళకే బందరు రహదారిలో ATM కేంద్రం వద్ద ఆగి, శ్రమదాన ఉధ్యక్తులైన దశాధిక కార్యకర్తలను, వారి చెంతనే – వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న దరిద్రపు గొట్టు కశ్మల గుట్టల్నీ ముందుగా గమనించారా? ఆ అపరిశుభ్రత, ఆ అసహ్యం, బాధ్యతారాహిత్యం నిన్నటి రకరకాల వీధి వ్యాపారులవో – చిరుతిళ్ళ బళ్ళ తాలుకువో కావచ్చు; ఐతే వారంతా ఈ గ్రామ సోదరులే – ఇక్కడి సుదీర్ఘ స్వచోద్యమ కార్యకర్తల శ్రమదాన ఫలితాల భోక్తలే! మరి వాళ్ళ క్రమ శిక్షణారాహిత్యానికి విసుక్కొని, కోపగించి, తిట్టాలా? లేక ఈ ఏడేళ్ళ స్వచ్చోద్యమ సహనగుణాన్నే ప్రదర్శించాలా?

 

ఈ దినం 30 మంది కార్యకర్తలు తొలుత ఆగింది ఇదే దేవాలయాల చోటు దగ్గరే గాని, స్వచ్ఛ ఆయుధ పాణులై, పని ప్రారంభించినది మాత్రం 3 రోడ్ల ప్రధాన కూడలి నుండి! గజం - గజం బందరు వైపుకు వెళ్ళే కొద్దీ – ఆదారికిరువైపుల వారి కర్తవ్యం మరింత బరువుగా – కష్ట సాధ్యంగా మారింది. ఇంధన నిలయ (బంకు) సమీపంలోనైతే – అంగుళం ఎత్తున పేరుకుపోయిన దుమ్ము – ధూళి – ఇసుకలు గట్టిపడిపోయి, చీపుళ్లతో బాటు గోకుడు పారలు కూడ ప్రయోగించవలసి వచ్చింది. ఇలా నేను రాయడానికి, ఇతరులు చదవడానికేం గాని – చేసే వాళ్ళ ముక్కులకీ, కళ్లకీ ధూళి క్రమ్మి, గూళ్ళు నొప్పి పెట్టక తప్పదు! (ఈ అంచనా నాది తప్ప – ఆరేడేళ్లుగా -  2143 దినాలుగా – మూడు లక్షల పని గంటలు (శ్రమదానం చేస్తున్న కార్యకర్తలిది కానే కాదుసుమా!) వాట్సాప్ ఛాయా చిత్రంలో కనిపిస్తే రెండేసి చీపుళ్ళ కలిపి పట్టుకుని, వాటి పుడకలు విరిగేంత బలంగా రహదారిని ఊడ్చి, చెమట చిందిస్తున్న ఇద్దర్ని గమనించండి!

 

 ఇక – చిన్న కార్ల పాక దగ్గర కూడ ఎంతగా, గడ్డి, పిచ్చి మొక్కలు, ఇసుక గుట్టల్నుండి రోడ్డెక్కిన దుమ్ము – ఇసుక మిశ్రమాన్ని కూడ వాట్సాప్ లో చూడవచ్చు. ఈ పాతిక మంది కార్యకర్తలే ఈ సువిశాల గ్రామ – పాతిక వేల జనాభా ప్రధాన వీధుల్లో కలిగిస్తున్న కాలుష్యాలకు బదులు చెప్పడం సమంజసమాఅనేది – సామాజిక స్పృహ ఉన్న (లేకపోతే తెచ్చుకొని) గ్రామస్తులు తక్షణమే పట్టించుకోదగిన సంగతి!

 

అటు బందరు మార్గ ప్రారంభం నుండి – దుకాణాల, పండ్ల కొట్ల, బంకుల, టిఫిన్ బళ్ళ, బట్టల కొట్ల, ద్విచక్ర వాహన విక్రయశాలల – సమస్త వ్యర్ధాలనూ పాతిక మంది కార్యకర్తలే ఊడ్చారు రోడ్డును గోకారు – ఒక ట్రక్కు నిండా దుమ్ము – ఇసుకల్ని, మరొక ట్రాక్టరుకు సరిపడా పొడి చెత్తల్నీ డిప్పలతో మోసి, నింపి చెత్త కేంద్రానికి చేర్చారు.

 

మిగిలిన గ్రామస్తుల్లాగే 6.20 దాక ఈ కార్యకర్తలు కూడ నిద్రలో ఉండో, లేక నిద్ర మేలుకొని గూడ మరింతగా శయన సుఖం పొందుతుంటేనో, సొంత పనులు మాత్రమే చేసుకొంటూ ఈ వీధుల్ని పట్టించుకోకుంటేనో.... ఈ చల్లపల్లి ఎంత ముదనష్టంగా మిగిలిపోయేదో ఒక్క మారు మనం ఊహించుకోవాలి - ప్రశ్నించుకోవాలి!

 

6.10 నుండి అక్కడ మరొక సందడి కూడ వచ్చింది. స్వచ్ఛ కార్యకర్తలలాగే మరో రకంగా సామాజిక బాధ్యులైన – సేవాదీక్షితులైన లయన్ మిత్రులు అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా ఈ స్వచ్ఛ మహిళలను సమ్మానించారు. వారిలో ఒక లయన్ 6.30 కి ముమ్మారు గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించారు.

 

డొక్కా (పల్నాటి) అన్నపూర్ణమ్మ గారు కార్యకర్తలకు శుచి – రుచి – బల – కరమైన రాగి జావను ఈరోజు కూడా త్రాగించారు.

 

రేపటి వేకువ సైతం 4.20 కే మనం కలిసి బాధ్యతలకుపక్రమించ దగిన స్థలం ATM కేంద్రమే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 11

 

ఎవరైనా పొగడగలరు – ఇచట సేద తీరగలరు

పదే పదే సెల్ఫీలతో పరవశించి వెళ్ళగలరు!

ఏడెనిమిది ఏళ్ల పాటు ఈ దారిని సంస్కరించి

ఆదర్శంగా తీర్చిన స్వచ్ఛ సైన్య ధన్యులెవరు!?

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

08.03.2021