2145* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

(శివరామపురం) పెదకదళీపుర మార్గంలో - 2145* వ నాటి స్వచ్చోద్యమం.

 

మహాశివరాత్రికి ముందర ఈ బుధవారం (10.03.2021) – కళ్లేపల్లి వెళ్ళే దారి పవిత్రత కోసం పాతిక మంది కార్యకర్తలు చల్లపల్లి నుండి 2 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, మేకలడొంక వంతెన దగ్గరకు 4.27 కే చేరుకొన్నారు. ఈ పెద్ద పండుగ సందర్భంగా – దక్షిణ కాశి అనే పేరుబడిన పెదకదళీపుర మార్గంలో భక్తులు వేల మంది ప్రయాణించి శివుని సందర్శించుకొనే సమయాన, ద్వి – త్రి – చతుశ్చక్ర వాహన దారులకూ, పాదచారులకూ, RTC వారికీ ప్రయాణ భద్రత – ఆహ్లాదతల దృష్ట్యా గత ఆరు సంవత్సరాలుగా స్వచ్ఛ కార్యకర్తల సంప్రదాయానుగుణంగానే – వాళ్ళు నేడీ చోటుకు వచ్చారు. ఏళ్ల తరబడి – ఈ 3 కిలోమీటర్ల బాట హరిత శోభతో – వివిధ పుష్ప సమృద్ధితో – ముందటి నాళ్ళకన్నా వైశాల్యంతో – ఈ మాత్రం స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాలతో ప్రయాణికులను అలరిస్తున్నదంటే – ఆ అవకాశం, ఆ ఆదృష్టం వందలాది చల్లపల్లి & శివరామపుర కార్యకర్తల - వేలాది గంటల శ్రమదాన ఫలితమే! అసలు స్వచ్ఛ చల్లపల్లి లోకి ప్రవేశించే 7 బాటలంత ఆహ్లాదదాయకంగా ఉండే ఇతర గ్రామాలు ఈ రాష్ట్రంలో 1% కూడ ఉండకపోవచ్చు!

 

నేటి రహదారి శుభ్ర – సౌందర్య కృషి విషయానికొస్తే – అది మేకలడొంక వంతెనకు 3 ప్రక్కలకూ విస్తరించింది:

 

- జరిగిన పని ప్రధానంగా వంతెన దక్షిణాభిముఖంగా – అది కూడ ముఖ్యంగా బాట, దాని తూర్పు ప్రక్కనే! ఎక్కువ మంది ఆ వంద గజాలలోనే శ్రమిస్తూ కనిపించారు – చీపుళ్లతో, గొర్రులతో, ఒకరిద్దరు కత్తులతో! ఈ దారి దాకుకు కొన్ని నెలల తరువాత వచ్చిన శ్రమదాతలకు ఎన్నెన్నో రకాల తుక్కులు, పిచ్చి మొక్కలు స్వాగతం పలికినవి.

 

- మరికొందరు కాలువ వంతెన దగ్గర, చల్లపల్లి దిశగా బాట కుడి – ఎడమలలోనూ కుదురుకొని, నిర్దేశిత పని లక్ష్యాలను చేరుకున్నారు. 6.05 తరువాత అక్కడ పోగుబడ్డ రెండు పెద్ద తుక్కు గుట్టలు అందుకు సాక్ష్యం! ఆ గుట్టల్లోని మంచి నీళ్ళ, మద్యం ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ సంచులు, మన బ్రతుకులకు పర్యావరణ ప్రమాద ఘంటికలు! వాళ్ళు నరికిన నిరర్ధక మొక్కలు, ఎండు కంపలు మురుగు కాల్వలో అడ్డుపడుతున్న రకరకాల తుక్కులు ఈ రహదారి అందాలకు ఆటంకాలు!

 

- 6.00 కన్నా ముందే ఆ వ్యర్ధాల గుట్టలన్నీ కార్యకర్తల చేతుల మీదుగా ట్రస్టు వారి ట్రక్కులోకి ఎక్కి, చెత్త కేంద్రానికి తరలిపోయినవి.

 

నిన్నటి రాగి జావ పంపకం తన సమక్షంలో జరగని అసంతృప్తి తో కావచ్చు – పల్నాటి అన్నపూర్ణ గారు ఈ రోజు సకాలంలో మళ్ళీ కార్యకర్తల చేత దగ్గరుండి రాగి జావను త్రాగించారు. (ఆమెకున్న అత్యధిక బాధ్యతల దృష్ట్యాను, ఆర్ధిక భారం దృష్ట్యాను ఇక ముందిలాంటి వితరణలు మానుకోవాలనీ, లేదా కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలనీ నా వైయక్తిక విన్నపం!)

 

మన డాక్టర్లిద్దరికీ ఆస్పత్రి బాధ్యతలు – తక్షణ శస్త్ర చికిత్సల పనులున్నందున కాబోలు – నేటి స్వచ్ఛ కార్యక్రమం 6.05 సమయానికే పరిమితమయింది. కొన్ని మాసాలుగా శ్రమదాన దూరుడైన యడ్ల రాము ఉద్వేగ పడిపోతూ గ్రామ స్వచ్ఛ – శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినాద రూపంలో ముమ్మారు పలుకగా – 6.10 కి నేటి మన ప్రయత్నం ముగిసింది.

 

తాతినేని మొక్కల రమణ గారు స్వచ్ఛ కార్యకర్తలందరికీ, అర్హులైన గ్రామస్తులందరికీ నేడు ఇచ్చే సువర్ణావకాశమేమంటే, ఎవరి ఇళ్ల ముందు/ ఆవరణల లోనైనా అందమైన పూదోటలకు తన ఉచిత సలహా – సహకారాలుంటాయని!

 

ఈ పండుగల వేళ మరొక విశేషం కూడా ఇక్కడ చెప్పాలి : పాగోలు వాస్తవ్యుడూ, 70 సంవత్సరాల వయోవృద్ధ విశ్రాంత ఉద్యోగీ,  స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తా ఐన కంఠనేని రామబ్రహ్మం తన 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని 25,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి అందించడం. ఇది గాక, గతంలో పలు సందర్భాలలో వీరిచ్చిన అన్ని విరాళాలు 2,10,000/- ఈ ఆదర్శ శ్రమ – సమయ – ధన దాతకు స్వచ్చోద్యమ చల్లపల్లి కృతజ్ఞతాభి వందనాలు.   

 

రేపటి శివరాత్రి పర్వదినాన కూడా వేకువ 4.30 కన్నా ముందే మనం  పునర్నవోత్సాహంతో కలుసుకొని స్వచ్చ యజ్ఞం కొనసాగించవలసినచోటు కూడా మేకలడొంక సమీపమే.   

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 13

 

“ఏ నేతలు కరుణింపరు – ఏ దేవుడు వరమివ్వడు

ఈ ఊళ్ళో కశ్మలాలు ఇతరుల కెందుకు పట్టును?

శ్రమ మూల మిదం జగత్తు” అను నిజాన్ని గుర్తించిన

స్వచ్ఛ సైన్య నిత్య శ్రమ సాధించిన గెలుపే ఇది!  

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

10.03.2021.