2147* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2147* వ నాటి స్వచ్ఛ సుందర ఉద్యమ చరిత్ర.

 

నేడు కూడ మహాశివరాత్రి పర్వదినం క్రిందే లెక్క అని విన్నాను. ఈ శుక్రవారం వేకువ 4.28 కి శివరామపురం దారిలో మేకలడొంక – పంట కాలువల మధ్యస్త ప్రదేశానికి చేరుకుని, సముచిత శ్రమదానానికుపక్రమించిన 23 మంది సామాజిక చైతన్య శీలురు 110 నిముషాల పాటు ఆ రహదారి స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్యాల మెరుగుదల కోసం ప్రయత్నించారు. గతంలో ఎన్నో మార్లు శివరామపురం కార్యకర్తలతో గలిసి వీళ్ళు ఒక్కో మారు నెలల తరబడి కూడ కష్టించి, ఈ 3 కిలోమీటర్ల బాటను చెట్లతో – పూలమొక్కలతో – స్ఫూర్తిదాయక నినాదాల వ్రాతలతో మెరుగులు దిద్ది, దాని స్వరూపాన్ని మార్చి వేసిన వాళ్ళే! చల్లపల్లి గ్రామ అంతర్గత రోడ్లనే గాక – గ్రామం లోకి వచ్చే 7 రహదారుల్ని సైతం వీరు ఎంతగా శ్రమించి క్రొత్త రూపాలు సంతరించారంటే – అదంతా వ్రాస్తే – ఒకొక్క బాటదీ ఒక్కో ఘన చరిత్రే!

 

స్వచ్ఛ కార్యకర్తలు ఈ దారి కశ్మలాల మీద యుద్ధం మొదలు పెట్టిన తొలి గంటలో ఆకాశం నిర్మలంగానే ఉన్నది గాని, మలి గంటలో మాత్రం మంచు దట్టంగా అలుముకొని, శివరాత్రి భక్త యాత్రికుల వాహనాల సందడితో అతి జాగ్రత్తగా పనిచేయవలసి వచ్చింది. 6.00 దాటినా సరిగా ఏ వస్తువూ కనిపించలేదు. ఐనా ఇలాంటివి కార్యకర్తలకేమీ క్రొత్త కాదు. ఈ నాటి స్వచ్చంద కృషిని పరిశీలిస్తే – ఇది ప్రధానంగా 3 విధాలుగా కనిపించింది:

 

- ముగ్గురు మహిళలు చీపుర్లతో బాటనూ, దాని రెండు ప్రక్కల జాగాలను అప్పటికే ఉన్న ఆకులు, చెత్త, దుమ్ము, ఇసుకలనే గాక – కార్యకర్తల కత్తి వేటులకు కొత్తగా వచ్చే పిచ్చి – ముళ్ల మొక్కల వంటివి కూడ ఊడ్చే పని. ఈ బాధ్యతను ఆస్పత్రి నర్సులు స్వీకరించారు!

 

- గత రెండు మూడు మాసాలుగా పెరిగిన పచ్చివి, ఎండువి – బాట అందాన్ని దెబ్బ తీస్తున్న అన్ని రకాల పిచ్చి మొక్కల్నీ, వాటి మధ్య ఇరుక్కొన్న సారా, మంచినీళ్ళ ఖాళీ సీసాల్ని, తాటి మట్టల్ని, కొబ్బరి బొండాల మిగులు తగులుల్నీ, తీగల్ని 15 మంది పరపరా నరుక్కొంటూ పోతే – ఇద్దరు దంతెలతో వాటిని గుట్టలు చేస్తున్నారు. దారి ప్రక్క పడమటి డ్రైనులో వీరు నరికిన – గుట్టలు పేర్చిన తుక్కు ఒక ట్రాక్టరు ట్రక్కుకు పై మాటే!

 

- చెట్లను, పూల చెట్లను అవసరానుగుణంగా కొమ్మలు నరికి, పాదులు సరిదిద్ది, సంతృప్తికరంగా రూపొందించి, ఈ కళ్లేపల్లి బాటకు మరింత శోభను తెచ్చే ప్రయత్నం మరికొందరిది. ఇదేదో ఒకనాటి – ఒక ఏటి కృషి కాదు. ఎవరో ఒక నాయకుడు చెప్పినట్లు . “... ఇది నిరంతర ప్రక్రియ!”

 

6.30 కు ట్రస్టు కార్మిక నాయకుడు – కస్తూరి శ్రీనివాస్ కొంచెం పొందికగా ముమ్మారు పలికి, అందరిచే పలికించిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య నినాదాల పిదప గుంటూరు ధార్మికులైన లంకా సూర్యనారాయణ ప్రభృతుల “ధర్మ జ్యోతి” సంస్థ నుండి కార్యకర్తలకు ఆహ్వాన పత్రికలుఅందజేయబడినవి! చల్లపల్లి స్వచ్ఛ సైనికుల సంవత్సరాల కొద్దీ ఆదర్శ శ్రమదానానికవి తగిన గుర్తింపులు! రేపు – 13.03.2021 సాయంత్రం 6.30 కు జరిగే సేవా పురస్కార సభకు – ఇది కరోనా పునర్విజృంభణా కాలం గనుక – కార్యకర్తలందరి తరపున మన స్వచ్ఛ వైద్యులిద్దరో – ఒకరో సదరు పురస్కార స్వీకారానికి వెళ్ళి వచ్చే సమాచారం.

 

సమ్మానం, గుర్తింపులతో బాటు 1 లక్ష ధన పురస్కారం కూడ ఉన్న ఈ సమాచారం చాల విలువైనదీ, ఏడేళ్ళ స్వచ్చోద్యమకారుల భౌతిక – ఆత్మిక శ్రమఫలితమూ అని అందరం భావించదగినదీనూ!

 

రేపటి మన నిత్య నూతన శ్రమదాన వేదిక సైతం పెదకళ్లేపల్లి మార్గంలోని మేకలడొంక – 7 వ నంబరు కాలువల నడిమి ప్రదేశమే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర  మన చరిత్ర – 15

 

జాగృతమైఒక ఎడంద స్వచ్ఛ స్ఫూర్తి రగిలించగ –

వందమంది ఆ స్ఫూర్తిని అంది పుచ్చుకొని సాగగ –

ఒక మాటగ – ఒక బాటగ – ఉద్యమమై చెలరేగగ –

స్వచ్ఛ ధన్య చల్లపల్లి సంభవించె సుస్ధిరముగ!  

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,  

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

12.03.2021.