2149* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

2149* వ నాటి శ్రమదాన స్వచ్చోద్యమ చల్లపల్లి.

 

(14.03.2021) ఆదివారం కావడంతోనూ, శివరామపురం రైతులు కూడ రావడంతోనూ, లయన్స్ సేవా సంస్థ వారికి కూడ స్వచ్ఛ సుందర శ్రమదానం గాలిమళ్ళడంతోనూ ఈ వేకువ 4.30 నుండి 6.15 వరకు ఉత్సాహభరితంగా, ఉధృతంగా జరిగిన 39 మంది కార్యకర్తల శ్రమదానం ధనం కీర్తి వంటి భౌతిక ప్రమాణాలతో వెలకట్టలేనిది!

 

శ్రమదాన ప్రదేశం పెదకళ్ళేపల్లి బాటలో మేకలడొంక పంట కాలువల నడిమి చోటులో సుమారు 150 గజాల నిడివి! ఎవరి అంతరాత్మలు మేలు కొలిపితే వాళ్ళు స్వయం ప్రేరితులై, 3.30 కో మేల్కొని, 4.20 కే సంసిద్ధులై 2 – 3 కిలోమీటర్ల దూరం పయనించి, (అందులో కొందరు మహిళా మతల్లులు కూడ!) కార్యరంగంలోకి అంటే అష్టదరిద్ర కశ్మలాల క్షేత్రంలోకి చేరుకోవడమే (కార్యకర్తలకు కాదు గాని) బైట వారికెప్పటికీ నమ్మలేని అద్భుతావహ సన్నివేశమే!

 

నిన్న సాయంత్రం గుంటూరు బృందావన గార్డెన్స్ లో మనకోసం మనంట్రస్టును స్వధర్మ సేవా సంస్థ వారు మెచ్చి, ఎంచి, అనుగ్రహించిన (1 లక్ష చెక్కుతో సహా) పురస్కార ప్రదాన సభలోని 150 మందికి సైతం పవర్ పాయింట్ ప్రదర్శన సవివరణల తరువాత కూడ ఈ విషయంలో ఏ మూలనో చిన్న సందేహమూ, పెద్ద అశ్చర్యమూ ఆనందమూ అద్భుతమూ అనిపించినదట! 2150 రోజుల సుదీర్ఘ కాల స్వచ్చోద్యమానంతరం కూడ చల్లపల్లి శ్రమదాన సందర్శకులెందరికో ఇదే సమాధానం దొరకని చిక్కుముడి ప్రశ్న!

 

అసలు తమ స్వచ్ఛ సుందరోద్యమం అంతగా అద్భుతమనీ, జగదాశ్చర్యకారకమనీ.... ఈ స్వచ్ఛ సైనికులెప్పుడైనా అనుకొంటే గదా! తమ సామాజిక బాధ్యతని తాము పట్టుదలగా నెరవేర్చుతున్నామనీ, అందులో ఏ రోజుకారోజు సంతృప్తి పొందుతున్నామనే స్పృహ కలిగిన వాళ్లకు ఈ ధర్మ జ్యోతి వంటి అవార్డులూ రివార్డులూ ప్రశంసలూ అవసరం లేని మాట నిజమే గాని, మన స్వచ్చోద్యమ సారధి చెప్పినట్లు ఆ సభలకూ, చప్పట్లకూ మరొక ప్రయోజనమైతే ఉంటుంది చల్లపల్లి కార్యకర్తల స్వచ్ఛ సుందరోద్యమం వివిధ ప్రదేశాల సమాజాన్ని ఆలోచింపచేసి, ఏ కొంచెమో స్ఫూర్తి కలిగించి, ఆయా చోట్ల కూడ ఇలాంటి బాధ్యతలకు కొందరు పూనుకోగలరనే ఆశ!

 

ఈ శుభోదయం స్వచ్ఛ కార్యకర్తల 3 రకాల సామాజిక కర్తవ్య క్రియా రూపం ఇలా ఉన్నది :

 

1. బాటకు తూర్పుగా పెద్ద తాడిచెట్ల నుండి పండ్లు రాలి, గింజలు మిగిలి, మొలకెత్తి దట్టంగా పెరిగిన వందలాది తాడి మొక్కల్ని నరకడం కాక, పెకలించే పని! ఇందులో కత్తులు, పారలు పనికొచ్చాయి. పనిలో పనిగా చిందర వందరగా పెరిగి, దుమ్ము కొట్టుకొని, తమ మధ్య ప్లాస్టిక్ సంచుల్ని, ఖాళీ సీసాలను ఇముడ్చుకొన్న పిచ్చి, ముళ్ళ మొక్కల తొలగింపుకు గూడ ఈ 20 మంది కృషి చేశారు.

 

2. కార్యకర్తలు 10 మంది బాటకు పడమర డ్రైనులోను, గట్టు మీద పెరుగుతున్న అన్ని నిరుపయోగ మొక్కల్ని తొలగించి, దంతెలతో తాడి మట్టల్ని, చాలా ఇతర తుక్కునీ గుట్టలుగా లాగి పేర్చారు.

 

3. రోడ్డునూ, దాని రెండు అంచుల్నీ, ఇతర కార్యకర్తలు నరికే తుక్కునూ కొందరు మహిళలు చీపుళ్ళతో ప్రోగు చేశారు!

 

          ఇంకా ఒక సుందరీకర్త  దాదాపు రెండు గంటల పాటు అమెరికా నుండి ట్రస్టుకు అందిన ప్రత్యేక త్రాడు కత్తెరతో చాల చెట్ల కొమ్మల్ని చాకచక్యంగా కత్తిరించి కరెంటు తీగలకు తాకకుండ ఆపడం ఈ ఎందరినో ఆకర్షించింది!

 

7.00 దాక జరిగిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛ యార్లగడ్డ పంతం నెగ్గించుకొంటున్న తూము వేంకటేశ్వరరావు ముమ్మారు పలికిన స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలను అందరూ సమధికోత్సాహంతో స్వాగతించి, లయన్స్ క్లబ్ బాధ్యులు 10.00 – 1.00 ల నడుమ జరిగే తమ సంస్థ కార్యక్రమాలకు కార్యకర్తల్ని ఆహ్వానించి, శాస్త్రి గారు తీయవలసిన ఛాయా చిత్రాలన్నీ తీసి .... 7.10 తరువాత అంతా గృహోన్ముఖులయ్యారు.

 

17.03.2021 – బుధవారం వేకువ మనం స్వచ్చంద శ్రమదానం కోసం కలువదగిన చోటు బందరు దారిలోని సంత బజారు మొదట్లో. సమయం 4.20 – 4.30.

 

అదే ధన్యత అదే మాన్యత

 

ఎందరెంతగ పాటుబడిరో ఎందరెందరు సాయపడిరో -

నవ్యపధమున మేలి బ్రతుకుల దివ్యపధమును చూపగలరో

తామెగాక తోటి వారల స్వస్తతలకై తపిస్తుందురొ

అట్టి వారల స్వచ్ఛ వీరుల కంజలిస్తే అనుసరిస్తే....

            

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

14.03.2021.