2153* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే (విషతుల్యమైన) ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

శుభ్ర- సుందర చల్లపల్లి నిర్మాణం లో 2153* వ నాటి ప్రయత్నాలు.

 

కొన్ని వేల నాళ్ల వలెనే ఈ శనివారం(20.03.2021) నాటి 31 మంది చైతన్య శీలుర, దృఢ మనస్కుల క్రమ శిక్షణాయుత శ్రమదానంతో గ్రామ ప్రధాన రహదారిలో మరి కొంత మేర రాణించింది. వీరిలో 15 మందైతే మరీ వేకువ 4.19 కన్న ముందే బందరు జాతీయ రహదారి కాలుష్యాల మీద దండయాత్రకు సంసిద్ధులై పోయారు! కొన్ని నిముషాల వ్యవధిలోనే తమతో కలిసిన మిగతాసైనికులతో బాటు జరిపిన సమష్టి కృషితో 2 గంటల సమయం నెలకొన్న శ్రమ సందడి తో :

 

1.      హోమియో వైద్యశాల మొదలు భారత లక్ష్మి వడ్ల మర వీధి దాక,

 

2.      సంత వీధిలోని రైతు బజారు-నీళ్ల టాంకుల ప్రాంతం,

 

3.      రక్షక భట నిలయం మలుపు దగ్గర-త్రిముఖమైన సేవల లబ్ది చేకూరింది!

 

నేను కాక మరెవరైనా సావకాశంగా స్వచ్ఛ కార్యకర్తల దైనందిన శుభోదయ శ్రమదాన వైఖరిని, పని సమయంలో వాళ్ల ముఖాల్లోని వ్యగ్రతను గమనించారో లేదో తెలియదు. తొలి భాగంలో స్థిరంగా పని మీద మనసు లగ్నం చేసి, రెండవ భాగంలో అవలీలగా బరువు పనుల కోసం చెమటలు చిందించి, ఇక 5.45 తర్వాత చూడాలి- ఆ హుషారు, ఆతురత, పని నిలుపుదల కోసం డాక్టరు గారి తొలి ఈల మ్రోగుతుందేమోననే ఆందోళనలో చకచకా పని వేగము, రేపటికి ఈ కాస్త పని మిగిలిపోయి పని చోటు కళా విహీనంగా మిగిలిపోతుందనే ఆందోళన..... ఇలా ఈ చివరి దశ శ్రమదానం- అది కూడ నిరంతరంగాను, నిస్వార్థంగాను, గరిష్ట సామాజిక ప్రయోజనకరంగాను జరిగేది-ఎంతగా రెండు కళ్ళతో చూసినా తనివి తీరనిదే!

 

 సూర్య, చంద్ర, పశు-పక్ష- వృక్ష- ప్రకృతికే పరవశించే కవులు, కళాకారులు ఈ శ్రమ జీవన వైభవాన్ని చూసి మరెంతగా పులకించాలి! క్షణం తీరికలేని-ప్రతి నిముషమూ అధ్యయన శీలుడైన- దైహికంగా ఏమంత బలవంతుడు కాని ఐనా ప్రతి గంటా గ్రామ మెరుగుదల చింతనలో మునిగి  తేలే మన డి.ఆర్.కె. వైద్యునికి ఏ రోజుకారోజు నూతన శక్తినీ, ఉత్సాహాన్ని నింపేవి ఈ 40-50 మంది స్వచ్ఛ కార్యకర్తల దైనందిన సృజనాత్మక శ్రమదాన సన్నివేశాలే!

 

వాటిలో కొన్ని స్మరణీయ దృశ్యాలు:

 

- చంటి టిఫిన్ హోటల్ దగ్గరి మురుగు కాల్వ ఒడ్డున పెరిగిన గడ్డిని, పోగు పడిన అన్ని వ్యర్థాలను ఇద్దరు మహిళా కార్యకర్తలు (వదినా మరదళ్ల వరుసవాళ్ళు)చేతుల్తో, పారలతో నరికి, చెక్కి శుభ్రపరచడం!

 

- రెస్క్యూ టీమ్ వారు, సినిమా హాలు దగ్గరి బరువైన మాన్ హోల్ పలకల్ని తెచ్చి, బందరు దారి ప్రక్క మురుగు కాల్వను కప్పి, మురుగును దాచడం!

 

- ఒక్కో పేవర్ రాతిని 5 నిముషాల చొప్పున అమర్చి, సంత వీధిలోని మరొక గుంటను  సుందరీకర్తలు తెలవారే పాటికి అందంగా సర్ది, సరి చేయడం!

 

- గూడులు నొప్పి పెడుతున్నా ఆగక, అర కిలో మీటరు బందరు దారిని ఊడ్చి- ఊడ్చి శుభ్రపరచడం

 

- రెండు రకాల వ్యర్థాలను రెండు ట్రక్కుల్లో నింపి, చెత్త కేంద్రానికి తరలించడం!

 

రోజువారీ శ్రమదాన సమీక్షలో ఒక 80  ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు-నాలుగైదేళ్ళు స్వచ్చోద్యమ కార్యకర్త- రావూరి సూర్యప్రకాశరావు మహోదయులు గతంలో తన సహ కార్యకర్తల్ని- ముఖ్యంగా డాక్టరు DRK గారిని-పూర్వ మెప్పుడో చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి తన గురువైన వీరేశలింగం గారి పైన చెప్పిన అక్షర సత్యమైన

 

తన దేహము, తన గేహము / తన శక్తిని, తనదు యుక్తి, తన విద్య జగ

జ్జనులకె వినియోగించిన / ఘనుడీ వీరేశలింగ కవి జనులారా!

 

అనే పద్యంతో సమన్వయించి, చల్లపల్లి స్వచ్ఛ -శుభ్ర - సంకల్ప నినాదాలను ముమ్మారు పలికి- అందరిచే పలికించి, ‘మనకోసం మనంట్రస్టుకు 25000/- డ్రాఫ్టును సమర్పించారు. వారికి మన ఆయురారోగ్య ఆశీర్వాద పూర్వక ధన్యవాదాలు!

 

రేపటి మన తరువాయి శ్రమదానం కోసం భారత లక్ష్మి వడ్ల మర మలుపులో(బందరు రోడ్డు) కలుసుకొందాం!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర 19

 

కశ్మల విరహితంగా గ్రామ ముఖ్య రహదారులు

కనిపించని మురుగు పైనె కలవు వేల పూబాలలు

మహనీయ స్వచ్చోద్యమ మార్గం సుగమం చేసి

మనిషి కసాధ్యం లేదని మా వీధే ఋజువు చేసె!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

20.03.2021.