2155* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ప్రయత్నంలో 2155* వ పనిదినం.

 

నేటి (24.03.21) ఉషోదయ స్వచ్చంద శ్రమదాన వేదిక కూడ బందరు జాతీయ రహదారిలోని అమరావతి రాజభవన ప్రాంతమే! ఆ ప్రక్కన – శిర్విశెట్టి దంత వైద్యశాల ఎదుట వాహనాలను నిలుపుకొని, ఛాయాచిత్ర మూలకంగా సంఘటితులై, స్వచ్చాయుధ – పరికర సన్నద్ధులౌతున్న సుమారు పదిహేను మందినీ, కొన్ని నిమిషాల ఎడంలో వచ్చి, కలిసిన మరొక 16 మందినీ వాట్సాప్ మాధ్యమంలో గుర్తించండి. ఈ మంగళవారం 6.30 తరువాత – “ట్విల్స్” అధునాతన వస్త్ర దుకాణం ఎదుట నేటి తమ శ్రమదాన ప్రయత్నాన్ని సమీక్షించుకొంటూ, పిడికిళ్ళు బిగించి నినదిస్తున్న 30 మంది కూడ వాట్సాప్ లో కనిపిస్తారు!

 

నేటి స్వచ్ఛ – సుందర – శుభ్ర పరిసరాలు సగం మొన్న ఆదివారం నాటివే. కాకపోతే – దివంగత వాసిరెడ్డి కోటేశ్వర మహాశయ నిర్మితమైన (భారతలక్ష్మి వడ్లమర బాటలోని) ఉద్యానమూ, తత్సమీప ధాన్యయంత్రపు ముందు భాగమూ – మురుగు గుంటలతో సహా – ఈ బందరు రహదారికి అదనం! 2155 నాళ్ళ సుదీర్ఘ – నిస్వార్ధ శ్రమదాతలకు – “ఎక్కడైతేనేం, ఏదైతేనేం? తమ గ్రామం మురికి, కశ్మలాలను తొలగించామా, లేదా” అనేది ముఖ్యం! కొంత నెమ్మదిగానైనా సరే – స్ధిరంగా స్వయం నిర్దేశిత గ్రామ స్వస్తతా లక్ష్యాలను చేరుకోవడమే ఈ స్థిత ప్రజ్ఞులు ఆశించేది! అలుపెరగక – పట్టువదలక – రోజూ 2 గంటల తమ కాయకష్టాన్ని ఉన్న ఊరికర్పిస్తున్న ఈ కర్మ వీరుల గురించి కాక – ఏ మహాకధానాయకులను గూర్చి నా బోటి వాళ్ళు వర్ణించి వ్రాస్తుండాలి?

 

గత ఆదివారం తాము క్షుణ్ణంగా మెరుగుపరచిన సజీవ జలపుష్పదుకాణం (లైవ్ ఫిష్) నుండి మునసబు వీధి దాక మరొకమారు మహిళా కార్యకర్తల చీపుళ్ళు, మగ కార్యకర్తల దంతెలు, గోకుడు పారలు పూనుకొన్నాయి. ఏ మొక్కల నర్సరీ తాలూకోగాని, దారి ప్రక్క ప్లాస్టిక్ కుండీలు, అందులోని మట్టి ట్రక్కులోనికెత్తడం, ట్విల్స్ అంగడి దగ్గర ప్రోగుబడిన దుమ్ము – ధూళి – ఇసుకల్ని డిప్పలతో ట్రక్కులు నింపడం, రద్దు మిశ్రమ బస్తాలను నూతన కట్టడ యాజమానుల అనుమతితో ఎత్తి, మోసి, టాటా ఏస్ లోకి చేర్చడం – ఇవన్నీ ఎంత కష్టసాధ్యములో, కార్యకర్తల ఏ తాత్త్విక బల సన్నద్ధతో ఈ శ్రమదాన యజ్ఞం సాధ్యపడుతున్నదో గ్రామ ప్రజలు ఇప్పటికైనా తీవ్రంగా పరిగణించాలి!

 

రోడ్డు మీద గట్టిపడిన దుమ్ము – ఇసుక మిశ్రమాన్ని పారలతో చెక్కడం, గోకుడు పారలతో, రైల్వే పారలతో గోకడం, వైజయంతపు ప్రహరీ ప్రక్కన ఎత్తు పల్లాల్ని సరిదిద్దడం, అక్కడ మరణించిన కొన్ని బిళ్ళగన్నేరు లాంటి పూలమొక్కల్ని ఎన్ని – ఎప్పుడు – నాటి పూరించాలో యోజించడం, చర్చించుకోవడం – ఇవన్నీ నేటి సుందరీకర్తల వంతు!

 

కత్తులు, దంతెలు, చీపుళ్లతో వడ్లమర దారిలో జరిగిన స్వచ్ఛ – పరిశుభ్ర – సుందరీకరణాలను ఎంతసేపైనా వర్ణించి వ్రాయవచ్చు! ఐతే – “ఇంతమంది మంచి మనుషుల – ఇన్ని వేల దినాల – ఇంత గొప్ప కృషికి స్పందించని గ్రామస్తుల కోసం – ఇలా పాట్లు పడుతున్నారే...అయ్యో!...” అనుకొని జాలిపడే కొందరుంటే – వాళ్ళ మీద మనం జాలిపడదాం!

 

6.30 కి ఈ మంగళవారం నాటి శ్రమదాన సమీక్షా సమావేశంలో – డాక్టరు గారి మెచ్చుకోళ్ళు, ముమ్మారు రాయపాటి రాధాకృష్ణ గారి గ్రామ మెరుగు బాటు సంకల్ప నినాదాలూ, అందుకు మిగిలిన కార్యకర్తల లయబద్ధమైన ప్రతి స్పందనలూ – అన్నీ యధావిధిగా ముగిసినవి.

 

రేపటి శ్రమదాన ప్రణాళిక ప్రకారం – వేకువ 4.30 కు ఈ బందరు మార్గంలోనే – భగత్ సింగ్ దంత వైద్యశాల దగ్గరే మన కలయిక.

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర – (భక్తులకొక విన్నపం) - 21

 

అందాన్నాస్వాదించే భావుకులకు స్వాగతం!

భక్తి పూర్తి వ్యక్తిగతం – భక్తుల కొక విన్నపం

ఇంతటి అందాల వెనుక ఎంతటి శ్రమదాగుందో

గుర్తించి ప్రయత్నిస్తే గొప్పది ఆ అనుభవం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

23.03.2021.