2157* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ – సుందర చల్లపల్లి కోసం 2157* వ నాటి బహుముఖ కృషి.

 

25 వ తేదీ – గురువారం వేకువ 4.25 కే వాట్సాప్ ప్రారంభ చిత్రంలో 20 మంది నిలిచి ఉండడము సరే – జాగ్రత్తగా చూస్తే – వాళ్ళ ముఖాల్లో, కళ్ళలో తమ గ్రామ మెరుగుదలకై ఒక కృత నిశ్చయం కూడ కనిపిస్తున్నది! మరో 10 మంది వెంటనే వీరితో కలిసి – మొత్తం 30 మంది గ్రామ స్వచ్ఛ కార్మికులు రెండు చోట్ల 6.12 దాక – అంటే సగటున 108 నిముషాల చొప్పున చేసిన కృషికి, రాణించిన ప్రధాన వీధికి స్వచ్ఛ – సుందర ఛాయాగ్రాహకుని (శాస్త్రి గారి) వాట్సాప్ ఛాయాచిత్రాలు, దృశ్య శ్రావణ (వీడియో) లే సాక్ష్యం! ఐతే ఈ చిత్ర సాక్ష్యాల్నన్నీ ఎవర్నీ నమ్మించడానికి కాదు – దేశ విదేశాల చల్లపల్లి స్వచ్చోద్యమాభిలాషుల సంతోషం కోసం మాత్రమే!

 

ఇన్ని వేల దినాల నిస్వార్ధ శ్రమదానం తరువాత – వందల కొద్దీ ఆనందానుభూతుల తరువాత – తమ దైనందిన స్వచ్చ కృషిలో ఎదుర్కొన్న సమస్యలతో రాటుదేలిన ఈ స్వచ్చోద్యమకారులకు ఆడియో  - వీడియో చిత్ర వ్యామోహాలుంటాయని అనుకోను! వాళ్ళు కేవలం తమ విధ్యుక్త కర్మిష్టులు! ఇదంతా తమ నిత్య స్వగ్రామ నీరాజన ఘట్టం! కాకుంటే - 5.25 చీకటి వేళ - టాటా ఏస్ తలుపు అంచు మీద నిలబడి – క్రిందికి వ్రేలాడుతున్న త్రుప్పు పట్టిన ఇనుపకడ్డీ అటుగా నడిచే కాస్త పొడగరుల తలకు ప్రమాదమని గుర్తించి దాన్ని అతి కష్టమ్మీద కోసే కార్యకర్త ఆపని చేయగలడా? మురుగులో దిగి, ప్లాస్టిక్ తుక్కును బైటకులాగుతున్న వ్యక్తీ, మురుగు అంచుల మీద నిలిచి, శుభ్రపరిచే ఇద్దరు మహిళలు ఈ వేకువ సమయంలో ఆ పనులు చేయనేలేరు గదా!

 

అసలు చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలంటేనే – మానసికంగా, భౌతికంగా స్వయం ప్రేరిత – స్వయం సమృద్ధ సైన్యం! ఇవాళ్టి స్వచ్చోద్యమ ప్రధాన కేంద్రం మునసబు వీధి ముఖద్వార ప్రాంతం. అక్కడి నుండి దక్షిణంగా దారి ఉభయ దిశల వ్యర్ధాలు, బాట మీద దుమ్ము – ధూళి, గడ్డీ – గాదం తొలగిపోయి, ఆ మార్గంలో కొంత వరకూ బాగుపడింది.

 

- గతంలో తామే వ్యయ ప్రయాసలతో తీర్చిదిద్దిన కర్మల భవన ప్రాంగణము, రహదారి వనములోని ఆకులలములు, పుల్లాపుడకలు, లోతు డ్రైనులోని నానాజాతి వ్యర్ధాలు పదిమంది కార్యకర్తలు తొలగించారు.

 

- మునసబు వీధి మలుపు, దాని దక్షిణ వైపు మురుగు ఇంకొకరు చూచుకొన్నారు.

 

- పింగళి వారి రహదారి వనంలోని దట్టమైన రకరకాల వ్యర్ధాలు, పూల మొక్కలు వంటి కాయకష్టపు పని నలుగురి వంతు.

 

- ముగ్గురు నర్సులు, ఒక సంచార వ్యాపారి బందరు రహదారిని, దాని ప్రక్క రంగు రాళ్ల దుమ్ము – ఇసుకలు - రిజిస్ట్రారు కార్యాలయం దాక ఊడ్చే పని – చూచుకొన్నారు.

 

- నిన్నటి స్వచ్చ – శుభ్ర – సుందరీకృత ప్రాంతానికే నలుగురు సుందరీకర్తలు మరిన్ని మెరుగులు దిద్దుతూ కనిపించారు.

 

ఇక్కడికి కిలోమీటరు దూరంలో, బైపాస్ మార్గం – సాగర్ టాకీసుల మలుపులో గుంటను పూడ్చి, మరింత వాహన భద్రత చేకూర్చే బాధ్యత నలుగురిది.

           

         నేటి శ్రమదానం ముగింపు సమావేశంలో చల్లపల్లి స్వచ్చోద్యమ సారధి మన గ్రామ మెరుగుదల శుభ సూచకమైన ఒక విశేషం ప్రస్తావించారు:

 

         చల్లపల్లి మండల అభివృద్ధి బాధ్యుడైన అధికారి M.D.O - గంజి శ్రీనివాసరావు గారు నిన్న 3 గంటల పాటు స్వచ్చోద్యమ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను శ్రద్ధగా చూసి, గ్రామ పురోభివృద్ధి విషయంలో పూర్తి అవగాహనకు వచ్చి, పరిపాలన స్థాయిలో తనకు చాతనైనంతగా పాటుబడతానని చెప్పారట! సమర్ధుడూ, నిక్కచ్చి అధికారీ ఐన ఈ కార్యశూరుని వలన చల్లపల్లి కెంతో ప్రయోజనం కలుగకమానదు!

 

విజయ కళాశాలోపన్యాసకుడు – వేముల శ్రీనివాస్ గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు నినదించి అందరి ప్రతి స్పందనలూ వినిపించారు.

 

రేపటి శుభోదయ శ్రమదాన వేదిక కూడ బందరు జాతీయ రహదారే!

 

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర మన చరిత్ర 23

 

ఈ మార్గం స్వచ్ఛతకై – ఏడెనిమిది ఏళ్ల క్రితం

తపించారు – శ్రమించారు దార్శనికులు అహర్నిశం

ఇప్పుడదే బాట మీద ఏ వందలొ, వేల మంది

పరవశించి నడవడమే వారికి మహదానందం!

 

నల్లూరి రామారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

25.03.2021.