2165* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

35 మంది నిర్వహించిన 2165* వ నాటి గ్రామ స్వచ్ఛ సుందరీకరణం.

 

ఈ ఆదివారం (4.4.21) వేకువ 4.21 కే బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధి చివర సమాయత్తులైన 19 మంది, మరొక 18 మంది కాస్త వెనుకాముందు గాను కలిసి మొత్తం 37 మంది ప్రణాళికాబద్ధంగా చేసిన 1 గంటా ఏభై నిముషాల శ్రమదానంతో 200 గజాల మేర బైపాస్ బాట కాస్తా నానా కంగాళీలను వదిలించుకొని, వందలాది మంది స్థానికులకు, ప్రయాణికులకు సౌకర్యాన్ని, ఆహ్లాదాన్ని పంచుతున్నది. (ఐతే సదరు కంగాళీల కారకుల, ఆహ్లాద అనుభవదారుల మరియు ఈ స్వచ్ఛ శుభ్ర సుందరీకర్తల నిష్పత్తి మాత్రం వేలమంది : 35 మంది!)

 

బ్రాకెట్లలో వ్రాసింది నా సొంత ఆలోచన. గ్రామ బాధ్యతా కర్మిష్టులైన స్వచ్చోద్యమకారులు మాత్రం వేల దినాల నుండి తమ ఊరి ఔన్నత్యం కోసం తామనుకొన్నది శక్తివంచన లేకుండ చేస్తూనే పోతున్నారు! శ్రమదానంతో బాటు సమయ నగదు దానాలు ఏనాడో అలవరచుకొన్నారు. తమ, తమ వారల పుట్టిన, వివాహ ఘట్టాల వార్షిక వేడుకలను సైతం నడి రోడ్ల మీద సోదర కార్యకర్తల సమక్షంలో జరుపుకొనే ఒక క్రొత్త సంఘటిత సుహృద్భావం, శ్రీశ్రీ చెప్పినట్లు వ్యక్తికి బహువచనం శక్తి" అనే అవగాహన వంటి లక్షణాలు కనీసంఈ ఒక్క గ్రామంలోనైనా చూడగల్గడమే పెద్ద విశేషం! ఈ 21 వ శతాబ్దిలో స్వచ్చోద్యమ చల్లపల్లే ఒక ఒయాసిస్!

 

చాల నెలల తరువాత ఈ ఆదివారం వేకువ ఈ బైపాస్ వీధిలో కార్యకర్తల శ్రమ విన్యాసాలిలా ఉన్నవి :   

 

1. సామ్యవాద (కమ్యూనిస్ట్) వీధికి పడమర భాగాన్ని సుందరీకరణ ముఠా సొంతం చేసుకుని, ఉత్తరం వైపు రహదారి వనంలోని ఆకులు, గడ్డి, అవసరం లేని మొక్కల్ని, ఖాళీ సీసాలుంటే ప్లాస్టిక్ సంచులుంటే అన్నిటినీ తొలగించారు. వనం వెలుపలి అన్ని రకాల తుక్కుల్నీ, బాట మీది దుమ్మునూ ఊడ్చి ఏరి శుభ్రపరిచారు. అసలీ బృందం దారే వేరు - ఏ భాగాన్ని తీసుకొన్నా అది నాణ్యమైన అద్దంలా మారిపోవలసిందే.

 

2. ఇక కత్తుల దంతెల వీరులు 17 – 18 మంది అక్కడి నుండి తూర్పుగా ప్రధానంగా బైపాస్ దారిని, కొసరుగా కుడి ఎడమల చిన్న రోడ్లనూ ఎంతగా శుభ్రపరిచారంటే మురుగు కాల్వలోని కొన్ని వ్యర్ధాలు, కాల్వ ఒడ్డు మీద పెరిగిపోయి, ఏ మాత్రం నచ్చని పిచ్చి మొక్కలూ, హద్దులు దాటి పెరిగిన పూల మొక్కల కొమ్మలు, గడ్డి, ఖాళీ సీసాలు, వంటి వెన్నో తొలగిపోయి, దంతెల చీపుళ్ళకు చిక్కి, డిప్పల ద్వారా ట్రాక్టర్ లోకి (ఈ పని ఇద్దరు మహిళలది!) ఎక్కి, చివరకు చెత్త కేంద్రానికి చేరిపోయినవి.

 

స్వచ్ఛ కార్యకర్తలది నిస్వార్ధ ప్రజోపయుక్త - పని సంస్కృతి అని అందరికీ తెలుసు కాని దగ్గరగా ఉండి, పరిశీలిస్తే తెలిసేదేమంటే వాళ్లు శ్రమదానాన్ని చాలా ఇష్టంగాను, వేడుక గాను నిర్వహిస్తారని! మధ్యలో ఒకరిద్దరి గట్టి అరుపులు వినిపిస్తే వినిపిస్తాయి గాని, పని సమయంలో ఎన్నో ఛలోక్తులు, చమత్కార సంభాషణలు, కొండొకచో - మాయా బజారు సినిమాలో ఘటోత్కచుడు చెప్పినట్లు క్రొత్త పదాలు సైతం అప్పటికప్పుడు పుట్టుకు వస్తూనే ఉంటాయి.

3. కొసరుగా, విజయ్ నగర్ లో ఒక వీధిని, సజ్జా ప్రసాదు గారి బాటలో కొంత భాగాన్ని కూడ కశ్మలరహితంగా పరిష్కరించారు.

 

         6.35 తరువాత డాక్టరు గారి సమీక్ష/ విశ్లేషణకు ముందు మూడు మార్లు స్వగ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలు ఎలుగెత్తి చాటినది ఒకప్పటి స్వచ్ఛ చల్లపల్లి నవయువ కార్యకర్తల్లో ఒకడైన సాధనాల సతీష్! దుర్గా ప్రసాదు మాష్టారుతో కలిసి కార్యకర్తలకు (భారీ) అల్పాహారాన్ని తినిపించడమే గాక – ‘మనకోసం మనంట్రస్టుకు 3,000/- కూడా విరాళాన్ని సమకూర్చిందీ అతడే! (సందర్భం ఇటీవల తన ద్వితీయ కుమార్తె తొలి జన్మదినం)

 

         ఇక శంకర శాస్త్రి గారి సంగతి చెప్పేదేముంది పెన్షను ఇంకా రాకుపోయినా మేనేజింగ్ ట్రస్టీ గారికి 5000/- చెక్కుతో ఆయన రడీ!

 

అటు ధ్యానమండలి ముఖ్యుడూ – ఇటు స్వచ్చ చల్లపల్లి బాధ్యుడు అయిన రాయపాటి రాధాకృష్ణ గారు కూడా అంతే! ఇంకా ఫించను అందకపోయినప్పటికీ 1,000/- విరాళం డా.డి.ఆర్. కె గారికి సమర్పించడం ఆయనకే చెల్లు.     

 

         బుధవారం (6.4.2021) నాటి మన వీధి శుభ్రతా సాధన కోసం మనం మరల ఈ నాటి ప్రదేశంలోనే కలుసుకుందాం.

     

      వాళ్లతి  రధమహారధులు.

 

ప్రజా స్వస్తతల పోరున వారతి రధమహారధులు

అండదండలాసించనిఅసహాయ మహాశూరులు

ఐక్యమహా స్వచ్ఛ సేన కను నిత్య ప్రవర్తకులు

స్వచ్చోన్నత చల్లపల్లి సమగ్రతకు అంకితులు!  

 

ఒకానొక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

04.04.2021.