2202* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

చల్లపల్లి జనహిత ప్రయోగానికి 2202* రోజులు.

 

            7.8.2021 వ స్థిరవారం వేకువ 4.21 సమయానికే తమ గ్రామాభ్యుదయ కృషీవలురు స్వచ్ఛ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. వాళ్లేమో పాతిక మంది పై మాటే! వారి చెమటలకు నోచుకున్న చోటేమో గంగులవారిపాలెం దగ్గర నిర్మాణం పూర్తి కావస్తున్న జాతీయ రహదారి సమీపాన! 40 – 50 పని గంటల ఒక ఆదర్శ మేటి స్వచ్ఛతా వ్యవసాయంతో మెరుగు పడిన 100 గజాల బాట – మురుగు కాల్వ వంతెన కటూ ఇటూ! కొంచెం చిత్త శుద్ధినీ, మరి కొంత త్యాగ నిరతి నీ పెట్టుబడిగా పెట్టిన ఈ 25 మందికి ప్రతి ఫలం – తామనుకొన్నది నెరవేరుతున్న సంతృప్తి!

 

75 ఏళ్ల క్రిందట ఒక కర్షక కవి – జాస్తి వేంకట నరసయ్య – అప్పటి కవితా పోకడల కనుగుణంగా భావ కవితా జలధిలో ఈదులాడుతున్న సోదర కవులనుద్దేశించి, పద్య రూపంలో ప్రశ్నించాడు. “ఓ మహాకవులారా! ఊహా ప్రేయసుల కళ్ళు, సోయగాలు, ప్రణయాలేనా? కార్మిక – కర్షకుల కష్టాల బ్రతుకులు మాత్రం కవితా వస్తువులు కావా...?” అంటూ –

“.... మేడిపై

భారము మోపి కష్టపడు భాగ్యము చూడగ లేవ? కైత సిం

గారము కింతకన్న తగు ఘట్టము లేర్చెదవా కవీశ్వరా?”

అని కూడ నిలదీశాడు.

ప్రతి ఉషోదయాన చల్లపల్లి కార్యకర్తల సందర్భానుగుణ గ్రామ మెరుగుదల శ్రమను గమనిస్తుంటే - “ఈ నిష్కామ స్వచ్చంద కార్మికుల త్యాగనిరతి ఏ అత్యున్నత అధికార పదవీ నిర్వహణ కన్న తక్కువ? తమ రాజుల – రాణుల కోసం, రాజ్యం కోసం శత్రు వీరుల్ని చంపి, చచ్చే సైనికుల కన్న గ్రామ పౌరుల స్వస్తత కోసం వీళ్ళ ఆశయమూ, ఆదర్శమూ గొప్పవి కావా?...” అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి.

 

కావాలంటే – నేటి “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం మాధ్యమ చిత్రాన్ని పరిశీలించండి :

 

- మానవ J.C.B. ల్లాగా గంగులపాలెం వంతెన దగ్గర తాడి చెట్లను, ఈత చెట్లను, ఇతర ముళ్ళ చెట్లను పెకలిస్తున్న వాళ్ళనీ,

 

- పొడవైన తాడి బొందుల్నీ అవలీలగా మోసుకుపోయి, వంతెన దగ్గరి మలుపు పల్లాలను చక్కబెడుతున్న ముగ్గుర్నీ,

 

- బండ్రేవు కోడు మురుగు కాల్వనీ, గట్టునీ శుభ్రపరుస్తున్న “రెస్క్యూ టీమ్” నీ

 

- ఇంకా బాటల్ని శుభ్రపరుస్తున్న, చెట్ల పూల మొక్కల అందాలకు మెరుగులు దిద్దుతున్న కార్యకర్తల్నీ

 

మరల మరలా గమనించండి.

 

6.20 సమయంలో చల్లపల్లి పడమర బజారుకు చెందిన, హైదరాబాదు లో ఉద్యోగిస్తున్న మారుతీ ప్రసాదు అనే యువకుని త్రిగుణాత్మక స్వగ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాల్నీ గ్రామస్తులు తప్పక వినాలి. డాక్టరు గారి సమీక్ష తర్వాత ఏకాభి ప్రాయమేమంటే – ఈ మురుగు కాల్వ దక్షిణపు గట్టు పరిశుభ్రత కోసం, మొక్కలు నాటే నిమిత్తం మరొక వారం కూడ ఈ ప్రాంతంలోనే పాటుబడాలని.

 

కనుక రేపు సైతం ఈ మురుగు కాల్వ వంతెన దగ్గరే మన కలయిక!

 

పెన్షనర్ల అంకిత కృషి.

 

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ –

సామాజిక ఋణ విముక్తి తాత్వికత పునాదిగా –

పెన్షనర్లు వేకువనే వీధులన్ని సంచలించి

స్వగ్రామపు బాధ్యతలకు అంకితులై పోవు తపన!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

07.08.2021.