2203* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

చల్లపల్లి సామాజిక వినూత్న ప్రయోగంలో 2203* దినాలు

 

            ఈ ఆదివారమైతే (8.8.2021) ఓం ప్రధమంగా మరీ 4.19 వేకువ వేళకే 13 మంది స్వచ్చ కార్యకర్తలు గంగులవారిపాలెం దారి దగ్గరి బైపాస్ రహదారిలో సంసిద్ధులైపోయారు వాళ్ల పనిముట్ల ట్రాక్టరు, సరంజామా వాహనం, ఇంకా సైకిళ్ళు, మోటార్ బైకులతో సహా! ఒక దశలో నేను లెక్కించిన కార్యకర్తల సంఖ్య 36. వారి కత్తులకు, పారలకు, పలుగులకు, రైల్వే పారలకు బలైపోయిన పిచ్చి ముళ్ళ మొక్కలు, తీగలు, తాడి మొక్కలు, ప్లాస్టిక్ తుక్కులూ ఎక్కడంటే మురుగు కాల్వ వంతెన సమీపాన!

 

            ఆ కాలువ ఉత్తరపు గట్టు రోడ్డు ప్రక్కల గూడ కొంత సుందరీకరణ పని జరిగింది గాని, ఈ ఆదివారపు వేకువ ఎక్కువ మంది దృష్టంతా బైపాస్ మార్గం వైపున పడమటి భాగపు కాలుష్యాల మీదనే! అసలా భాగాన్ని జె.సి.బి. లతో బాగు చేద్దామను కొన్నారు గాని, ఉత్సాహం మితి మీరిన కొందరు కార్యకర్తలే J.C.B లుగా మారి, తాడి మొద్దుల్ని, వాటి మధ్య పెరిగిన అనేకానేక పనికిరాని చెట్లను, చెత్తను, ఇతర వ్యర్ధాలను త్రవ్వి, నరికి, దంతెలతో లాగి, పచ్చి ఎండు గడ్డిని సైతం కోసి, ఎంతగా తీర్చి దిద్దారంటే – “100 గజాల రోడ్డు నిన్నటిదేనా?” అని సందేహించేంతగా!

 

            ఇంతటి నిస్వార్ధ గ్రామ ప్రయోజక కృషి తమ ఊళ్లో జరుగుతున్నా ఈ స్వచ్చోద్యమానికి అతిధులుగా నైనా వచ్చి చూడని సోదర గ్రామస్తుల్ని ఏమనాలి? ఒక సీనియర్ వైద్యుడు వేకువనే చీపురుతో రహదారిని ఊడ్చే సన్నివేశాన్ని, ఒక మహిళా సర్పంచి దంతెలతో తుక్కును లాగి, ట్రాక్టర్ దగ్గరకు చేర్చే దృశ్యాన్ని, 6 – 7 – 8 ఏళ్ల పిల్లలు దుమ్మును ఇసుకను ఊడ్చే సంఘటను, బరువైన అలవాటు లేని పనుల వల్ల బట్టలన్నీ చెమటతో తడిసిన ఒక విద్యాధిక యువకుణ్ణి, శరీరాలు సహకరించినంత వరకు దారి ప్రక్క గడ్డి చెక్కుతున్న వృద్ధుల్ని సినిమాల్లో, సీరియళ్ళలో కాక యదార్ధ దైనందిన జీవితంలో ఇంకెక్కడ చూడగలరు?

 

            ఇలాంటివి చూసినప్పుడే ఈ ఒకొక్క కార్యకర్త స్వచ్చ ప్రక్రియ సాహసాల్ని గురించి కనీసం ఒక్కో పేజీ ఐనా రాయాలనిపిస్తుంది! ఇవి చూసి, సంతృప్తులయేందుకే పొరుగూరు నుండి 80 ఏళ్ల వృద్ధ దంపతులు వేకువనే వచ్చి కూర్చున్నారు కార్యకర్తలందరికీ రావెళ్ళ శివరామకృష్ణయ్య దంపతులు బిస్కట్లు, మిఠాయిలు పంచారు ట్రస్టు ఖర్చుల నిమిత్తం (ఇటీవల ఇచ్చిన 10 వేలు కాక) 2000/- విరాళమిచ్చారు. చాపల (సబ్బినేని) బోసు గారు సహ కార్యకర్తలందరికీ విందు ఏర్పాటు చేశారు.

 

సంవత్సరం క్రిందట ఇదే రోజు కరోనాకు బలైన జనవిజ్ఞాన వేదిక - స్వచ్చ కార్యకర్త వరదా బాబ్జీ సంస్మరణగా వారి కుమార్తె అల్లుడు (వనజ, ఐతా రామకృష్ణ) గార్ల 5000/- విరాళం నేటి మరొక విశేషం.

 

మన తదుపరి శ్రమదాన నిమిత్తం బుధవారం (11.8.21) వేకువ సైతం ఇదే చోట బండ్రేవు కోడు వంతెన సమీపాన కలుద్దాం.   

 

 

కాలుష్యాల వికృతాల

 

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ

సామాజిక ఋణ విముక్తి సాధన ఒక తాత్త్వికతగ

శ్మశానాల బడుల గుడుల ఖాళీ స్తల వికృతాలు

కాలుష్యాలు కట్టగట్టి కడిగి పార వేయడం!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

08.08.2021.