2204* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

కొంగ్రొత్త సామాజిక ప్రయోగశాల (చల్లపల్లి) లో 2204* వ నాటి విశేషాలు.

 

            ఈ నాటి (బుధవారం - 11.8.2021) 23 మంది ఆదర్శత శ్రమదాతలతో 14 మందికి కుదిరిన ముహూర్తం వేకువ 4.26 మొదలు 6.15 వరకు ఎక్కడనేది చెప్పేపనేముంది – (పాతరోజల్నాటి సచిత్ర ప్రకటన – ‘ఎక్కడ లైఫ్ బాయ్ ఉండునో అక్కడ ఆరోగ్యం ఉండునుఅన్నట్లుగా) చల్లపల్లి లో ఏ మూలన కాలుష్యం బెడద ఉన్నదో అక్కడ స్వచ్ఛ సైనికులు ప్రత్యక్షమౌదురు! అనగా గంగులవారిపాలెం దారిలో బండ్రేవు కోడు మురుగు కాల్వ వంతెనకు అటూ ఇటుగా! మరి, వాళ్ళ విధ్వంసానికి గురైన కశ్మలాల వివరాలేమనగా :

 

- వంతెన దగ్గరి దక్షిణపు గట్టు లోతట్టున స్వచ్ఛతా ప్రియులకు చూసేందుకు అసహ్యంగా కనిపించే, చిందర వందరగా పెరిగిన ముళ్ళ పిచ్చి చెట్లు, తీగలు, గడ్డి వగైరాలు. వీళ్ళు ఏడెనిమిది మంది. (ఇందులో ఒకాయన – 66 ఏళ్ళ తీపి జబ్బు వృద్ధుని చేతి వ్రేలొకటి గట్టిగానే దెబ్బతిని, నెత్తురు వస్తున్నా ఐదారు నిముషాలలోనే తన బాధ్యతను పునఃప్రారంభించాడు!)       

 

- మురుగు కాల్వ ఉత్తరపుటొడ్డున వర్షాలకు కోసుకుపోయి, ఆ పల్లాలు తామే పెంచిన చెట్ల ఉనికికి క్షేమంకాదనీ, ఇంకొంచెం అందంగా కనిపించాలని, తాటి దూలాలను అమర్చి, తమ లక్ష్యాన్ని సాధించారు.

 

- ఇక సుందరీకర్తలు ఐదుగురి సంగతేమంటే ఈ రోడ్డును ఎన్ని రోజులుగా ఊడ్చినా, పూల మొక్కల కెన్ని మెరుగులు దిద్దినా, కుదుళ్ల కలుపు తీసి, ఇన్నాళ్లుగా సుందరీకరిస్తున్నా వాళ్ళకు తనివి తీరదు!

 

- మరో నలుగురైదుగురి ఉద్దేశ్యమూ ఇలాంటిదే! వంతెనకూ జాతీయ ఉపమార్గానికీ నడుమ 3 రోజుల క్రిందట తాము శుభ్రపరచిన పడమటి భాగంలో అక్కడక్కడ కొరవడిన స్వచ్ఛతను పూరించారు.

 

            ఇందరు గ్రామ మెరుగుదల శ్రామికులలో ఎవరి పాత్ర ప్రత్యేకమో, ఎవరి దీక్ష అకుంఠితమో, ఎవరిది సుదీర్ఘకాలంగా సడలని పట్టో – ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంసామాజిక మాధ్యమ పాఠకులు, అభిమానులు, ఛాయా భంగిమ చిత్ర వీక్షకులే నిర్ణయించండి!

 

            6.30 సమయంలో విధిగా జరిగే సమీక్షా సందర్భంలో ప్రతి క్షణ స్వచ్ఛ కార్యకలాప పరిశీలకుడైన దాసరి రామకృష్ణ వైద్యుని దైనందిన సంతృప్తికీ వెలకట్టలేము! అదే సందర్భాన ఈ నాటి Wounded Soldier (గాయపడ్డ స్వచ్ఛ సైనికుడు) కోడూరి వేంకటేశ్వరరావు గారి త్రిగుణాత్మక స్వగ్రామ స్వచ్ఛ శుభ్ర సుందర సంకల్ప నినాదాలు మారుమ్రోగి, చెవులు తుప్పు వదలిన సంగతీ ప్రస్తావనార్హమే!

 

రేపటి మన మురుగు కాల్వ గట్లస్వచ్ఛ శుభ్ర ప్రయత్నం కూడ ఈ వంతెన దగ్గర నుండే ప్రారంభించాలి.

 

- నాదంతా సంకీర్తన – (ఒకానొకరి స్వగతం)

 

మట్టి త్రవ్వి తట్ట మోసి మురుగు కాల్వ శుద్ధి చేసి

ఊరి కొరకు సాహసించి ఉరుకు కార్యకర్తల వలె

పాటుబడే వయసు కాదు శక్తి లేదు నాదంతా

చల్లపల్లి స్వచ్చోద్యమ సంప్రోక్షణ! సంకీర్తన!              

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

11.08.2021.