2205* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

ఉన్న ఊరి స్వస్తత భద్రతల నిర్వహణలో 2205* వ నాడు.

 

గురువారం (12.8.2021) నాటి వేకువ 4.22 కు 14 మంది, కొన్ని నిముషాల వ్యవధిలో మరో 10 మంది కార్యకర్తల గ్రామ కశ్మల రణరంగం బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్లే గత రెండు వారాలుగా వారి చెమటలు చిందుతున్న వంతెన దగ్గర గానే! పరిశుభ్ర స్వచ్ఛ సుందరీకృత భాగం నిడివి 150 గజాలే!

 

కొందరనుకొనేట్లుగా ఇది వేల దినాల నుండి ప్రతి ప్రత్యూష మందునా జరుగుతున్న స్వచ్ఛ యజ్ఞమే కావచ్చు గాని, నా బోటి వాళ్లకిది నిత్య నూతనమూ అద్భుతావహమూ! చల్లని మలయ పవనం గాని, వెచ్చని సూర్యోదయం గాని ఎన్నాళ్లు చూసినా, అనుభవించినా ఎవరికైనా విసుగు కలుగుతుందా? ఒక మహత్తర కర్తవ్యాన్ని భుజాల కెత్తుకొని ఆ లక్ష్య సాధనకు ఒక్కో అడుగు స్థిరంగా ముందుకు కదులుతున్న స్వచ్ఛ కార్యకర్తల అనుభూతి కూడ ఇదే కావచ్చు! లేకుంటే గ్రామమంతా ఫ్యాన్ల, ఏ.సి. ల సుఖ నిద్రాముద్రితమయ్యే ఇంత వేకువలో వాళ్ళ శ్రమదాన మెందుకు?

 

నలుగురైదుగురు తప్ప, ఎక్కువ మంది కార్యకర్తలు ఊరి అస్తవ్యస్తత మీద, అసౌకర్యం మీద పోరాడినది మాత్రం మురుగు కాల్వ దక్షిణపు గట్టు మీదనే. భారీగా పెరిగి, చిక్కుపడిన ఒక పురుగుడు చెట్టు, అడ్డదిడ్డంగా పంగలు చాస్తున్న ఒక టేకు చెట్టు, ఇంకా ఇతర ముళ్ళ మొక్కలు తీగలు, గడ్డి, ఎండు మొక్కలు వంటి వన్నీ ఇప్పుడదృశ్యమై పోయినవి. ఇవి గాక కాలువ నీటి వైపుగా పెరిగిన ఇంకో పెద్ద చెట్టును సుందరీకరించడానికి మాత్రం ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. గంటకు పైగా ఈ 100 గజాల కాల్వ గట్టును సంతృప్తికరంగా శుభ్రపరచిన మహాశయులందరికీ జోహారులు!

 

నేటి వేకువ స్వచ్ఛ ప్రయత్నంలో ఒక అపశ్రుతేమంటే ఒక విశ్రాంత ఉద్యోగి, కత్తితో మొక్క నరుకుతుండగా అదికాస్తా కాలికి తగిలి రక్తస్రావమై ఆస్పత్రికి వెళ్ళ వలసి రావడం.

 

కార్యకర్తల శ్రమ మాటకేం గాని, 6.30 తర్వాత వంతెన మీద నిలబడి శుభ్రపడినంత మేర కాల్వ గట్లను ఒక్కసారి చూస్తే ఎంత బాగున్నదో గమనించండి. సదరు కార్యకారకుల కాదృశ్యం ఎంతగా సంతృప్తిదాయకమో, ఊహించండి. ఈ గట్టు కిలోమీటరు బారునా రేపో మాపోనాటబోయే మొక్కలు పెరిగితే ఆ విరుల అందాలు, చెట్ల శ్యామల వర్ణాలూ ఏ స్థాయిలో ఉంటాయో మనో నేత్రాలతో చూసి, అభినందించండి!

 

            కాఫీల తరువాత – 6.20 సమయంలో కార్యకర్తల ఆశయాలను మూడు మార్లు గట్టిగా నినదించింది అంజయ్య గారైతే నేటి పని తనాన్ని సమీక్షించిందీ, అభినందించినదీ డాక్టర్ డి.ఆర్.కె. గారు.

 

            రేపటి మన స్వచ్చతా ప్రయత్నం కూడ గంగులవారిపాలెం దారి వంతెన నుండి కాలువ దక్షిణపు గట్టు మీదనే.

 

         వ్రాయలను కొంటున్నా

 

ఇంటి పెరటి పరిసరాల వంట ఇంటి వ్యర్ధాలను

తడి పొడిగా అందించి డంపింగుకు పంపించి

మరల వాడుకొనే రీతి ఎరువులుగా మార్చు ఖ్యాతి

గ్రామంలో నెలకొలిపే ప్రయత్నాలు సాగాయని...

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

12.08.2021.