2206* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

స్వచ్ఛశీల గ్రామ రూపకల్పనలో 2206* వ నాడు.

 

శుక్రవారం (13.8.2021) నాటి కార్యకర్తల పారిశుధ్య కృషి సైతం గంగులవారిపాలెం వంతెన నుండి బండ్రేవు కోడు కాల్వ దక్షిణపు గట్టే ప్రధాన లక్ష్యంగా సాగింది. వేకువ 4.19 కే చిట్టి చిట్టి వాన చినుకుల నడుమ ప్రయాణ యోగ్యం గాను, దర్శన యోగ్యం గాను తీర్చిదిద్దారు. సుమారు 2 గంటలు – 6.12 నిముషాల దాక వారి ప్రయత్నం విజయవంతమయింది.

 

అత్యవసర స్థితిలోనే – పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఈ బాట మీద నడుస్తారు. అందుకనుగుణంగా – పొలం రైతులు ఏర్పరుచుకొన్న ఈ కాలిబాట ఇక ఇప్పుడు – కార్యకర్తల గట్టి ప్రయత్నంలో మరికాస్త విశాలం గాను, శుభ్రం గాను మారిపోయింది. నాలుగైదు రోజుల పిదప స్వచ్ఛ సైన్యం – పంచాయితీల సంయుక్త కృషితో పూల – పండ్ల మొక్కలు నాటాక, అవి పెరిగి ప్రదర్శించే సోయగాలతో ఇంకెంత రమణీయంగా ఉండబోతుందో చూద్దాం!

 

ఎప్పటి లాగానే నేటి వేకువ కూడ స్వచ్ఛ కార్యకర్తలది  పట్టు సడలని స్వచ్ఛ దీక్షే! గడ్డిని, పచ్చి – ఎండు పిచ్చి ముళ్ళ మొక్కల్ని, మొండి జాతి పులుగుడు చెట్లనీ, తీగల్నీ ఎంత మెలకువగా, ఒడుపుగా వీళ్ళు తొలగిస్తారో అందరూ స్వయంగా వచ్చి – చూసి – పాల్గొని గాని, సామాజిక మాధ్యమంలో గ్రహించి గాని, అభినందించ వచ్చునే! మరింతగా గ్రామస్తులు వచ్చి కలిస్తే – వాళ్ళకు సైతం ఆనందం , ఆరోగ్యం ప్రాప్తించకపోదే!

 

పంచ కార్యకర్తల సుందరీకరణ బృందం ఈ వంతెనకు దూరంగా – చల్లపల్లి ప్రధాన డ్రైనేజి దగ్గర తనపని తాను చేసుకు పోయింది. అక్కడి మురుగు సిల్టును పంచాయితి వారు తోడగా – ఎండిపోగా – దానిని ఎక్కడ ఎలా సర్దాలో, ఏ చెట్ల కొమ్మల్ని ఎందాక ట్రిమ్ చేయాలో సర్ది, కత్తిరించి, కాస్త ఆలస్యంగా మరల వంతెన దగ్గరకు చేరుకున్నారు.

 

గత రెండు మూడు వారాలుగా ప్రయత్నించిన గంగులవారిపాలెం మార్గం శుభ్ర – సుందరీకరణం నేటి కొక కొలిక్కి వచ్చినట్లే – కాకపోతే వంతెన నుండి నూకలవారిపాలెం దిశగా కాలువ గట్టు గాని, చల్లపల్లి దిశగా సదరు కాల్వ అద్దరి – ఇద్దరి గట్ల అందాలకు మెరుగులు దిద్దే పని గాని తలపెడితే – ఇంకొకటి రెండు దినాలు పట్టవచ్చు.

 

తాతినేని (నర్సరీ) రమణ గారి స్వచ్ఛ – శుభ్ర – సుందర గ్రామ దీక్షా సంకల్ప నినాదాల పిదప, సమీక్షా విధి తర్వాత నేటి మన బాధ్యతలకు స్వస్తి.

 

రేపటి వేకువ సైతం మన కలయిక బండ్రేవు కోడు కాలువ వంతెన దగ్గరే!

 

           ప్రకటిస్తే బాగుండును

 

మహామహులు మరణిస్తూ పట్టుకెళ్ళలే దేదని...

పొరుగు వారి మేలు కొరకె పూర్తి బ్రతుకు గడిపారని...

చల్లపల్లి స్వచ్చోద్యమ చర్యలట్టివే ననుచూ...

స్వచ్చోద్యమ సంబరాలు చాటెనిదే చూడుమనుచు...

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

13.08.2021.