2207* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

స్వచ్చోద్యమ కారుల 2207* వ నాటి ఆహ్లాదకర పోకడలు.

ఆదివారపు (15.08.2021) 75 వ స్వాతంత్ర్యదినోత్సవ వేకువ జాములో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల పనివేళ 4.23-6.15 నడిమి సమయం. మన సామాజిక మాధ్యమ తొలి చిత్రంలోని 12 మంది కాక, మరి 16 మంది కూడ(మొత్తం 28 మంది) కలిసి చేసిన పరిశుభ్ర-సుందరీకరణం మాత్రం-ఒకటీ, రెండూ కాదు-మూడు చోట్ల! బండ్రేవుకోడు కాల్వ వంతెన, భవఘ్ని నగర్, మూడోది ఆటోనగర్.

 

            ఇందులో 22 మంది వంతెన తూర్పు దిశగా మురుగు కాల్వ గట్ల మీది చిందర వందర పిచ్చి మొక్కల వికృతం మీద, కాలి బాటల కడ్డు పడుతున్న గడ్డి మీద, అన్ని చెత్తా-చెదారాల మీద, అక్కడక్కడ బాట మీద పడిఉన్న ఎండు ముళ్ల కొమ్మల మీద, ఖాళీ మద్యం పాకెట్ల-సీసాల మీద, వందల కొద్దీ తాటి కాయల మీద, ఇంకా ప్లాస్టిక్ సంచులు-ఇతర తుక్కుల మీద పెద్ద యుద్ధమే చేయవలసి వచ్చింది- అది కూడ నిన్న, ఈ రాత్రి తగు మాత్రంగా పడిన వర్షం వల్ల బురదగా మారిన ప్రదేశాలలో!

 

            నేల మీదనే కూర్చొనీ, బురద- నీళ్లున్న చోట వంగొనీ కత్తులతో, గొడ్డలితో, దంతెలతో, పారలతో జరిగిన కొన్ని విన్యాసాలు చూసి తీరాలి. ఇక్కడి కుడి గట్టు 100 కు పైగాను, ఎడమ (ఉత్తరపు)గట్టు 50 కి పైగాను గజాల దాక ఇప్పుడు ఎవరు వెళ్లి పరిశీలించినా- ప్రతి ఊరిలోను, స్వచ్చోద్యమ మెందుకు అవసరమో తెలిసి పోతుంది! అక్కడ అందంగా శుభ్రంగా మారిన బాటలు, ట్రిమ్ చేశాక మళ్లీ మళ్లీ చూడాలనిపించే తాడి చెట్లూ-ఎవరికైనా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల ప్రత్యేకత ఏమిటో-నిస్వార్ధ శ్రమ జీవన సౌందర్య మంటే ఏదో చక్కగా వివరిస్తాయి!

 

            ఎందుకో గాని, గ్రామస్తుల్లో చాలామంది ఈ శుభోదయ స్వచ్చ కృషిలో పాల్గొనక –కనీసం వచ్చి చూడని అలవాటులో నే ఉన్నారు. అలాంటివారు దయచేసి, ఈ వేకువ సమయం 2 గంటల పాటు భవఘ్ని నగర్-గంగులవారిపాలెం దారిలో ఎండు మురుగు మట్టితో రోడ్డు ను విశాల పరుస్తున్న, పూల మొక్కల్ని మరింత అందగిస్తున్న ఐదుగురి సుందరీకరణ చర్యల్ని వాట్సాప్ లోనైనా వీక్షించండి. (ఒక చెట్టుకు చుట్టుకొని, దీక్షగా వీరి గ్రామ మెరుగుదల కృషిని గమనిస్తున్న ఒక సర్పాన్నీ, సంఘీభావం చూపుతున్న కాలభైరవుడినీ – కనిపిస్తే చూడండి).

 

            డాక్టర్ దంపతులు ఆటోనగర్ లో పంచాయతీ వారి 350 మొక్కల ప్రతిష్టాపనలో పాల్గొనగా-6.30 సమయంలో కోట పద్మావతీ ప్రకటిత గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సాధనా ప్రతిజ్ఞతో నేటి గ్రామ బాధ్యతా నిర్వహణం ముగిసింది.

 

            18.08.2021(బుధవారం) నాటి/ లేదా అవసరార్ధం మంగళవారం నాటి వేకువ మన పునరాగమ నిర్దేశిత స్థలం – ఈ మురుగు కాలువ వంతేనే!

 

           అది వినా మరొకటేదీ.    

స్వచ్చోద్యమ సంరంభమె సముచితమని-సాహసమని

స్వచ్చోద్యమ సారధ్యం సక్రమమని-సార్ధకమని

అది వినా భవితకు ఆస్కారం లేనే లేదని

ఎన్ని మార్లు –ఎక్కడైన-ఇట్లే ప్రకటిస్తామని...  

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.08.2021.