2208* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

ఆదర్శ గ్రామ నిర్మాణంలో 2208* వ నాడు.

           

            గురువారం (19.08.2021) నాటి బ్రహ్మ ముహూర్త (4.20 Am) సమయంలో గంగులవారిపాలెం దగ్గరి మురుగు కాల్వ వంతెన దగ్గరకు చేరుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు 10 మంది, ఇంకొద్ది నిముషాల్లో వానలోనే తడుస్తూ వచ్చి కలిసిన 8 మంది. ఈ ఆష్టాదశ స్వచ్చంద శ్రమకారుల స్వయం నిర్దేశిత కార్యం – వంతెనకు తూర్పు అభిముఖంగా బండ్రేవు కోడు మురుగు కాలువ కుడి (దక్షిణ) గట్టు మీద మొక్కలు నాటడం!

 

            ఒకరిద్దరు అక్కడి రైతులు, కూలీలు కాక ఈ గట్టు మీద రాకపోకలు  జరిపే వారుండరనుకొంటా. అందుకే అది పేరుకు బాటే గాని ఎన్నెన్నో పనికి రాని పిచ్చి – ముళ్ళ మొక్కలు, తుప్పలు, తీగలు పెరిగి పోయిన దారి. ఆ చీకట్లో – చినుకుల్లోనే మొక్కల పాదులు తీసే ముందుగా బాటను సుగమం చేస్తూ కార్యకర్తలు గంటకు పైగా పెనుగులాడారు. అందులో 10 గజాల మేరైతే ఎండి, వాడిన పులుగుడు కంపతో వికారంగా ఉన్నందున – ఆరేడుగురు అతికష్టమ్మీద తొలగించి, దారిని విశాలపరిచారు.

 

            అరకిలోమీటరు కాల్వ గట్టు దారి మీద ఎర్ర తురాయిమొక్కల్ని నాటారు. అంతేనా వంతెన నుండి దక్షిణాభి ముఖంగా ఎడమ ప్రక్కన అడవి తంగేడు మొక్కలు (గద్ద గోరు)’ కూడా ఈరోజే కొలువు తీరినవి. తుంపర చినుకుల చిందుల నడుమనే ఈ నాటి వీరి శ్రమ మాటకేం గాని, కొన్ని మాసాల వ్యవధిలో అవి పెరిగి, పూలు పూసినప్పుడు – బహుశా వసంత మాసం నాటికి ఈ మూడు బాటల ముక్కోణ దృశ్యం వాహ్యాళి జరిపే పాదచారులకు, బైపాస్ మార్గ ప్రయాణికులకు, గ్రామ చివరి వార్డు ప్రజలకు, రైతులకు ఎంత ఆహ్లాదకరంగా మారుతుందో చూసి తీరాలి!

 

            “అందమె ఆనందం – ఆనందమె జీవన మకరందం ...” అని (బ్రతుకు తెరువు సినిమా) గీతం రాసిన జూనియర్ సముద్రాల, పాడిన ఘంటసాల గుర్తుకు వస్తారేమో!

 

            6.20 సమయాన – కాఫీ కబుర్ల సరదా వేళ DRK గారు నిర్వహించిన నేటి శ్రమదాన సమీక్షకు ముందు మండవ బాలవర్ధనుడు ముమ్మారు ఎలుగెత్తిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలూ, స్వచ్చోద్యమ కారుల సుదీర్ఘ గ్రామ బాధ్యతా స్వీకరణ పట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలూ కార్యకర్తల మన్ననలు పొందాయి.

 

ఇదే కాలువ గట్టు దక్షిణ దిక్కున – వంతెనకు తూర్పు – పడమర దిక్కుల్లో మరిన్ని మొక్కలు నాటే కర్తవ్యం కోసం రేపు వేకువ ఈ వంతెన దగ్గరే మనం కలువ వలసి ఉన్నది.

 

           భారతంతో కొత్త పోలిక

ధర్మ స్థాపన కోసం కదనరంగ చరితం అది

స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యం సాధనకై ప్రయత్న మిది

వీర గాధలే రెండూ – వేరే ఉభయుల గమ్యం

ఏదతి రస వత్తరమో – ఏది ప్రయోజన కరమో!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

19.08.2021.