2209* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

 2209* వ నాటి గ్రామ సామాజిక పాఠం.

           

            ఈ శ్రావణ శుక్రవారం (20.08.2021) వరలక్ష్మీ వ్రత పర్వదినాన బ్రహ్మీ శుభ ముహూర్తాన 4.21 కే సన్నద్ధులైన వారు 13 మంది కాగా, 4.30 లోపు మరో పది మంది వెరశి 23 మంది ఈ పండుగను మరో విధంగా సార్ధకం చేశారు! (ఔను మరి - నాయింట్లో వ్రతమనేది నా పండుగ; మురుగు కాల్వ గట్ల మీద, గంగులవారిపాలెం రాదారి పైన నిర్వహించిన స్వచ్ఛ హరిత పరిశుభ్ర సుందరీకరణం నా ఊరి కంతటికీ పండుగే!) ఈ క్రొత్త తరహా పండుగ కాలవ్యవధి 2 గంటలే కావచ్చు పవిత్రీ కరించినది 34 వందల గజాల మేరకే కావచ్చు గాని, ఈ స్వగ్రామ మెరుగుదల దీక్షాపరుల కదొక నిత్య నూతన దివ్యానుభవమే సుమా!

 

ఉత్తమ కవి త్వాను భూతిని నిర్వచిస్తూ మహాకవి శ్రీశ్రీ

 

సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం

అమోఘ, మగాధ, మచింత్య, మమేయం

క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం...

(మహాప్రస్థానంలో కవితా! ఓ కవితా! గేయం) అని పరవశించాడు!

 

            అలా కానప్పుడు ఈ స్వచ్చోద్యమ కారులు ఇంత చీకటిలో బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్ల బురదలో ఇంత ఏకాగ్రతతో ఎర్రతురాయి, అడవి తంగేడు పూల మొక్కల్ని ఎందుకు నాటాలి? జన సంచారాని కడ్డుపడుతున్న ఎండు పచ్చి ముళ్ళ పిచ్చి మొక్కల్ని ఇంత కష్టపడి నరికి, గొర్రులతో లాగి, ఆ కాలి బాటను స్వచ్ఛ శుభ్ర విశాలంగా మార్చడమెందుకు? వ్యక్తిత్వ సంకుచిత పోకడల్ని అదుపు చేసి, ఊరి కొరకు శ్రమించే ఈ తత్త్వమే అత్యాధునిక సమాజానికొక అత్త్యుత్తమ పాఠం కాదా?

 

            నిన్నటి ముందస్తు ప్రణాళిక నమలు చేస్తూ వంతెనకు పడమర ఎడమ గట్టు మీద 20 అడుగులకొకటిగా ఎర్ర తురాయి మొక్కలూ, వాటి నడుమ ఒక్కో గద్ద గోరుమొక్కనూ నాటి, ఎత్తు పల్లాల కనుగుణంగా పాదులు తీయడంతో బాటు వంతెనకు తూర్పున ఉభయ దరుల్లో కూడ కొలతలు వేసి, మొక్కలు పెట్టారు.

 

            పురుగుల్లో కూడ సౌందర్యాన్ని అన్వేషించే వాళ్ళు కవులైతే అనాకారి , భీభత్స పరిసరాన్ని సైతం సౌందర్యమయం చేయగల సుందరీకరణ బృందమొకటి చల్లపల్లిలో పని చేస్తున్నది. వారి చేష్టలతో ఈ రహదారికి చెందిన మరిన్ని చెట్లు, పరిసరాలు పునర్నవీకరణ పొందాయి!

 

            6.25 తరువాత కార్యకర్తల నేటి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినాదాలుగా ప్రకటించి, శ్రమదాతలందరికీ తన జన్మదిన మిఠాయిల్ని పంచి మనకోసం మనంట్రస్టుకు వెయ్యి రూపాయాల్ని సమర్పించినది దేసు మాధురి. నేటి మన శ్రమను మెచ్చి, రేపటి ప్రణాళికను ప్రకటించినది డాక్టరు DRK.

 

            తరువాయి శుభ్ర సుందరీకరణ కోసం రేపటి వేకువ మన కలయిక ఈ మురుగు కాలువ వంతెన దగ్గరే!

 

   (సామాజిక) సర్వ రోగ నివారణంబని.

ఇదొక అతిలోకోద్యమంబని సర్వరోగ నివారణంబని

జబ్బచరచి వచింపకున్నా కనీస మానవ బాధ్యతిదియని

నమ్మి నడిచే కార్యకర్త నిరంతరోద్యమ పధం చూపిన

అందరికి సుమచందనమ్ములు హృదయ పూర్వక ప్రణామంబులు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

20.08.2021.