2214* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!

 

ఉద్యమాల చల్లపల్లికి ఉచిత శ్రమ సంకేతాల @2214* రోజులు.

 

            28 వ తేదీ (ఆగస్టు మాసం శనివారం) వేకువ వేళ - పదిమందికైతే మరీ 4.20 కే  స్వచ్ఛ సుందర శుభోదయమైపోయింది ఐదారు వారాల క్రితం గంగులవారిపాలెం బాటలో ఎక్కడ తమ స్వచ్ఛ దీక్షను ప్రారంభించారో అక్కడే సన్ ఫ్లవర్ కాలనీ బాట కూడలిలోనే నేటి పరిశుభ్ర సుందరోద్యోగం మొదలై, మొత్తం పాతిక మంది సదవగాహనా కృషితో అక్కడికి ఉత్తర దక్షిణ దిశల రోడ్లు మరొక మారు మరింత శోభస్కరంగాను, కంటి కింపు గాను కనిపిస్తున్నవి.

 

            మరి ఇది పాతిక మంది గ్రామ స్వస్త కంకణధారుల 40 కి పైగా పని గంటల కృషి! ప్రతి ఫలాపేక్షలేని ఉదాత్త ఉదాహరణ యోగ్య చర్య! 2214* దినాలుగా రెండు లక్షల పైగా పని గంటల బహుశా ఇంకెక్కడా ప్రస్తుత కాలంలో కనని వినని వినూతన పోకడ గదా! ఏ మూడున్నరకో బ్రహ్మముహూర్తానికి ముందే నిద్ర లేచి, 4.30 కు ముందే నిర్దేశిత స్థలం చేరుకొని, చేతులకు రక్షణగా చేతొడుగులతో తలలకు తగిలించుకున్న దీపకాంతితో కత్తులు, గొర్రులు, చీపుళ్ళతో గ్రామ వీధుల్ని ఊడ్చి, అందగించే అద్భుత కార్యక్రమం దాని వైచిత్రి ఇలాగే ఉంటుంది మరి!

 

            పని ముగింపు వేళ – 6.15 సమయంలో స్వచ్ఛ కార్యకర్తల్ని పరిశీలిస్తే చెమట పట్టని వారు, బట్టలకు మురికి, బురద మరకలు లేని వారు తాము నిత్యం చేస్తున్నవి దండగ మారి పనులను కొనేవాళ్ళు, ‘ఇన్నాళ్ళు ఇన్నేళ్ళుగా పాటుబడ్డాం ఇక చాల్లేఅనుకొనే వాళ్ళు. ఏ కాస్తయినా అసంతృప్తి మనస్కులూ, ఇళ్ళ ఎదుటి రోడ్లు శుభ్రపరచని గృహస్తుల్ని నిందించే కార్యకర్తలూ కనిపించలేదు బహుశా ఇదే స్వచ్చోద్యమ పరిపక్వత, సాఫల్యత కావచ్చు! ఈ నాటి వేకువ పని వివరాల కొస్తే:

 

- ధృఢకాయులైన ఇద్దరు కార్యకర్తలు గంటన్నర పాటు శ్రమించి, 17 ఏళ్ల నాటి పొగడ చెట్ల కొమ్మ రెమ్మల్ని, కోనో కార్పస్ చెట్టునీ కత్తిరించి, అందంగా అంటుక్రాపు వేశారు.

 

- కొద్ది రోజులో, గంటలో క్రితం బాట ప్రక్కన పడి ఉన్న ఎండు కొమ్మల్ని, కొద్ది మొత్తం చెత్తా చెదారాన్ని, అక్కడక్కడ తలెత్తుకున్న గడ్డి దుబ్బుల్నీ, 10 – 12 మంది కత్తిముఠా దంతెలతో లాగి, ట్రాక్టర్ లోకి ఎగుమతి చేశారు.

 

- ఎత్తైన ట్రక్కులో ఎత్తైన తుక్కు మీద నిలిచి, సర్దుతున్న ఇద్దరు ముఖ్యుల్ని వాట్సాప్ చిత్రంలో గమనించండి.

 

- ముగ్గురు చీపుళ్ళ వారికి నేటి పని వేళంతా రోడ్డు ఊడ్వడమే సరిపోయింది!

 

            ఈ విధంగా – 100 నిముషాల పాటు పాతిక వేల మంది గ్రామస్తుల కోసం కనీసం పాతిక మంది కార్యకర్తలు సాధించినదేమంటే ఒక పెద్ద ట్రక్కు నిండా ఊరి వ్యర్ధాలు, ఏ రెండు మూడు వందల గజాల మేరకో వీధి స్వచ్ఛ శుభ్రతలు! లబ్దిపొందిన దేమనగా ఈ రోజు మొత్తానికి సరిపడా సంతృప్తి, సంతోషం!

 

            6.30 కు సమీక్షా సమావేశానికి ముందు గ్రామ శుభ్ర స్వచ్ఛ సౌందర్యాల ఆరాటాన్ని ముమ్మారు కాదు ఆరుమార్లు నినాదాలుగా ప్రకటించిన యువ ఉద్యోగి మారుతీ ప్రసాదు.

 

రేపటి వేకువ కూడా మన ఊరి మెరుగుదల బాధ్యత కోసం ఈ గంగులవారిపాలెం దారిలోనే కలుసుకొందాం!

 

            సంఘం శరణం గచ్ఛామి

 

సంఘం ధర్మం జ్ఞానం శరణం గచ్ఛామిఅనుచు

ఏనాడో వాక్రుచ్చెను సిద్ధార్ధుడు గౌతముడు

ఏ కాలం ఏ దేశం ఏ సమాజముల కైనా

అది నిజమని ఋజువు చేసే స్వచ్చోద్యమ సైనికుడు!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

28.08.2021.