2216* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

2216* వ నాటి వర్షోద్యమ చల్లపల్లిలో – స్వచ్చోద్యమ చల్లపల్లి.

 

కరోనా కారణంగానేమో – ప్రతి సోమవారం సెలవు పాటిస్తున్న స్వచ్ఛ – సుందర ఉద్యమం ఈ సోమవారం (30.08.2021) వేకువ సమయంలో ఆ సెలవును రద్దు చేసి, అవనిగడ్డ మార్గంలో – స్వచ్ఛ – సుందర టాయిలెట్ల దగ్గర ఆగి, వీధి కశ్మలాల నిర్మూలనకు పూనుకొన్నది.

 

ఎడతెగని వర్షం, ఉరుముల – మెరుపుల మధ్య 14 మంది కార్యకర్తలు పాగోలు రోడ్డు నుండి టాయిలెట్ల తుది వరకు – కుడి ఎడమల కాలుష్యాలెన్ని తొలగించారో గ్రామస్తులు గమనింతురు గాక!

 

వారానికొక్క రోజు – ఒక్క గంటైనా తమ వీధిని, తమ ఇంటి పరిసరాలను, తమ గ్రామ మెరుగుదలను పట్టించుకోక, ప్రయత్నించక, స్వచ్ఛ కార్యకర్తలకు సహకరించక, కూడి రాని స్థానిక గ్రామ సోదరులు 3 విధాలుగా ఈ ఉద్యమానికి తోడ్పడగలరు – 1) వీధిలో నిర్లక్ష్యంగా చెత్త విసరకుండడం ద్వారా, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సీసాలు వదలకుండడం ద్వారాను 2) ఈ జాతీయ రహదారి మీద గొడ్లను కట్టివేయకుండా, మట్టి – ఇసుక – కంకర, కసవు దిబ్బలు పెట్టకుండడం ద్వారాను! మూడవది – గ్రామపౌరులు కొందరు ఈ కార్యకర్తల్నీ, ఉద్యమాన్ని గౌరవించకపోతేపోయిరి – సానుభూతితో, సానుకూలంగా అర్ధం చేసుకొని, పరోక్షంగా సహకరించినా చాలు.

 

ఈ దినం కార్యకర్తల సంఖ్య కొంత తగ్గింది గాని, దీక్ష – స్ఫూర్తి – పని నాణ్యత, అంకితభావం ఏ మాత్రం తగ్గలేదు. చీకట్లో – ఎడతెగని వర్షం కలిగించే చికాకుతో ఏ ఒక్కరూ ప్రక్క ఇళ్ల వసారాల్లో దాక్కోలేదు. పెదప్రోలు దిశగా టాయిలెట్ల ప్రాంతంలో రంగురాళ్ళ మీద మట్టిని గోకి, ఎత్తడంలో గాని, ఎడమ వైపు పిచ్చి – ముళ్ళ మొక్కల్ని నరికి, పీకి, పోగులు చేసే పనిలో గాని, అక్కడే ఉన్న పెద్ద గోడౌను ఆవరణను శుభ్రపరిచే కృషిలో గాని - ఏ లోటు జరగలేదు! మురుగు కాలువ నీటి కదలికనడ్డుకొంటున్న చెత్తను, సిల్టును పట్టుదలగా లాగుతున్న కార్యకర్తల్ని ఫొటోలలో గమనించారా?

 

గమనిస్తే శ్రేయోభాలాషులు దయచేసి “అయ్యో! ఇంతమంది మర్యాదస్తులకెందుకీ దిక్కుమాలిన చెత్త పనులు? ఇన్ని వేల రోజులు? ఎంతగా పాటుబడినా ఈ ఊరి వాళ్ళు మారతారా?...” అని జాలి పడవద్దు.

 

“దేశమంటే మనుషులోయ్..” అని ఒక మహాకవి చెప్పినట్లు “గ్రామమంటే గ్రామస్తులోయ్ – మనమే నోయ్” అని గుర్తు చేసుకొని, పునః పరిశీలించుకొని, ఏ కొందరైనా – ఏ మేరకయినా రేపటి నుండి కలిసి రావాలి!

 

ఈ వర్షోదయ 6.30 సమయంలో కార్యకర్తల నిబద్ధతను, దీక్షను ముమ్మారు స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాద రూపంలో ప్రకటించిన వారు ఆకుల దుర్గాప్రసాదు గారు.

 

వర్షం వచ్చినా – రాకున్నా రేపటి వేకువ మన గ్రామ బాధ్యతా నిర్వహణ స్వచ్ఛ – సుందర టాయిలెట్ల వద్దనే! (నాగాయలంక మార్గంలో.)

 

           అనుసరింపుము అడుగుజాడలు  

సకల గ్రామం అడుగడుగునా స్వచ్ఛ – సుందర శుభ్రశోభలు

ఎవరివో ఈ వీధి శుభ్రత లెవరివో ఈ స్వచ్ఛ దీప్తులు

ఏడేళ్ళ క్రిందటి గ్రామ దుస్థితి ఇంతలోనే మరువ బోకుము

అనుకరింపుము – అనుసరింపుము స్వచ్ఛ సైన్యం అడుగుజాడలు!   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

30.08.2021.