2222* వ రోజు ....

ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

స్వచ్చోద్యమ పని దినాల విశేష సంఖ్య నేటికి 2–2–2–2 *

 

        05.09.2021 - ఆదివారం (ఉపాధ్యాయ దినోత్సవ) వేకువ 4.27 సమయంలో, నాగాయలంక మార్గంలో, బళ్ల సుబ్రహ్మణ్యం ఉరఫ్ బళ్ల నాగన్న ఆశ్రమం ఎదుట వీధి కాలుష్యాల మీద కాలుదువ్వబోతున్న 17 మంది కార్యకర్తల్ని వాట్సాప్ లో గుర్తించండి. 100 ఏళ్ళు నాడు పరాయి పాలన మీద అప్పటి దేశ భక్తులిలాగే తిరగబడ్డ ఉదంతాన్ని కూడ నెమరువేసుకోండి! అప్పటిది స్వాతంత్ర్యం కోసం యుద్ధమైతే – ఈ స్వచ్ఛ వీరులది తమ గ్రామ సౌకర్య – ఆరోగ్య – ఆనందాల కోసం సాగిస్తున్న సుదీర్ఘ సమరం!

 

నేటి దాని పరిధి ఆశ్రమం నుండి హిమాలయ – ఐస్ పరిశ్రమ దాక. విజేతలేమో 39 మంది! విజితులైతే బండెడు పిచ్చి మొక్కలు – ప్లాస్టిక్ తుక్కులు – మాదక సరుకుల ఖాళీ సీసాలు! పొందిన ప్రతిఫలమైతే – ఇందరు తాత్విక సంపన్నులతో అనిర్వచనీయ పరస్పర సహవాసం, సహ కార్యాచరణం, సమ్యక్ జీవన ఆదర్శం!

 

        ఈ రహదారి అదృష్టమేమో గాని – ఇందరు కార్యకర్తల శ్రమదానం ఇప్పటికి ఏ 10 మారులో దక్కించుకొన్నది. గోదావరి జిల్లా గొల్లప్రోలు నుండి – అతిధి శ్రమదాతలు, ఏలూరి దగ్గర నుండి అక్కిన భవాని, ముంబాయి నుండి మహాత్మా గాంధి మునిమనుడు ఆనంద్ గోకనీ వంటి ఎందరి మాటలు, చేతలనో విన్నది. ఆ కారణంగానేమో – చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల చేతుల్లో బడి – ఇంత సుదీర్ఘ కాలంగా – ఇంత కన్నుల పండుగగా – ప్రయాణికుల దృష్టిని వాళ్లకు తెలియకుండానే ఆకర్షించేంతగా – గంటలకొద్దీ ఇక్కడ తిరిగి, గడప దగినంత అద్భుత సుమసుందరంగా మారిపోయింది!

 

         నేటి కార్యకర్తల కృషిని చెప్పేదేముంది? సుందరీకర్తలు, కత్తి యోధులు, దంతె ధారులు, చీపుళ్ళ యువతులు, కావలసిన వందించే వృద్ధులు, ఇక్కడికిక్కడే ఇందరు స్వచ్చంద శ్రమ ప్రయోక్తల సమక్షంలో జన్మదిన వేడుకల ఆనందాన్ని అన్వేషించుకొనే కుటుంబాలు, తుక్కు లోడింగ్ నిపుణులు, ఛాయాగ్రాహకులు ... ఎవరి పాత్ర తక్కువని? ఈ స్వచ్చోద్యమ సంరంభంలో ఎవరి వంతు ఎక్కువని!

 

         గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్యాల లక్ష్యం అందరిదీ ఒకటే గాని, ఒకొక్కరి శైలి, శక్తి, పనితీరు ఒక్కో విధంగా ఉంటుంది. అలా, ఎవరి ఎవరి ప్రయత్నం వాళ్లు చేసిన ఈ శుభోదయాన - ఆశ్రమం నుండి కాసా నగర్ దిశగా - ముఖ్యంగా జాతీయ రహదారి ఉత్తరంగా అనుకొన్నంత దూరం క్షుణ్ణంగా - స్పటికంగా మార్చగలిగారు.

 

         6.40 సమయంలో ఆశ్రమం నూతి ప్రక్కన జాతిపిత వారసుడొకప్పుడు నిలిచి, స్వచ్చోద్యమాన్ని ప్రశంసించిన చోట జరిగిన సమీక్షా సమావేశంలో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి రాయపాటి రాధాకృష్ణ త్రిగుణాత్మకంగా గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలు ప్రకటించగా, కార్యకర్తల కృషినభినందించి, సమావేశాన్ని రక్తికట్టించింది డాక్టర్ రామకృష్ణ గారు.

 

         కార్యకర్తల మీద అభిమానంతో ఐదారు తిను బండారాల సవాలు విసిరిన వారు దేసు జాహ్నవి కుటుంబీకులు! 2-2-2-2* మాంత్రిక సంఖ్యకు గుర్తుగా ట్రస్టుకు 2222/- విరాళాన్నిచ్చినది పొరుగూరి మల్లంపాటి ప్రేమానంద్ గారు! పునర్నవోత్సాహం అప్పటికప్పుడు పొంది, 2222/- విరాళ ప్రదాన చెక్కును సమర్పించిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి గారు. 83 ఏళ్ల ప్రాయంలో ఓపికగా వచ్చి – నెల చందా 2000/-సమకూర్చిన ఉద్యమ బాలుడు డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య.

 

         బుధవారం వేకువ మనం కలిసి శ్రమించవలసిన ప్రాంతం ఈ రహదారిలోని అమరవీరుల స్తూపం.

 

        వీళ్ళే రోడ్ల డాక్టర్లై...

 

స్వచ్చోద్యమ చల్లపల్లి కధా వికాస మెట్టిదనిన...

సామాజిక ఋణం తీర్చు సద్భావనతో కొందరు

రోడ్లు విశాలం చేస్తూ గుంట లెన్నొపూడుస్తూ

ప్రమాదాల నివారణకు ప్రయత్నాలొనర్చడం!       

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

05.09.2021.