2223* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

సంఖ్యాపరంగా గ్రామ శ్రమదాన ఉద్యమం 2223* వ నాడు.

 

బుధవారం (08.09.2021) వేకువ అవనిగడ్డ రహదారిలో ఊరికి 1 ½ కిలోమీటర్ల  దూరాన త్యాగదీప్తుల అమరస్తూప సమీపాన – 4.25 బ్రహ్మముహూర్తాన స్వయం నిర్దేశిత స్వచ్చ సౌందర్యాల మెరుగుదలకు వేచియున్నవారు 14 మంది! కొన్ని నిముషాలలో వారితో చేరిన సహ కార్యకర్తలతో మొత్తం 23 మంది చీకటిలోనే తెగబడి, కొంత చల్లపల్లి పరిధిలోను, మిగిలింది పెదప్రోలు పరిధిలోను పట్టి పట్టి, అంగుళమంగుళమూ శుభ్రపరచిన వైనం ఇలా ఉన్నది!

 

హరిత వర్ణం దట్టంగానూ, రంగు రంగుల రకరకాల పూల సోయగాలు అమితంగాను కనిపిస్తున్న దారికి తూర్పు వైపున రెండు బృందాలు, పడమర ప్రక్కన నలుగురైదుగురు సుందరీకర్తలు గంటన్నరకు పైగా శ్రమించడంతో:

 

- ఏడవ నంబరు కాలువకు ఉత్తర దక్షిణాల ఎన్ని పూల మొక్కలున్నవో, అన్నీ వాటి సహజ సౌందర్యాలను మరికాస్త పెంచుకున్నాయి. అవసరమైన కొన్నిటికి కత్తిరింపులు, మరి కొన్నిటికి ఊతాలు, కుదుళ్ల కలుపు తీతలు, పాదుల సవరింపులు యధావిధిగా జరిగిపోయాయి.

 

- ఏడెనిమిది మంది కత్తులు, పారలు, దంతెలు వాడి, పిచ్చి ముళ్ల మొక్కల్ని, గడ్డిని, నరికి కోసి చెక్కి, లాగి గుట్టలుగా చేశారు.

 

- చీపుళ్ళ కార్యకర్తలు దారి మీదను, ప్రక్కలను, మిగిలిన కార్యకర్తల పని ప్రదేశంలోను తమ విధులు తాము చూసుకొన్నారు.

 

- బాట పడమర దిక్కున మరి కొన్ని చెట్ల, పూల మొక్కల ఆకృతుల మెరుగుదలకు ప్రయత్నించిన సుందరీకరణ దళం కృషి విజయవంతమయింది.       

 

            ఐతే మాత్రం ఏమౌతుంది? మరి కొద్ది రోజుల్లో ప్లాస్టిక్ సంచుల్నో, ఎంగిలాకుల్నో, ఏ ఇతర దారిద్ర్యాలనో ఇక్కడ పడేయరని నమ్మకమేమిటి? పూలు చూడగానే ఏదో గుర్తుకొచ్చి, ఏ దేవుడి పేరో చెప్పి, కోయరని హామీ ఏమిటి? మహానాయకుల, మృత బంధువుల, వ్యాపార అవసరాల ఫ్లెక్సీ లు రాత్రికి రాత్రే వెలయవని ఎవరు చెప్పగలరు? స్వచ్చ కార్యకర్తల శ్రమజీవన వేడుకకు, ఊరి శుభ్ర సుందరీకరణల సంతోషాలకు ప్రతిగా నిష్కారణంగా, అనాలోచితంగా ఎందరి విపరీత పోకడలు, ఆక్రమణలు మనం చూడడం లేదు?

 

6.25 సమయంలో పని ముగింపు వేళ, కాఫీ కషాయ సేవనంపిదప చల్లపల్లి ప్రధమ మహిళ, చిరకాల గ్రామ సేవిక పైడిపాముల కృష్ణకుమారి గారి ఊరి మెరుగుదల సంకల్ప నినాదాలను ముమ్మారు పలికి, వీధుల భద్రత కోసం తమ ఆలోచనల్ని వెల్లడించగా డాక్టరు DRK గారు నేటి పని తీరును విశ్లేషించి, అభినందించి, రేపటి కార్యాచరణను నిర్దేశించారు.

 

కనుక రేపటి వేకువతో బాటు మరో నాలుగైదారు రోజులు మనం కలువ వలసిన చోటు ఈ అమరస్తూపం ఎదుటనే!

 

             కశ్మలాలను అశుద్ధాలను...

 

ఎక్కడెక్కడి కశ్మలాలను మారుమూల అశుద్ధాలను

కరుడుగట్టిన స్వార్ధ చర్యను జనం మనసుల సంశయాలను 

తుడిచి పెడుతూ రెండు వేల దినాల నుండీ ఉద్యమించిన

అందరికి శిరసాభివందనల లౌకిక సుమ చందనాదులు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

08.09.2021.