2224* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

కలల సుందర చల్లపల్లి రూప కల్పనలో 2224* దినాలు.

 

ఇంకా ఇది నిశీధ సమయం! 90% శాతం మంది గ్రామస్తులు సుఖ నిద్రా ముద్రితులైన బ్రహ్మ ముహూర్తంలో ఊరికి దూరంగా - 4.19 నిముషాలకు అమరస్తూపం నేపధ్యంగా ఆ అమరు లంతగా కాకున్నా, తమ ఊరి సంక్షేమం కోసం సమయాన్నీ శ్రమను త్యాగం చేయడానికి సిద్ధపడిన 13 – 14 మంది స్వచ్ఛ కార్యకర్తలు! మరో ఎడెనిమిది మంది సైతం వచ్చి కలిసి, అవనిగడ్డ వైపుగా ఉన్న జాతీయ రహదారిలో కొంత భాగాన్ని ఎంతగా శుభ్ర స్వచ్ఛ సుందరంగా మార్చారో ప్రత్యక్షంగా చూసిన అదృష్టం నాది! నా వంటి వాళ్ళ మనస్సులో చిర కాలంగా సమాధానాలు లేని కొన్ని ప్రశ్నలు!

 

* చాల మంది తమ ఇంటినో, పెరడునో, వాకిళ్లనో అదీ పండుగ పబ్బాలకో, లేదా శుభ కార్య సందర్భాలకో మాత్రమే అలంకరించుకొనే విధంగాను, తడి నేలపైన చతికిలబడి కూర్చొనీ, ఒంగొనీ కొడవళ్ళతో గడ్డినీ, గోకుడు పారలతో బాటల దుమ్మునూ ఈ కార్యకర్తలు వేల రోజులుగా తొలగించే శ్రమ ఎలా చేయగల్గుతున్నారు?

 

* ఇంటి బాధ్యతలతో తీరిక లేని గృహిణీ, ఒక సీనియర్ వైద్యురాలూ, ఆస్పత్రి డ్యూటీలో తలమునకలయ్యే నర్సూ ఊరికి దూరంగా ఉన్న రహదారిని పట్టుదలగా చల్లని వేళలోనూ చెమటలు పట్టేలా చేసే దృశ్యం మన ఊళ్లో కాక దేశంలో ఇంకెక్కడైనా చూడగలమా?

 

 సొంత పిల్లల బాగోగులు చూసుకొన్నంత శ్రద్ధగా ఇద్దరు రైతులు పూల మొక్కల్నీ, గతంలో తామే నాటిన చెట్లనీ జాగ్రత్తగా పాదులు సవరించి చుట్టూ కంప చుట్టి పెంచుకొన్నారంటే స్వయంగా చూడని బైట వాళ్ళు ఇది నమ్మే పనేనా?

 

* చెయ్యి తిరిగిన ఒక వైద్య శస్త్రకారుడు చెత్త ట్రాక్టర్ తోలుతూ, వీధి వ్యర్ధాలను సేకరించి, ప్రయాణికులకు ఆహ్లాదం, ఉన్న ఊరికి స్వస్తత చేకూర్చే ప్రయత్నాన్ని గమనించైనా ఈ గ్రామస్తులు కొందరైనా, రోజుకొక గంటైనా శ్రమదానం చెయ్యరా?

 

* తమ కోసం కాక, ఊరి మేలు కోసం 3.30 సమయానికే లేచి, ఇంత దూరం వచ్చి, తమ బుద్ధినీ, సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తున్న విశ్రాంత ఉద్యోగులు గాని, స్వంత కుటుంబాల కోసం తమ నైపుణ్యాన్ని, శ్రమను ప్రదర్శించవలసిన వృత్తి నిపుణులు, ఉద్యోగులు గాని రెండు గంటలు విలువైన సమయాన్ని పరుల కోసం సమర్పిస్తున్న సంగతి కొందరు గ్రామస్తుల్లోనైనా స్ఫూర్తి రగిలిస్తున్నదా? ..... ఇవన్నీ నాలాంటి సందేహజీవుల శంకలే!

           

            కర్మిష్టులైన ఈ 20 కి పైగా స్వచ్చ సైనికులు మాత్రం తాము మంచిదనుకొన్న కార్యక్రమంలో తలమునకలైపోయారు. ఫలితంగా నాగాయలంక రహదారిలో మరి కొంత భాగానికి కాలుష్యాల బెడద నుండి విముక్తి! ఫలితాన్ని సాధించిన వాళ్ళకేమో తాము ఆశించిన సంతృప్తి!

 

            6.25 సమయంలో తన ఊరి స్వచ్చ శుభ్ర సౌందర్యాలకు పూచీపడే దృఢ సంకల్పాన్ని ముమ్మారు హడావుడిగా నినదించినది ఉస్మాన్ షరీఫ్! యధావిధిగా స్వచ్చోద్యమం పట్ల తన అభిమానాన్ని వెల్లడించినది సీనియర్ వైద్యుడు దాసరి రామకృష్ణ! తిరుపతి నేతి లడ్డులను కార్యకర్తలకు తినిపించినది అంజయ్య! ప్రతి వేకువ తన శ్రమను, సమయాన్ని మాత్రమే గాక ప్రతి నెలా తాను స్వచ్చోద్యమానికి సమర్పిస్తున్న 520/- మేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేసినది కోడూరు వేంకటేశ్వరరావు!   

 

రేపటి విఘ్న గణపతి పర్వదిన శుభోదయంలో మన పని ప్రదేశం అమరస్తూపం దగ్గర నుండి!

 

           గ్రామ భవితల శాస్త నీవే!

 

ఎవరి సొంతం కాదు సోదర! ఈ సుదీర్ఘ శ్రమ విరాళం

ఎవరి మేలుకొ  కాదు కాదుర ఈ మహోన్నత సంవిధానం

అనుసరిస్తే ఆదరిస్తే స్వచ్చ సుందర అడుగు జాడలు!

కర్తనీవే భోక్త నీవే! గ్రామ భవితల శాస్త నీవే!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

09.09.2021.