2225* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్చోద్యమ గమనంలో 2225* వ నాడు.

 

విఘ్ననాయకుని గణ చతుర్ధి నాడు (భాద్రపద మాస శుక్రవారం - 10.09.2021) వేకువ 4.23 సమయానికే 14 మంది గ్రామ స్వచ్ఛ విచక్షణా పరులు, కొంచెం సేపట్లో వాళ్ళకు తోడైన 10 మంది 6.12 వేళ దాక అలసట తీరే ఛలోక్తులతో పరస్పర సహకారంతో సమన్వయంతో సత్కార్య సదాచరణను సమర్ధించే నేపధ్య సినీ సంగీతంతో జరిగిన ప్రయత్నం ఫలప్రదమైంది.

 

తనకు ప్రత్యేకంగా నిర్విఘ్న పూజలు స్వచ్ఛ కార్యకర్తలు చేసినా చేయకున్నా సర్వాంతర్యామి ఐన వినాయకుల వారు గ్రామ సౌఖ్యమే తమ సౌఖ్యంగా తలచి నిత్యమూ శ్రమిస్తున్న వీరిని సమర్ధించకపోరు! సెంటిమెంటు ప్రకారం చూసుకొంటే విఘ్నేశ్వర పూజకు ముందే నిరాటంకంగా విజయవంతమైన స్వచ్ఛ సైనికుల గ్రామ సామాజిక పూజకు తదుపరి ఏడాది గణ చతుర్ధి దాక విఘ్నాలు, నీలాప నిందలు రాకుండు గాక! ఇతోధిక గ్రామ యువజన స్వచ్ఛ శ్రమదాన ప్రాప్తిరస్తు!అని అటు విఘ్నాధిపతి, ఇటూ మనమూ చల్లపల్లిని దీవిద్దాం!

 

ఇక ఈ నాటి రహదారి మెరుగుదల కృషి ప్రకారం బెట్టిదనగా :

 

అది ఏడెనిమిదేళ్లుగా నిరంతరాయంగా కొద్దిపాటి మార్పు చేర్పులతో జరుగుతున్న కధే! ఈ నాటి జై స్వచ్ఛ చల్లపల్లివాట్సాప్ (సంగతేమిటి?) చిత్రాలే గాక దృశ్య శ్రవణ (వీడియో) సన్నివేశాలను గూడ పరిశీలించగలరు. ఒక దానిలో దీక్షగా సువర్ణ గన్నేరు పూల చెట్టును సంస్కరిస్తున్న ఇద్దరు మహిళా కార్యకర్తల సుందరీకరణను వీక్షించండి.

 

మరొక దృశ్య శ్రవణ ఘట్టంలో మురుగు కాల్వ మీద అడ్డంగా పెరిగిన ఎత్తైన చెట్టు   కొమ్మల మీద నిలబడి, క్రింది బడుగు మొక్కలకు వెలుతురు, వేడిని అందేలాగా కొమ్మ రెమ్మల్ని నరుకుతున్న 60 ఏళ్ల విశ్రాంత ఉద్యోగి సాహసాన్ని గమనించవచ్చు. ఈ సన్నివేశంలో కొసరాజు రాఘవయ్య గారి పాత సినిమా పాట – (జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురా... కష్టాల కోర్చుకోన్ననే సుఖాలు దక్కునూ ... ఈ లోక మందు సోమరులై బ్రతుక గూడదూ..) అనే పాట భావాన్నెలా సమన్వయించుకోవాలంటే చల్లపల్లి స్వచ్చోద్యమ విజయం తధ్యమనీ, స్వచ్ఛ సైనికులు కష్టాల కోర్చుకొంటేనే గ్రామస్తులకు సుఖాలు దక్కుతాయనీ...!

 

నేల మీద కూర్చొని జరుగుకొంటూ, కొండొకచో మోకాళ్ళు ఆనించి పనిచేసుకొంటూ గడ్డి కోస్తున్న పిచ్చి, ముళ్ళ మొక్కల్ని తొలగించి రాదారికి మెరుగులు దిద్దుతున్న గంటన్నరకు పైగా ఊళ్లో కాదు దూరంగా నాగాయలంక రోడ్డును చీపుళ్ళతో  ఊడుస్తున్న గ్రామ బాధ్యతలను మోస్తున్న కార్యకర్తలందరికీ చవితి పర్వదిన శుభాభివందనలు!

 

6.30 సమయంలో స్వచ్చోద్యమకారుల వెలలేని కృషికి నివాళులర్పించిన డాక్టరు దాసరి రామకృష్ణుల వారు సహృదయ సమీక్షకూ, ఒక్క కార్యకర్తే తనకు తోడువస్తున్నా 712 రోజులుగా మొండికేసుకొని యార్లగడ్డ గ్రామ శుభ్ర సుందరీకరణ కొనసాగిస్తున్న చల్లపల్లి కార్యకర్తల్ని ఆ గ్రామ 2 సంవత్సరాల సందర్భానికహ్వానించిన సదరు ఊరి రెవెన్యూ ఉద్యోగి తూము వేంకటేశ్వర మహోదయుడు చల్లపల్లి రహదారి శుభ్రతలో పాల్గొని, ముమ్మారు ఈ గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించడం ముదావహం!

 

రేపటి మన వేకువ కృషి కేంద్రం కూడ నాగాయలంక బాటలోని అమర వీరస్తూపం సమీపమే!

 

          2225* దినాల చవితి పండుగ

 

బ్రహ్మ విద్యా? కాదు ఊరికి బాట చూపే శ్రమ విరాళం

సులభ మార్గం సుకర స్వర్గం స్వచ్ఛ సైన్యం పని విధానం

రెండు వేల దినాల పైగా పండగై సాగిన ప్రయత్నం

అనుసరింపుడు - అనుకరింపుడు ఆ సదాశయ స్ఫూర్తి మంత్రం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

10.09.2021.