2226* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

ఊరి జనుల ఆహ్లాద సాధనలో 2226* వ నాటి కృషి.

 

శనివారం (11.09.2021) నాటి బ్రహ్మ ముహూర్తానికి ముందే చల్లపల్లి కి దూరంగా కాసానగర్ దగ్గరి సామాజిక యోధుల స్మారకందగ్గర ఒక వరుసలో కన్పిస్తున్నది 18 మందైతే వాళ్ళతో వచ్చి చేరిన కార్యకర్తలు 10 మంది. గ్రామ జనాభాలో వెయ్యికొకరి నిష్పత్తిగా ఒక ప్రణాళికా బద్ధంగా - 50 పని గంటల పాటు వీళ్ళేమి సాధించారో ఒక మారు గమనిద్దాం! (నా కధనానికి సాక్ష్యంగా జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంపేరిట నడుస్తున్న సామాజిక మాధ్యమాన్ని కూడ పరిశీలించవచ్చు!)

 

గ్రామంలోకి ప్రవేశించే 7 ప్రధాన రహదార్ల స్వచ్ఛ శుభ్ర సౌందర్య నిర్వహణ పట్ల ప్రతి కార్యకర్తకూ ఒక స్పష్టమగు అవగాహన ఉంది. గ్రహించగలిగితే ప్రయాణికులకు, గ్రామస్తులకు సామాజిక స్ఫూర్తి ఉంది. ఊళ్లోనూ, వెలుపలా కార్యకర్తల ఏడెనిమేదేళ్ళ శ్రమకు సాక్షీభూతంగా వందల ఉదాహరణలు కూడా ఉన్నవి! మన ఆస్థాన గాయక కార్యకర్త వ్రాసి, పాడినట్లు గాంధీ గారు కనుక బ్రతికి వస్తే తన ఆదర్శాలను అమలు చేసే వాళ్ల కోసం అన్వేషిస్తే ముందు వరుసలో చల్లపల్లి స్వచ్చంద శ్రమదాతలే ఉంటారు!

 

ఈ వేకువ జామున కార్యకర్తలు 4 బృందాలుగా విడిపోయి, సాగించిన కృషి వివరాలిలా ఉన్నాయి :

 

1. అమర వీరుల ప్రాణ త్యాగ చిహ్నమైన స్తూపం దగ్గర ఆరేడుగురు చేసిన స్వచ్ఛ శుభ్ర సాధన. కత్తులతో, కొడవళ్ళతో, ముళ్ళ, పిచ్చి మొక్కల్ని నరికి, గడ్డి దుబ్బుల్ని తొలగించి, దంతెలతో లాగి గుట్టలు చేసిన వైనం.

 

2. స్ధూపం వెలుపల రహదారికి తూర్పుగా తామే నాటి పెంచి సృష్టించిన స్వచ్ఛ సౌందర్యాల చిరు లోపాల్ని గుర్తించి, సుందరీకర్తలు చేసిన నేల చదును పూల మొక్కల సవరణ చెక్కిన గడ్డి మొత్తం మీద తమ మనసులకు నచ్చినట్లుగా ఆ ప్రాంతం మెరుగుదల.

 

3. 10 – 12 మంది బాటకు పడమర భాగాన తొలగించిన గడ్డి, పూల మొక్కల, కుదుళ్ళ బాగు చేత, అందుకు గాను నేల మీద కూర్చొనీ, వంగీ కొడవళ్ళతో గడ్డిని, అవాంఛిత మొక్కల తొలగింపులో పొందిన తన్మయత్వం.

 

4. పై అన్నిటికి మించిన నేటి మరొక విన్యాసమేమంటే – (వీడియోలో పరీక్షించండి) బారు నిచ్చెనకు కూడ అందని పెద్ద ముళ్ళ కొమ్మను నరికేందుకు ఒక తేలిక పాటి బక్క కార్యకర్త నలుగురు గట్టి వాళ్లు పట్టుకొన్న గాలిలో వ్రేలాడుతున్న నిచ్చెన మెట్లెక్కి, కేబుల్ వైరులు తెగకుండ కొమ్మల్ని మాత్రమే నరకడం! ఈ ఐదారుగురి సాహసం వాళ్ళకైతే తృప్తికరమూ, చిరస్మరణీయమే గాని, చూస్తున్న మా బోటి వాళ్లకు మాత్రం భయకంపిత రోమాంచితం!

 

కాఫీల కబుర్లు ముగిసిన 6.25 వేళ రక్తదాన విక్రముడైన కస్తూరి విజయుడు గ్రామ స్వచ్ఛ స్వస్త - శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలు ముమ్మారు పలకగా చల్లపల్లి స్వచ్చోద్యమ అవినాభావ ప్రవాస యువకుడు నాదెళ్ళ సురేష్ అమెరికా దేశం నుండి ఫోనులో ఈ నాటి కార్యకర్తల కృషిని అభినందించి, గ్రామ విద్యార్ధుల కోసం మండవ శేషగిరిరావు గారితో కలిసి తాను చేస్తున్న ప్రయత్నాన్ని వివరిస్తే ఈ రహదారి పరిశుభ్ర సౌందర్య శోభనీ, దాని కారకుల్ని మరొకమారు మన స్వచ్ఛ వైద్యుడు తలుచుకొన్నారు.

 

రేపటి నాగాయలంక రహదారి సుందరీకరణ కోసం మన కలయిక 4.30 సమయంలో అమరయోధుల స్మారకం దగ్గరే!

 

            అనుసరిద్దాం అవశ్యంగా

 

ఏదనిత్యం ఏది నిత్యం ఏది స్వార్ధం ఏది త్యాగం?  

పరోపకృతులకు మార్గమేదో పరమ ధర్మ గరిష్ట మేదో?

ఆ విత్కరం అంతులేనిది స్వచ్ఛ సైన్యం బాట ఉన్నది

అనుసరిద్దాం అనుకరిద్దాం! స్వచ్ఛ సైన్యం అడుగుజాడలు! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

11.09.2021.