2227* వ రోజు ....

ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

27 మంది శ్రమదాతల ఉభయ తారక స్వచ్చోద్యమం @ 2227*

 

12.09.2021 – అనగా ఆదివారం! ప్రాణ త్యాగ ధనుల స్మృతి చిహ్నం! అక్కడ 10 మందికి పైగా స్వచ్చంద శ్రమదాతలు 4.20 సమయానికే ఊరి ప్రజల సంక్షేమం కోసం సంసిద్ధం! ఆ పైన అనతి కాలంలో మిగిలిన వారి ఆగమనం! ఇక తదాదిగా 110 నిముషాల పాటు నాగాయలంక రహదారి స్వచ్ఛ – శుభ్ర – సుందరీకరణం! తత్ఫలితంగా – అటు స్తూప ప్రాంగణం, ఇటు కాసానగర్ దిశగా కొంత భాగం మరింత హరిత – శుభ్ర శోభాన్వితం!

 

ఒక అంచనా ప్రకారమైతే – ఈ రెండు కిలోమీటర్ల జాతీయ మార్గం 10 రోజుల్లోనే – సుమారు 10x25 -250 మంది కార్యకర్తల – 350 పనిగంటల్లోనే పూర్తి కావచ్చు. ఐతే – రోడ్డు మరీ విశాలంగాను, వానలకు పిచ్చి చెట్ల పెరుగుదల కారణంగాను, కొందరు కార్యకర్తల ప్రత్యంగుళ పర్ఫెక్షనిజం వల్లను అంచనా సమయం దాటుతున్నది. అదే, ఈ బాట తూర్పు – పడమర ఉభయ దిశల పొలం గట్లను కూడ వీళ్ళు బాగుచేసే పని పెట్టుకొంటే ఇంకెంత జాప్యమయ్యేదో!

 

నేటి పని వివరాల కొస్తే :

 

          నిన్న బాగు చేయగా మిగిలిన – అమర ప్రాంగణం లోపలి గడ్డి – గాదం ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. ఇందులో పని చేసిన 8 మంది స్వచ్ఛ కార్యకర్తలు 8 పాదులు త్రవ్వి, 8 కోనోకార్పస్  చెట్లను నాటారు. నిచ్చెనతో ఎత్తైన స్తూపం మీదికెక్కి, అక్కడ మొలిచి, పెరుగుతున్న రావి మొక్కల్ని కూడ తొలగించినందుకు ఆ అమరయోధుల తరపున అభివందనాలు.

 

          జాతీయ రహదారికి, కుడి ఎడమల నిలవ నీటి కాలువకూ నడుమ గల, రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు పెరుగుతున్న స్తలం బాగుచేయడమే ఎక్కువ మంది చేసిన కృషి. ఇందులో భాగంగా కొందరు నిరర్ధక పిచ్చి – ముళ్ళ కంపల్ని కత్తులతో నరికారు. ఆ వ్యర్ధాల్ని కొందరు దంతెలతో పోగులు చేశారు. కొన్ని చెట్లను – తామే గతంలో నాటి పెంచిన వాటిని ట్రిమ్ చేసి, సుందరీకరించారు. రోడ్డుకు దగ్గరగా ఉన్న ఈత చెట్లు రెండిటిని ముందు సుందరీకరించి కూడ, అవి ఎప్పుడైనా ప్రయాణికులకిబ్బందని మనసుమార్చుకొని సమూలంగా పెకిలించారు. ఆ ప్రయత్నంలో పలుగుతో పని చేసి, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఒక ఆజానుబాహుణ్ణి వాట్సాప్ చిత్రంలో చూడుడు.

 

జ్వరం కారణంగా మన స్వచ్చోద్యమ మూల పురుషుడు నేడు హాజరు కాలేదు. ఏ కారణంగానో గాని ఆస్పత్రి ఇతర ఉద్యోగులు సైతం రాలేదు. వచ్చిన కార్యకర్తలు చేసిన పనితో 1 ½ కిలోమీటర్ల ఈ విశాల మార్గం ఇప్పుడెంత నయన మనోహరంగా కనిపిస్తున్నదో ఏడెనిమిదేళ్ళ ప్రయత్నం ఎంతగా సత్ఫలితాలనిచ్చిందో గ్రామస్తులు సమీక్షించుకోవాలి.

 

6.20 వేళకు, కాఫీ మర్యాదల, సరదా కబుర్ల తరువాత ఈ నాటి ఏకైక మహిళా కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ఉద్యోగిని, లంకే సుభాషిణి ముమ్మారు కాస్త ఉద్రేకంగా పలికిన గ్రామ స్వచ్ఛ – సుందర – సౌభాగ్య సంకల్ప నినాదాలతో నేటి శ్రమదాన పరిసమాప్తి!

 

బుధవారం నాటి వేకువ బందరు మార్గంలోని 6 వ నంబరు కాల్వ గట్టు పునః సుందరీకరణం కోసం మనం కలువదగిన చోటు – SRYSP కళాశాల గేటు ఎదుటనే.

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 4

 

చిక్కు ముడిగా వీధి శుభ్రత – మ్రొక్కుబడిగా మురుగు వక్రత

చాలి చాలని హరిత విస్తృతి పట్టీ పట్టని జనం వైఖరి

అట్టడుగుకే గ్రామ స్వస్తత...” అట్టి దుస్థితి చక్కదిద్దే

స్వచ్ఛ సంస్కృతి ప్రోది చేసే సాహసికులకు నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

12.09.2021.