2228* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం!

 

స్వచ్చ సుందర గ్రామ నిర్మాణంలో 2228* వ రోజు.

 

బుధవారం (15.09.2021) నాటి 24 మంది స్వచ్చోద్యమ శ్రమదాతల సందడి వేకువ 4.20 కే మొదలై – 6.12 నిముషాల దాక వినిపించింది. అందుకు నాందిగా 15+1 (చివరి సంఖ్య కాలభైరవ నేస్తానిది!) మంది వాట్సాప్ ప్రారంభ చిత్రం నిలిచింది. బందరు మార్గంలో గ్రామ సరిహద్దైన 6 వ నంబరు పంట కాల్వ గట్లు, కిలో మీటరు దూరాన బండ్రేవు కోడు కాల్వ వంతెన, ఊరి బాహ్య వలయ ఉప రహదారికీ మధ్యస్థ ప్రదేశం నేటి శ్రమదాన గ్రహీతాలు!

 

ఇన్ని వేల దినాలు ఇందరు స్త్రీ పురుష కార్యకర్తలు ఆరుగాలాలూ ఎలా, స్వప్రయోజనం లేని కృషి ఎందుకు చేయగల్గుతున్నారనే సందేహాలూ, ప్రశ్నలూ, ఆశ్చర్యార్ధకాలూ కాదు ఇప్పుడు రావలసింది. ఏడెనిమిదేళ్లుగా ఊరి మేలు కోసం జరిగే నిరంతర ఉద్యమాన్ని కళ్ళారా చూస్తూ, వింటూ కూడ తగినంత సంఖ్యలో క్రొత్త కార్యకర్తలు ఎందుకు భాగస్వాములు కావడం లేదనే ప్రశ్నే ఇక్కడ ముఖ్యం! హక్కులన్నీ తమవి, తమ బాధ్యతలన్నీ పరులవిఅని వేల మంది భావించడమేమిటనే సందేహమే కలుగవలసింది!

 

ఇక నేటి కార్యకర్తల విశేషాలు : అవి ఏళ్ళ తరబడీ గ్రామంలోను, చుట్టు ప్రక్కలా చూసి, చూసి విని, విని విసుగుపుటుతున్న పనులనుకొంటే అసలు విశేషాలే కావు; ‘గ్రామ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది రోబోలు కావు సృజన శీలురైన స్వచ్చ శుభ్ర సౌందర్య కారులుఅని గుర్తిస్తే మాత్రం ప్రతిరోజూ అవి విశేషాలనిపిస్తాయి!

 

            నేటి 2 ప్రదేశాల పరిశుభ్ర సుందరీకరణ వివరాలిలా ఉన్నవి : 

 

- 18 మంది పంట కాలువ పడమర గట్టు మీద నిర్వహించిన బాధ్యత అక్కడ రాళ్ళు రప్పలు, ప్లాస్టిక్ గోతాల, సంచుల, మద్యం సీసాల, ఎండు పుల్లల వంటి వ్యర్ధాలను నేల క్రింద నుండి పెకలించి, ఏరి, ప్రోగులు చేయడం.

 

- రహదారి నుండి వడ్లమర దాక గతంలో పదే పదే శుభ్రం చేసి, ఉద్యానంగా మార్చబడిందే గాని, కాలువ ప్రవాహాన్ని నియంత్రించే గోడల నిర్మాణం ఇటీవల జరిగి, సదరు ఉద్యానం అదృశ్యమై బాగా కంగాళీగా మారడం వల్ల ఇప్పడింకోమారు ఇందరు పాదులు త్రవ్వి మొక్కలు నాటారు. పనిలో పనిగా వంతెన దగ్గరి రెండు చెట్లను సైతం సుందరీకరించారు.

 

- ఈ వ్యర్ధాలను సైతం మిగిలిన ఐదారుగురు ట్రక్కులో నింపి, దూరంగా ఉన్న మురుగు కాల్వ దగ్గరకు చేర్చి ప్రయోజనకరంగా మార్చారు. బైపాస్ రహదారి దగ్గర 3 రేలా మొక్కలు, 6 ఇతర మొక్కలు నాటడం కూడ వీళ్ళ పనే!

 

6.25 సమయంలో శ్రావ్య ఆస్పత్రి ప్రాంగణంలో ముమ్మారు గ్రామ స్వచ్చ శుభ్ర సౌందర్య పరికల్పక నినాదాలిచ్చినది అడపా గురవయ్య. తరువాతి ఆదివారపు మధ్యాహ్న విందుకు (SRYSP కళాశాలలో) ఆహ్వానించినది లాబొరేటరీ రవీంద్ర.

 

రేపటి మన శ్రమానంద ప్రదేశం కూడ ఈ SBI సమీపమే!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.09.2021.