2229* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

స్వచ్ఛ సౌకర్య ఆదర్శ గ్రామం కోసం 2229* వ నాటి శ్రమదానం.

 

16 వ తేదీ గురువారం కూడ అదే ప్రాంతం, అదే సమయం శ్రావ్య ఆస్పత్రి ఎదుట – 4.20 వేళ ప్రారంభ చిత్రంలోని 13 మంది కాక మరో 11 మంది శ్రమదాతల పూనికలు! ఇంచు మించుగా నిన్నటి కృషే! అనగా – 6 వ నంబరు పంట కాల్వ గట్లు, 50 గజాల రోడ్డు పునర్నిర్మాణాలతో బాటు అదనంగా వాటర్ ఫౌంటైన్ దగ్గర, శ్రావ్య ఆస్పత్రి నుండి స్టేట్ బ్యాంకు దాక స్వచ్ఛ శుభ్రతా ప్రయత్నం!

 

ఏ వ్యక్తి, ఏ బృందం, ఏ కాలంలో నిర్వహించిన గ్రామ మెరుగుదల కృషినైనా సమీక్షించి నిగ్గుదేల్చే అత్త్యుత్తమ న్యాయ నిర్ణేత కాలమే గదా! ఎవరి మాటల, ఎవరి చేతల అంతః శుద్ధిని, నిజాయితీని కొలువ గలిగిందీ కార్యాచరణను బట్టే గదా! చల్లపల్లి సుదీర్ఘ కాల స్వచ్చోద్యమం సంగతీ అంతే మరి! వాళ్ళది ఊరి బాగు పట్ల నిబద్ధత అనీ అనొచ్చు; ఎడ తెగని చాదస్తపు వ్యసన మనీ అనొచ్చు; లేదా, సుదీర్ఘ సమయ ప్రణాళికా బద్ధమైన ప్రత్యామ్నాయ రహితమైన కాలానుగుణమైన విశిష్ట ఆదర్శ ప్రయత్నం గానూ భావించవచ్చు! నిజంతేలేది మాత్రం నిలకడ మీదనే!

 

బందరు రహదారి మీది 6 వ నంబరు పంట కాల్వ గట్టు కార్యకర్తలు శుభ్రపరిచింది నిన్ననే. ఐనా ఆరేడుగురు మరొకమారు నేలను తిరగేసి, అట్టడుగు నుండి రాళ్ళనూ, స్వల్పంగా ప్లాస్టిక్ తుక్కునూ ఏరగలిగారు; 50 – 60 గజాల పోరంబోకును డోజర్ తో ఎత్తు పల్లాల సవరణ చేసారు. చిన్నపాటి ఉద్యానములో నిన్న నాటిన మొక్కల పాదులు సరిదిద్ది, కాల్వ  అంచు గోడ మీద సిమెంటు స్తంభాలను పరచి, మట్టి కోసుకుపోకుండ జాగ్రత్త పడ్డారు.

 

ఐదుగురు మాత్రం కత్తి, గొర్రుల సాయంతో జాతీయ రహదారికి ఉత్తరాన ఆస్పత్రి, ఎలక్ట్రికల్ దుకాణాల ఎదుట చెత్తా చెదారాలను ఏరి, దట్టంగా ఉన్న పనికి రాని పిచ్చి మొక్కల్ని నరికి బాగు చేశారు.

 

గంగులవారిపాలెం దారిలో వాటర్ ఫౌంటైన్ దగ్గర ఇద్దరు సుందరీకర్తలదేమో మొండి చెట్ల మొదళ్ళ మొద్దులకు రంగులు వేసే కార్యక్రమం!

 

ఇక్కడ సేకరించిన మట్టి, రాళ్ళను ట్రక్కుల్లో నింపుకొని, ఏ కాల్వ గట్టునో, ఏ రోడ్డు అంచునో కోతకు గురికాకుండా చేసే ఆలోచన, ఆచరణ నలుగురు ఎంచుకొన్న మంచి పని.

 

6.25 కు కాఫీతో బాటు ప్రాతూరి శాస్త్రి గారి బిస్కట్లు అందాయి. స్వచ్చోద్యమ ప్రధాన గాయకుడు నందేటి శ్రీనివాసుడు ముమ్మారు క్రమబద్ధంగా వినిపించిన గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలు మైకు నుండి వినిపించాయి.

 

రేపటి మన కార్యక్షేత్రం నాగాయలంక బాటలోని అమరవీర స్తూపం దగ్గరే ఉండగలదు!

 

            ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 6

 

మల విసర్జన భరిత దారులు మార్గముల మ్రింగేసి కంపలు

స్మశానాలూ కర్మకాండల భవనజాలం బడులు గుడులూ

వీధులూ నిర్జీవములుగ సుదీర్ఘ కాలం చూసి చూసీ 

స్వచ్ఛ సుందర గ్రామ లబ్దికి సాహసిస్తే నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

16.09.2021.