2230* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

 

జాతీయ రహదారి సౌందర్య కల్పనలో 2230* వ రోజు.

 

 

ఈ సెప్టెంబరు మాసపు 17 వ నాటి వేకువ 4.23 నుండి 6.08 వరకూ 22 మంది స్వచ్ఛ సైనికుల శ్రమదానం చోటు చేసుకున్నది అవనిగడ్డ జాతీయ రహదారిలోని కాసానగర్ సమీపంలో! గత రెండు నాళ్ళ వ్యవధి పిదప నేడు ఊరికి 2 కిలో మీటర్ల దూరాన పునఃప్రారంభించిన కృషి ఫలించి, కాసానగర్ చెరువు సమీపిస్తున్నది. బహుశా ఇంకో నాలుగైదు పని దినాల వారానికి గాని ఉప రహదారి దాక శుభ్రపడవచ్చు.

 

 

ఈ ఏడెనిమిదేళ్ళ స్వచ్చోద్యమ సమయంలో ఈ సువిశాల రహదారినీ, తదుభయ పార్శ్వాలనూ, కాలువలనూ, గట్లనూ కార్యకర్తలు బాగు చేయడం ఏడో మారో ఎనిమిదోమారో గుర్తులేదు. పెదప్రోలు పంచాయతీకి చెందిన కాసానగర్ మహిళలు, పిల్లలు ఒకరిద్దరు వార్డు సభ్యులు పాల్గొన్న ఊపు, సందడి నేడు కనిపించలేదు. ఏ పుణ్యాత్ముడో అడపాదడపా ఒకటీ - అరా ప్లాస్టిక్ సంచుల్లో తుక్కును విసరడం ఇప్పటికీ కూడ జరుగుతూనే ఉన్నది.

 

 

ఈ వేళటి శ్రమదానం ఏ ముగ్గురు నలుగురిదో రోడ్డుకు పడమరగా జరిగింది గాని, మిగతా ఎక్కువ మంది కృషి మాత్రం తూర్పు వైపునే జరిగింది. ఆ వంద గజాల జాగాలో వానలకు ఏపుగా పెరిగిన గడ్డి లేదా? మరీ దట్టంగా కాకున్నా పిచ్చి-ముళ్ల మొక్కలకు లోటా? వాటి మధ్య ఇరుక్కున్న ఖాళీ సారా సీసాలు, బిర్యానీ ఎంగిలి పొట్లాలు, ప్లాస్టిక్ సంచులు లేకపోతే గదా? గ్రామస్తుల ఉమ్మడి బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం మిగిలి ఉన్నంత వరకూ ఈ సముచిత శ్రమదాతలకు అడుగడుగునా - దినదినమూ చాలినంత పని దొరుకుతూనే ఉంటుంది.

 

 

- ఈ శుక్రవారపు వేకువలో నలుగురు పూల మొక్కల కుదుళ్లు సరిదిద్దడమూ, ట్రిమ్ చేసి ఆకృతుల్ని మెరుగు పరచడమూ, కొన్నిటికి కొమ్మలొకటిగా చేర్చి, త్రాడు కట్టడమూ వగైరాలు చూచుకొన్నారు.

 

 

- బాట ప్రక్కల గడ్డి కోయడం, చెక్కడం నలుగురు చూచుకొన్నారు.

 

6.25 కు కాఫీల ముగింపు వేళకు తన గ్రామ మెరుగుదల కోసం, స్వచ్ఛ - శుభ్ర-సౌందర్యాల నిబద్ధత  కోసం మూడుమార్లు గట్టిగా నినదించినది పుట్టినరోజు మనిషైన కస్తూరి విజయ్. మచిలీపట్నం లో ఒక అరుదైన రక్త నమూనా దానం కోసం ఇతడు తనతో బాటు మరో ఇద్దరు - ముగ్గుర్ని అక్కడికి రమ్మని పిలవడం గమనించాను. ఈ స్వచ్ఛ రక్త దాతలకు జయం జయం!

 

 

ప్రాతూరి విద్యాసాగర్ గారి కుమారుడు వివేకానంద్ తన 30 వ పుట్టిన రోజు సందర్భంగా 2,000/- మన స్వచ్చోద్యమానికి విరాళమిచ్చినందుకు ధన్యవాదాలు.  

 

 

రేపటి వేకువ మన పునర్దర్శనం నాగాయలంక జాతీయ రహదారిలోని కాసానగర్ చెరువు దగ్గరే!

 

 

          ఇట్టి వాళ్ళకె నా ప్రణామం 7

 

 

ఎవరి బాధ్యత వాళ్లు మోయని ఈ విశాల గ్రామమందున

 

శక్తి ఉండియు ఉద్యమించని జన మన స్తత్వాలెరింగిన-

ప్రజా స్వస్తత, ఊరి సుఖమే బాధ్యతగ భావించి కదలిన-

కదం త్రొక్కిన స్వచ్ఛ -  సుందర కార్యకర్తలకే ప్రణామం!           

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

 

17.09.2021.